
వెన్ను కదులుతోంది..
● అడుగుకో గుంతతో అధ్వానంగా రోడ్లు
● పట్టించుకోని అధికారులు
● వర్షం నీటితో కనిపించని గుంతలు
● తెలియక వెళ్లి ప్రమాదాలు
● జిల్లాలో దారుణంగా 52 రోడ్లు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అడుగుకో గుంత.. కళ్లు మూసి తెరిచేలోపే మలుపులతో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు ప్రమాదకరంగా మారాయి. అసలే వర్షాకాలం.. చిన్నపాటి జల్లులకే రోడ్లు చిత్తడిగా మారిపోతున్నాయి. ఈ రోడ్లపై నీళ్లు నిలిచి ఎక్కడ గుంత ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనదారులకు బ్యాక్ పేన్(నడుమునొప్పులు) పక్కాగా వస్తున్నాయి. ఇటీవల నడుము నొప్పులతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, ఇల్లంతకుంట, వీర్నపల్లి, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి, గంభీరావుపేట మండలాల్లోని గ్రామీణ రోడ్లు గుంతలతో అధ్వానంగా మారాయి. జిల్లాలోని వివిధ రూట్లలో సుమారు 52 రోడ్లు భారీ గుంతలతో భయంకరంగా కనిపిస్తున్నాయి. గుంతల రోడ్ల దుస్థితిపై అధికారులకు ఎలాంటి పట్టింపులు లేకుండా పోయాయి. కనీసం మరమ్మతులు కూడా చేయడం లేదు.
నడుం నొప్పులతో ఆస్పత్రులకు..
గుంతల రోడ్లపై ప్రయాణాలు చేసే వారిలో 75 శాతం మంది వివిధ రకాల నడుం నొప్పులతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఆటో డ్రైవర్లతోపాటు ప్రయాణికులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. వెన్నుపూస కదలడం, డిస్క్, పక్కటెముకలు, మోకాళ్లు, మెడలు పట్టుకోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మారై, సీటీస్కాన్, ఎక్స్‌రే ఇతరత్ర పరీక్షలతో కలిసి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. నడవలేక, కదలలేక, నిలబడలేక, కూర్చుండలేక ఇబ్బందులు పడుతున్నారు.
పట్టించుకోని అధికారులు
ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖల పరిధిలోని రోడ్లు అధ్వానంగా మారినా పట్టించుకునే వారు కరువయ్యారు. వర్షాకాలంలో దెబ్బతిన్న రోడ్లను సైతం పరిశీలించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తాత్కాళికంగా మరమ్మతులు చేసే అవకాశాలున్నా పట్టించుకోవడం లేదు.
డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి
తరచూ ప్రయాణించే వారిలో ఎక్కువగా డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రాబ్లమ్ గుర్తించేందుకు ఎమ్మారై వంటి పరీక్షలకు కరీంనగర్ తరలిస్తున్నాం. తరచూ ప్రయాణించే వారు మెడ, నడుం బెల్టులను పెట్టుకోవాలి. దీని ద్వారా దీర్ఘకాలిక సమస్యలు రాకుండా నిరోధించవచ్చు. నొప్పుల ఉపశమనానికి ఫిజియోథెరపీకి పంపిస్తున్నాం. అలా కూడా నయం కాకపోతే వెన్నుపూస ఆపరేషన్లు చేయాల్సి ఉంటుంది. ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
– సునీల్, ఆర్థోపెడిక్ వైద్యుడు, ఎల్లారెడ్డిపేట
ఇది ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం శివారులోని రాపెల్లివాగు వంతెన వద్ద గల గుంతలరోడ్డు. ఈ రోడ్డు వర్షం నీటితో గుంతలుగా తయారైంది. గుంతలరోడ్డుపై ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. వాహనాలు పాడవుతున్నాయి. ఆటోడ్రైవర్లు, ప్రయాణికులు నొప్పులతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. వాహనాలు మరమ్మతులు చేసుకోవడానికి అప్పులు చేయాల్సి వస్తోందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రాపెల్లివాగు వంతెన వద్దనే కాకుండా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 52 రోడ్ల పరిస్థితులు ఇలాగే ఉన్నాయి.

వెన్ను కదులుతోంది..