రేపు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

రేపు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ

Aug 10 2025 8:32 AM | Updated on Aug 10 2025 8:32 AM

రేపు

రేపు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ

● జిల్లా వైద్యాధికారి ఎస్‌.రజిత

సిరిసిల్ల: జిల్లాలో నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఆగస్టు 11న నులి పురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేస్తామని జిల్లా వైద్యధికారి ఎస్‌.రజిత శనివారం తెలిపారు. ఏడాది వయసున్న పిల్లల నుంచి 19 ఏళ్ల వరకు మాత్రలు అందిస్తామన్నారు. పిల్లలు ఆల్బెండజోల్‌ మాత్రను నమిలి మింగేలా చూసుకోవాలని తల్లిదండ్రులను కోరారు. మానవ పేగులలో జీవించే పేగు పురుగులతో కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు, ఆకలి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వివరించారు. ఆగస్టు 11న మాత్రలు అందని పిల్లలకు 18వ తేదీన అందజేస్తారని తెలిపారు.

సాహిత్యోత్సవంలో జిల్లా కవులు

సిరిసిల్లకల్చరల్‌: బుక్‌ బ్రహ్మ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కర్నాటక రాష్ట్రం బెంగళూర్‌లో ఈనెల 8 నుంచి మూడు రోజులపాటు దక్షిణ భారత స్వరాలు శీర్షికన సాహిత్యోత్సవం నిర్వహిస్తున్నారు. రెండో రోజు శనివారం 35 మంది పాల్గొన్నారు. ఇందులో మన జిల్లా నుంచి కథారచయిత పెద్దింటి అశోక్‌కుమార్‌, బాలసాహిత్యవేత్త డాక్టర్‌ పత్తిపాక మోహన్‌ పాల్గొన్నారు. ప్రాంతీయ అస్తిత్వం సదస్సులో ప్రాంతీయ భాష అస్తిత్వ చేతన అంశంపై పెద్దింటి, బాలసాహిత్యం, రచన కళ సదస్సులో తెలుగు బాల సాహిత్యం, భాష, నాడు–నేడు అనే అంశంపై పత్తిపాక మోహన్‌ చర్చించారు.

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులపై ఆరా

వేములవాడ: రాజన్న ఆలయంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకంలో అవకతవకలు జరిగి, భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు ఆడియో టేప్‌ వైరల్‌ కావడంతో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి, కమిషనర్‌ సీరియస్‌గా వ్యవహరించారు. రాష్ట్ర స్థాయి అధికారులు వేములవాడలో విచారణ చేపట్టి బాధ్యుడైన లక్ష్మీనారాయణ అనే ప్రైవేట్‌ సూపర్‌వైజర్‌పై కేసు నమోదు చేశారు. దీంతో ఈవో రాధాభాయి ఆలయంలోని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, వారి పనితీరు, నియామకంపై ఆరా తీస్తున్నారు. ఆలయంలో పనిచేస్తున్న ఏఈవో, పర్యవేక్షకుడి స్థాయి ఉన్న అధికారులు ముడుపులు తీసుకుని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను నియమించినట్లు సమాచారం అందడంతో విచారణ తీవ్రతరం చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న, గతంలో ఇక్కడ పనిచేసి ఇతర దేవాలయాలకు బదిలీపై వెళ్లిన అధికారుల గుండెల్లో గుబులు మొదలైందని సమాచారం.

రాశిగుట్ట తండాలో ఇంటింటా జ్వర సర్వే

వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని భూక్యతండా గ్రామపంచాయతీ పరిధిలోని రాశిగుట్టతండాలో పీహెచ్‌సీ వైద్యుడు బాలకృష్ణ ఆధ్వర్యంలో శనివారం ఇంటింటా జ్వరసర్వే చేపట్టారు. వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అవసరమైన వారికి మందులు అందజేశారు.

ఘనంగా క్విట్‌ ఇండియా ఉద్యమ వేడుకలు

సిరిసిల్లటౌన్‌: క్విట్‌ ఇండియా ఉద్యమ వేడుకలను శనివారం సిరిసిల్లలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్‌ కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయణగౌడ్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ పట్ట ణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్‌, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, గడ్డం నర్సయ్య, సూర దేవరాజు పాల్గొన్నారు.

రేపు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ
1
1/2

రేపు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ

రేపు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ
2
2/2

రేపు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement