
భక్తిశ్రద్ధలతో నూలుపౌర్ణమి
సిరిసిల్లకల్చరల్: పద్మశాలీయుల ఆరాధ్య దైవం మార్కండేయుని శోభాయాత్ర జిల్లా కేంద్రంలో శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఏటా నూలు పౌర్ణమి పర్వదినంగా జరుపుకోవడం ఆనవాయితీ. రాష్ట్రంలో సిరిసిల్లలో మాత్రమే నూలుపౌర్ణమి వేడుక నిర్వహిస్తారు. కదిలే వాహనంపై మగ్గం ఉంచి వస్త్రం నేసి ఇలవేల్పు మార్కండేయునికి సమర్పించడం ఇక్కడి ప్రత్యేకత. మార్కండేయ మందిరంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. అదే ప్రాంగణంలో సామూహిక యజ్ఞోపవీత ధారణ, రక్షాబంధన్ నిర్వహించారు. అనంతరం స్వామి వారి శోభాయాత్ర పట్టణ ప్రధాన వీధుల గుండా నిర్వహించారు. పాతబస్టాండ్‌లోని చేనేతన్న విగ్రహానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు పూలమాలలు వేశారు. గ్రంథాలయసంస్థ జిల్లా చైర్మన్ నాగుల సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు సంగీతం శ్రీనివాస్, చొప్పదండి ప్రకాశ్, యెల్లె లక్ష్మీనారాయణ, తాటిపాముల దామోదర్, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ఆడెపు రవీందర్, గూడూరి ప్రవీణ్, పద్మశాలీ నేతలు మోర రవి, మండల సత్యం, గాజుల బాలయ్య, కాముని వనిత, ఆడెపు చంద్రకళ, గుజ్జె తార, పిస్క మధు, పలువురు వస్త్రోత్పత్తిదారులు పాల్గొన్నారు.