మంత్రుల పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
రుద్రంగి(వేములవాడ): రుద్రంగిలో శుక్రవారం మంత్రులు పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బీ గీతేలతో ఏర్పాట్లపై స్థానిక గ్రామపంచాయతీలో గురువారం సమీక్షించారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ భాభారతి చట్టం అమలులో భాగంగా జిల్లాలో రుద్రంగిని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందునా శుక్రవారం నిర్వహించే రెవెన్యూ సదస్సుకు రుద్రంగిలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌గౌడ్ హాజరవుతున్నట్లు తెలిపారు. మండలంలో మంజూరైన 243 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఇళ్ల దరఖాస్తులు పెండింగ్ ఉంటే వెంటనే మంజూరు చేయాలని అధికారులకు ఆదేశించారు. మంత్రుల పర్యటనకు రైతులు, ఇందిరమ్మ లబ్ధిదారులు, మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ భూభారతి రెవెన్యూ సదస్సుల నిర్వహణ, ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపనలో మంత్రులు పాల్గొంటారని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వి.రాధాబాయ్, రుద్రంగి తహసీల్దార్ శ్రీలత, ఎంపీడీవో నటరాజ్, ఈఈ ఆర్‌బీ వెంకట రమణయ్య, ప్రాజెక్టు డైరెక్టర్ హౌసింగ్ శంకర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
నేడు రుద్రంగిలో పర్యటించనున్న మంత్రుల బృందం


