ప్రొటోకాల్ వివాదంతో ఉద్రిక్తత
గంభీరావుపేట(సిరిసిల్ల): బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ప్రొటోకాల్ వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు గురువారం ఐకేపీ అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు చేరుకున్నారు. అక్కడే ఉన్న బీఆర్‌ఎస్ నాయకులు పెద్దవేని వెంకటి, గోగు లింగం, వెంకటస్వామిగౌడ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో ఎందుకు పె ట్టలేదని అధికారులను ప్రశ్నించారు. ఫ్లెక్సీని తొలగించాలని కోరగా.. స్పందన రాకపోవడంతో వారే తొలగించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు అక్కడికి చేరుకొని బీఆర్‌ఎస్ నాయకులను అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య నేతృత్వంలో వివిధ మండలాల నుంచి ఆ పార్టీ నాయకులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఠాణాకు వచ్చి బీఆర్‌ఎస్ నాయకులపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సీఐ శ్రీనివాస్‌గౌడ్, ఎస్సై ప్రేమానంద్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.


