● అకాలవర్షంతో దెబ్బతిన్న పంటలు ● జిల్లాలో భారీగా పంటనష్టం ● చందుర్తిలో 500 ఎకరాలకు పైగానే..
ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు తిప్పని భూమేశ్. తనకున్న ఎనిమిదెకరాల్లో ఏడున్నర ఎకరాల్లో వరిసాగు చేశాడు. మిగతా 20 గుంటల్లో నువ్వు సాగుచేశాడు. 6 ఎకరాల వరిపొలం మరో 20 రోజుల్లో కోత దశలో ఉంది. శుక్రవారం కురిసిన వడగండ్ల వానకు సగానికి పైగా వడ్లు రాలిపోయాయి. ఇప్పటికే ఎకరాకు రూ.25వేల వరకు పెట్టుబడి పెట్టాడు. సగానికి పైగా పంట దెబ్బతినడంతో పెట్టుబడి చేతికి రాదన్న బెంగతో ఉన్నాడు.
చందుర్తి(వేములవాడ): నీరు లేక పొలాలు ఎండి పోగా.. వడగండ్ల వాన దాడితో రైతులు మరింత నష్టపోయారు. జిల్లాలో భారీ స్థాయిలో పంట నష్టం ఏర్పడింది. చందుర్తి మండలంలో దాదాపు 500 ఎకరాలకు పైగా వరిపంట నష్టం ఏర్పడింది. ముస్తాబాద్, వీర్నపల్లి, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, ఇల్లంతకుంట మండలాల్లో వరిపంటకు తీవ్రస్థాయిలో నష్టం ఏర్పడింది. మరో 20 రోజుల్లో పంట కోతకు రానుండగా అకాలవర్షానికి పంట నేలపాలైంది. వడగండ్ల వానతో వరిపొలాలు నేలకొరిగిపోగా.. మామిడికాయలు రాలిపోయాయి. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయాధికారులు పంటనష్టం వివరాలు సేకరిస్తున్నారు. మరో రెండు రోజుల్లో నష్టం తెలియనుంది. నీరు లేక సగానికి పైగా పంట ఎండిపోయిందని, వడగండ్ల వానతో మిగిలిన సగం కూడా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎకరాకు కనీసం రూ.25వేలు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.
ఎండిన పొలంపై వడగండ్ల దాడి


