
కీర్తి పురస్కారం అందుకుంటున్న శ్రీనివాసరాజు
సిరిసిల్లకల్చరల్: జిల్లాకు చెందిన చరిత్ర పరిశోధకుడు డాక్టర్ చెన్నమాధవుని శ్రీనివాసరాజు మరో పురస్కారం అందుకున్నారు. వివిధ రంగాల్లో కృషిచేసిన వ్యక్తులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏటా అందించే కీర్తి పురస్కారాల్లో భాగంగా జిల్లా వాసి సి.శ్రీనివాసరాజును పరిశోధన విభాగంలో ఎంపిక చేసింది. బుధవారం వర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో తిక్కవరపు రామిరెడ్డి స్మారక పురస్కారాన్ని అందజేసింది. వర్సిటీ ఉపకులపతి డాక్టర్ తంగెడ కిషన్‌రావు, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శ్రీనివాసరాజు స్వస్థలం బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి. చరిత్ర పరిశోధన సమితిని స్థాపించారు. చారిత్రక ప్రాధాన్యం గల ప్రాంతాలను సందర్శించి అనేక విశేషాలను వెలుగులోకి తెస్తున్నారు. ఈక్రమంలో బహదూర్ కొండలరాయుడు నవల, భరతావని అనే కావ్యం, చక్రేశ్వరిదేవి, బొమ్మలమ్మగుట్ట శతకం, ప్రిన్సెస్ యశోధర అనే చారిత్రక నాటకం, ముసునూరి కాపయ నాయకుడు నవల, అన్‌బీటెన్ ఎంపైర్ పేరిట వేములవాడ చరిత్ర, కెప్టెన్ రఘునందన్ జీవిత చరిత్ర, హిస్టరీ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, మానవ జీవన పరిరక్షణ పేరిట కవితలు వెలువరించారు. ప్రిన్సిపాల్‌గా విశ్రాంత జీవనం గడుపుతూనే చరిత్ర పరిశోధన రంగంలో విశేష కృషి చేస్తున్న శ్రీనివాసరాజుకు కీర్తి పురస్కారం అందుకోవడంపై సాహితీవేత్తలు అభినందించారు.
చరిత్ర పరిశోధనలో కృషికి అందజేత