● ఒకప్పుడు నేరెళ్ల నియోకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. తొలినాళ్లలో పీడీఎఫ్ అభ్యర్థులు విజయం సాధించగా.. తరువాత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. పాటిరాజం మరణాంతరం జరిగిన 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సుద్దాల దేవయ్య కాంగ్రెస్ అభ్యర్థి గొట్టె భూపతిపై అనూహ్య విజయం సాధించారు. 1999లోనూ దేవయ్య గెలుపొందారు. 2004లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కాసిపేట లింగయ్య, సుద్దాల దేవయ్యపై విజయం సాధించారు. 2009 మహాకూటమి అభ్యర్థిగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తనయుడు కె.తారకరామారావు సిరిసిల్ల బరిలో నిలిచి 171 స్వల్ప ఓట్ల తేడాతో స్వతంత్ర అభ్యర్థి కె.కె.మహేందర్‌రెడ్డిపై విజయం సాధించారు. ప్రస్తుతం కె.కె.మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. 2010లో రాష్ట్ర సాధన ఉద్యమంలో కేటీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా.. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ కేటీఆర్, మహేందర్‌రెడ్డిపై గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కొండూరి రవీందర్‌రావుపై కేటీఆర్ విజయం సాధించారు. ప్రస్తుతం కొండూరి రవీందర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరి, టెస్కాబ్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. తర్వాత వివిధ పరిణాలతో టీఆర్‌ఎస్ పార్టీ బీఆర్‌ఎస్‌గా మారింది. బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మళ్లీ మంత్రి కేటీఆర్ బరిలో దిగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా కె.కె. మహేందర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రాణి రుద్రమారెడ్డి పోటీలో ఉంటుండగా.. ఇంకా బీఎస్పీతోపాటు ఇతర పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించలేదు. సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు రాష్ట్ర కీలకమంత్రిగా ఉండడంతో జిల్లా కేంద్రంతోపాటు నియోజకవర్గంలో గత తొమ్మిదేళ్లలో అభివృద్ధి పనులు వేగంగా జరిగాయి. నియోజకవర్గ రూపురేఖలు మారిపోయాయి. మెడికల్ కాలేజీ, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్, వ్యవసాయ డిగ్రీ కాలేజీతోపాటు గార్మెంట్ పరిశ్రమ విస్తరించాయి. జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరిగాయి.


