మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైఎస్సార్ సీపీ అవకాశం ఇచ్చింది చైర్మన్‌గా గెలిపిస్తే పట్టణ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తా ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి వైఎస్సార్ సీపీ కందుకూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వల్లూరి కోటేశ్వరరావు
కందుకూరు: ‘‘15 ఏళ్ల తరువాత జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని సామాన్యుడైన నాకు వైఎస్సార్ సీపీ ఇచ్చింది. చైర్మన్ సీటు జనరల్ కేటగిరీకి కేటాయించినా పార్టీ ఇన్‌చార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ బీసీ సామాజిక వర్గానికి చైర్మన్ సీటు కేటాయించడం అభినందనీయం. పది రోజుల విస్తృత ప్రచారం అనంతరం పట్టణ సమస్యలపై స్పష్టమైన అవగాహనతో ఉన్నా, చైర్మన్‌గా గెలిపిస్తే పట్టణ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనిచేసేందుకు కృషి చేస్తాను. నేడు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి చైర్మన్‌గా గెలిపించాలంటూ’’ కందుకూరు మున్సిపాలిటీ వైఎస్సార్ సీపీ చైర్మన్ అభ్యర్థి వల్లూరి కోటేశ్వరరావు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు బుధవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు..
వామపక్ష భావజాలం నుంచి వచ్చాను...పేదల కష్టాలు తెలుసు:
నా కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. నా తండ్రి వల్లూరి రామకోటయ్య కందుకూరులో సీపీఎం వ్యవస్థాపకుల్లో ఒకరు. అందువల్ల విద్యార్థి దశ నుంచే వామపక్ష భావజాలం మెండుగా ఉంది. పేదలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లో కొనసాగుతున్నాం. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నాను. గతంలో పార్టీ బీసీ సెల్ జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేశాను. ప్రస్తుతం సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో కలిపి ఏర్పాటు చేసిన బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌గా కూడా పనిచేశాను. మా కుటుంబం తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాను. స్థానిక రాజకీయ పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఉంది.
వైఎస్సార్ సీపీతోనే సామాజిక న్యాయం:
వాస్తవానికి కందుకూరు మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని ఓసీ జనరల్ అభ్యర్థికి కేటాయించారు. పార్టీలో ఓసీ వర్గానికి చెందిన బలమైన నాయకులు ఆశించినా పార్టీ ఇన్‌చార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నాకు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. అన్ని విధాలా సహకరించి ముందుకు నడిపిస్తున్నారు. ఈ ప్రోత్సాహంతోనే అధికార పార్టీని దీటుగా ఎదుర్కొంటున్నాం. సులభంగా గెలుస్తాం అనే స్థాయి నుంచి నేడు వైఎస్సార్ సీపీని చూసి భయపడే స్థాయికి అధికార పార్టీ నేతలు వచ్చారు. కచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయం సాధిస్తుందే నమ్మకం బలంగా ఉంది.
మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తా
ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలో పర్యటిస్తున్నప్పుడు అనేక సమస్యలు స్థానికులు మా దృష్టికి తెచ్చారు. ప్రధానంగా కాలనీల్లో డ్రైనేజీ, రోడ్ల వ్యవస్థ లేక అవస్థలు పడుతున్నామని మెజార్టీ ప్రజలు చెప్పారు. పట్టణాన్ని సుందరంగా తయారు చేయాలి. తాగునీటిని అన్ని ప్రాంతాలకు సక్రమంగా అందించాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయం సాధిస్తే మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. అలాగే గత ప్రభుత్వంలో ఇంటికే సంక్షేమ పథకాలు ఇచ్చారని, ప్రస్తుతం ఏ పథకం రావడం లేదంటూ పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గెలుపుపై ధీమాగా ఉన్నాం
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నాటికి.. నేటికి అధికార పార్టీ నాయకుల స్వరం పూర్తిగా మారిపోయింది. క్లీన్ స్వీప్ చేస్తామనే స్థాయి నుంచి మెజార్టీ స్థానాల్లో గెలుస్తాం అనే పరిస్థితికి అధికార పార్టీ వచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై మొదటి నుంచి వైఎస్సార్ సీపీ ధీమాగానే ఉంది. చైర్మన్ స్థానంలో పాటు, మెజార్టీ కౌన్సిలర్ స్థానాలు గెలుచుకుంటామని నమ్మకం మాకు ఉంది. రెండున్నరేళ్ల అధికార పార్టీ పాలనపై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతే దీనికి ప్రధాన కారణం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు కలిసొస్తాయని భావిస్తున్నా.
స్వేచ్ఛగా ఓటు వేయాలి
నేడు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేస్తారని ఆశిస్తున్నా. నాలాంటి సామాన్యుడికి ఓటు వేసి గెలిపిస్తే పేద ప్రజలకు అండగా ఉంటా. నేను చేసే సేవా కార్యక్రమాలను మరింతగా విస్తరించేందుకు అవకాశం ఇవ్వమని ఓటర్లను కోరుతున్నా. నాతో పాటు, 40వ వార్డుల్లో పోటీలో ఉన్న వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి.


