పరదాల మాటున పోలింగ్‌ కేంద్రాలు | - | Sakshi
Sakshi News home page

పరదాల మాటున పోలింగ్‌ కేంద్రాలు

Nov 26 2026 1:35 AM | Updated on Nov 26 2026 1:35 AM

పరదాల మాటున పోలింగ్‌ కేంద్రాలు ● కనబడని సీసీ కెమెరాలు నైట్‌ షిఫ్ట్‌ కోర్టులొద్దు ● న్యాయవాదుల నిరసన మెనూ అమలు తీరుపై ఐటీడీఏ పీవో ఆగ్రహం

● కనబడని సీసీ కెమెరాలు

సింగరాయకొండ: మండలంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ కేంద్రాల్లో వసతులను చూసి పోలింగ్‌ అధికారులు విస్తుపోవటంతో పాటు కలెక్టర్‌ రాజాబాబుకు ఫిర్యాదు చేశారు. జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో పరదాల మాటున పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయటంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. మండలంలోని 10 గ్రామ పంచాయతీల్లో కనుమళ్ల, శానంపూడి గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌, వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన 8 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిల్లో 118 పోలింగ్‌ బూత్‌లకు గాను 520 మంది పోలింగ్‌ అధికారులను నియమించారు. ఈ పోలింగ్‌ బూత్‌లలో సిబ్బందికి సరైన వసతులు కల్పించటంలో అధికారులు విఫలమయ్యారు. రైల్వేస్టేషన్‌ రోడ్డులోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో తరగతి గదులు చాలకపోవటంతో వరండాల్లోనే పరదాలు కట్టి పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అంతేకాక ప్రతి పోలింగ్‌ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు ఉన్నా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని పోలింగ్‌ అధికారులే చెప్పడం విశేషం. ఒక్కో పోలింగ్‌ బూత్‌కు నలుగురు అధికారులను కేటాయించారని ఆరుబయట ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లలో ఏవిధంగా బస చేయాలో అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలోని మొదటి అంతస్తులో తరగతి గదులు ఖాళీగా ఉన్నా వాటిల్లో వసతి ఏర్పాటు చేయలేదని దీంతో దోమల బెడద కారణంగా రాత్రిళ్లు జాగారం చేయాల్సిన పరిస్థితి ఉందని పోలింగ్‌ అధికారులు వాపోతున్నారు. బుధవారం రాత్రి పోలింగ్‌ కేంద్రాలను చూడటానికి కలెక్టర్‌, ఎస్పీ వస్తున్నారని సమాచారంతో వారు వస్తే ఫిర్యాదు చేయటానికి సిద్ధంగా ఉన్నామని, కానీ వారు రాలేదని దీంతో కలెక్టర్‌ కు వాట్సప్‌ ద్వారా ఫిర్యాదు చేశామని పేరు చెప్పటానికి ఇష్టపడని పోలింగ్‌ అధికారి వివరించారు.

మార్కాపురం టౌన్‌: దేశ వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలనే నెపంతో విశ్రాంత న్యాయవాదులతో నైట్‌ షిఫ్ట్‌ కోర్టులను ప్రస్తుతం 3 రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ బుధవారం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కోర్టు సెంటర్‌లో లాయర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో న్యాయవాదులకు రక్షణ చట్టం అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లంపాటి శివశంకర్‌ రెడ్డి మాట్లాడుతూ మొదటి విడతగా దేశంలో మూడు రాష్ట్రాల్లో నైట్‌ కోర్టులు నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన పట్ల న్యాయవాదుల నుంచే గాక అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వల్లభనేని కాశయ్య, ఎస్‌కే మహబూబ్‌ వలి, మాజీ అధ్యక్షుడు బి.రంగా రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు ఉమ్మడి రవీంద్రనాథ్‌, న్యాయవాదులు ఇమ్మడిశెట్టి నాగేశ్వరరావు, రామచంద్ర, టి.హరికృష్ణ, యద్దనపూడి అనిల్‌, కడియం రామయ్య తదితరులు పాల్గొన్నారు.

పెద్దదోర్నాల: మండలంలోని మర్రిపాలెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు సరైన మెనూ అమలు చేయకపోవడంపై ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పీవీఎస్‌ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్‌ రూంలో సరిపడా సరుకులు లేకపోవడాన్ని గమనించి మండిపడ్డారు. డిప్యూటీ వార్డెన్‌ హాజరు పట్టికలో సంతకం చేసి పాఠశాలలో లేకపోవడం, ఉపాధ్యాయులు సైతం అందుబాటులో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి భోజన వసతులపై ఆరా తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement