మద్దిపాడు: గుర్తుతెలియని కారు ఢీకొని ఆటో బోల్తా పడిన ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం బుధవారం మధ్యాహ్నం మద్దిపాడు మండలంలోని వెల్లంపల్లి బ్రిడ్జిపై చోటుచేసుకుంది. అందిన వివరాల ప్రకారం.. చిలకలూరిపేట సమీపంలోని నాదెండ్ల మండలానికి చెందిన ఆటో డ్రైవర్ ఏడుకొండలు, అతని భార్య నాగజ్యోతి.. బొప్పాయి కాయలు కొనుగోలు చేసిన వెంకటేశ్వర్లుతో కలిసి నాదెండ్ల బయలుదేరారు. వెల్లంపల్లి బ్రిడ్జిపైకి రాగానే వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఆటో తిరగబడింది. తీవ్రంగా గాయపడిన ముగ్గురినీ 108 వాహనంలో ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. మద్దిపాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కనిగిరి: పట్టణంలోని అర్బన్ కాలనీలో ఓ యువకుడిపై మరో వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. వివరాలు.. మాలధారణలో ఉన్న స్థానిక యువకుడు కిషోర్ ఆలయం నుంచి ఇంటికి వెళ్తుండగా, ఓ వీధిలో జరుగుతున్న గొడవను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడు కత్తిపోట్లకు గురయ్యాడు. పాతకక్షలతోనే ఈ దాడి జరిగిందన్న ప్రచారం సాగుతోంది. తీవ్రంగా గాయపడిన కిషోర్‌ను బుధవారం ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. దీనిపై తమకు ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్పారు.
మార్కాపురం టౌన్: డిపో మేనేజర్ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏపీ పీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఆర్టీసీ డిపో వద్ద గేట్ మీటింగ్ నిర్వహించారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్.జనార్దన్‌రావు మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు కార్మికులపై చర్యలు తీసుకోకూడదని ఉన్నతాధికారులు స్పష్టం చేసినా, డీఎం అకారణంగా షోకాజ్ నోటీసులు ఇచ్చి సస్పెండ్ చేస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించారు. వినతిపత్రం ఇచ్చినా సమస్యలు పరిష్కరించకపోగా కొత్తవి సృష్టిస్తున్నారని విమర్శించారు. తీరు మార్చుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డిపో అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఎం.ఎన్.కుమార్, గ్యారేజీ కార్యదర్శి ఎం.మోహన్‌రావు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.


