ఎన్నికల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు

Nov 26 2026 1:35 AM | Updated on Nov 26 2026 1:35 AM

నేడు కందుకూరు మున్సిపల్‌, మొదటి దశ పంచాయతీ ఎన్నికలు మొదటి దశలో 139 పంచాయతీలుగాను 62 పంచాయతీల్లో ఎన్నికలు ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశాం విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు

కందుకూరు: కందుకూరు మున్సిపల్‌ ఎన్నికలతో పాటు మొదటి దశలో ఎన్నికలు జరిగే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు విస్తృతమైన ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ రాజాబాబు తెలిపారు. ఎస్పీ హర్షవర్ధన్‌రాజుతో కలిసి బుధవారం స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కందుకూరు మున్సిపాలిటీ చైర్మన్‌ స్థానంతో పాటు, 40 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో 47,470 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లు సులభంగా ఓటు హక్కు వినియోగించుకునేలా 44 ప్రాంతాల్లో 65 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వీటికి సంబంధించి ఎన్నికల సిబ్బందిని పూర్తిగా కేటాయించినట్లు తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో కందుకూరు మున్సిపల్‌ ఎన్నికలను పర్యవేక్షణ చేస్తామని తెలిపారు.

అలాగే మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జిల్లాలో 139 పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇచ్చారని, వీటిలో ఇప్పటికే 62 సర్పంచ్‌ స్థానాలు, 782 వార్డులు ఏకగ్రీవమయ్యాయని తెలిపారు. మిగిలిన 77 సర్పంచ్‌ స్థానాలు, 610 వార్డుల్లో నేడు పంచాయితీ ఎన్నికలు జరుగుతాయని వివరించారు.

సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు

ఇటు కందుకూరు మున్సిపల్‌ ఎన్నికలు, అటు పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడైతే సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉంటాయో అక్కడ మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, మిగిలిన పోలింగ్‌ కేంద్రాల వద్ద పూర్తి వీడియోగ్రఫీ ఉంటుందని తెలిపారు. పోలింగ్‌ కేంద్రం లోపల, బయట వీడియో తీస్తారని వివరించారు. పంచాయతీల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్‌ ఉంటుందని, ఆ తరువాత ఓట్ల లెక్కింపు చేపడతామని తెలిపారు. అలాగే కందుకూరు మున్సిపాలిటీలో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని, ఈనెల 30వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పారు. ప్రజలు తమ ఓటు హక్కు స్వేచ్ఛగా ఉపయోగించుకోవాలి. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా సమస్య ఉంటే జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కాల్‌ సెంటర్‌ నంబర్‌ 1077కి సమాచారం ఇవ్వవచ్చునని తెలిపారు. అలాగే ఏజెంట్‌లకు సంబంధించి పోలీస్‌ ఎన్‌ఓసీలు తీసుకోవాలనే నిబంధనల ఏమీ లేదని దీనికి సంబంధించి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు.

పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశాం

మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. 40 వార్డుల్లో జరిగే ఎన్నికల కోసం 160 మంది పోలీస్‌ సిబ్బంది, పంచాయతీ ఎన్నికలకు 1180 మంది బందోబస్తు విధుల్లో ఉంటారని తెలిపారు. అదనంగా స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ పనిచేస్తుందని వివరించారు. మున్సిపాలిటీ పరిధిలో 9 అత్యంత సమస్యాత్మక, 13 సమస్యాత్మక ప్రదేశాలను గుర్తించి భద్రతాపరమైన ఏర్పాట్లు చేశామన్నారు. అడిషనల్‌ ఎస్పీ మున్సిపల్‌ ఎన్నికలను నిరంతరం పర్యవేక్షిస్తారని, మున్సిపల్‌ ఎన్నికల కోసం జిల్లాలోని డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌లు అందరిని కేటాయించామని వివరించారు. సమావేశంలో సబ్‌కలెక్టర్‌ దామెర హిమవంశీ, డీఎస్పీ సీహెచ్‌వీ బాలసుబ్రహ్మణ్యం, మున్సిపల్‌ కమిషనర్‌ కే అనూష తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement