చైర్మన్ అభ్యర్థుల ఎంపికపై ఆసక్తి
కందుకూరు: దాదాపు 15 ఏళ్ల విరామం అనంతరం కందుకూరు మున్సిపాలిటీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు గురువారం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఎన్నికల సందడి ప్రారంభమైంది. దీంతో అటు రాజకీయ పార్టీలతో పాటు, ఇటు సామాన్య ప్రజల్లో కందుకూరు మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే గెలుపు గుర్రాల ఎంపిక కోసం రాజకీయ పార్టీలు కుస్తీలు పడుతున్నాయి. ఇప్పటి వరకు అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి రాకపోగా మరోపక్క శనివారం నుంచి అభ్యర్థుల నామినేషన్‌ల దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీంతో ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశావాహుల్లో హడావుడి ప్రారంభమైంది. మొత్తం 40 వార్డులకు సంబంధించి కౌన్సిలర్ అభ్యర్థులతో పాటు, చైర్మన్ అభ్యర్థి ఎంపికపై నేటి వరకు ప్రధాన పార్టీలో పూర్తి స్థాయి స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై కూడా ప్రజల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
పాలిటెక్నిక్ కాలేజీలో నామినేషన్ల కేంద్రం
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేష న్లు దాఖలు చేసేందుకు మున్సిపల్ కార్యాలయం కాకుండా ఉప్పుచెరువు రోడ్డులోని పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు చేశారు. చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్లను ఇక్కడే స్వీకరించనున్నారు. దీనికి గాను ఇప్పటికే అధికారులు పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 14, 15,16వ తేదీల్లో మూడు రోజుల పాటు అభ్యర్థుల నామినేషన్‌లు దాఖలు చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. నామినేషన్‌ల ప్రక్రియ పూర్తయిన తరువాత 17వ తేదీ నామినేషన్‌ల పరిశీలన, 19వ తేదీ ఉపసంహరణకు గడువు విధించారు. ఆ తరువాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను అధికారుల ప్రకటించనున్నారు. ఆ తరువాత ఈనెల 26వ తేదీ ఎన్నికల నిర్వహణ, 30వ తేదీ ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. అయితే నామినేషన్‌ల ప్రారంభానికి ఒక్కరోజు గడువు మాత్రమే ఉండడంతో ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థుల్లో హడావుడి ప్రారంభమైంది.
కందుకూరు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల
రేపటి నుంచి 16వ తేదీ వరకు నామినేషన్లు
17న నామినేషన్‌ల పరిశీలన,
19న ఉపసంహరణ
26వ తేదీ ఎన్నికలు,
30న ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లడి
ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్‌ని ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకోనుండడంతో చైర్మన్ అభ్యర్థులుగా ఎవరు బరిలో ఉంటారనే ఆసక్తి ప్రజల్లో నెలకొంది. ప్రధానంగా వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీ మధ్యే పోటీ ఉండడం, ఈ రెండు పార్టీల నుంచి ఎవరు చైర్మన్ అభ్యర్థిగా బరిలో దిగుతారనే చర్చలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీలో ఈ వ్యవహారం తీవ్ర గందరగోళంగా మారింది. దీంతో ఆ పార్టీ అభ్యర్థిని ఎంపిక చేసుకునేందుకు నానా అవస్థలు పడుతుంది. మరోపక్క వైఎస్సార్ సీపీ తరఫున చైర్మన్ అభ్యర్థి ఎంపిక కోసం శుక్రవారం కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. అందరి ఆమోదంతో చైర్మన్ అభ్యర్థిని ఎంపిక చేసేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. పార్టీ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్ యాదవ్ పార్టీ ముఖ్యనాయకుల సూచనలకు అనుగుణంగా చైర్మన్ అభ్యర్థి ఎంపిక చేసి అధిష్టానం ఆమోదం తరువాత ప్రకటించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఇద్దరి, ముగ్గురు నాయకుల పరిశీలనలో ఉండగా వారిలో ఒకరిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి.


