పొదిలి: పొదిలి నగర పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నగర పంచాయతీగా ఏర్పడిన ఆరేళ్ల తర్వాత పొదిలిలో ఎన్నికలు జరగనున్నాయి. గురువారం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఎన్నికల సందడి ప్రారంభమైంది. నగర పంచాయతీకి సంబందించి మొత్తం 29695 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుష ఓటర్లు 14820, మహిళా ఓటర్లు 14875 మంది ఉన్నారు. తొలుతగా 20 వార్డులు ఉండగా తదనంతరం జరిగిన పరిమాణాల్లో 28 వార్డులు చేశారు.
కోర్టు కేసులతో ఎన్నికలు వాయిదా..
నగర పంచాయతీగా పొదిలి ఏర్పడి ఐదేళ్లు దాటినా కోర్టు కేసుల కారణంగా ఇప్పటి వరకు ఎన్నికలు జరగలేదు. కంభాలపాడు, మాదాలవారిపాలెం, నందిపాలెం గ్రామాలను నగర పంచాయతీలో విలీనం చేసినందుకు తొలుత తెలుగుదేశం పార్టీ వర్గీయులు కోర్టుకు వెళ్లారు. ఆయా గ్రామ పంచాయతీలకు సంబంధించి వైఎస్సార్ సీపీ బలంగా ఉండటంతో, నెగ్గుక రాలేమనే ఆలోచనతోనే అప్పట్లో కోర్టులో కేసులు వేశారనే ప్రచారంసాగింది. ఇటీవల 20 వార్డులను 28 వార్డులుగా పెంచారు. 3వ వార్డును ఎస్టీలకు కేటాయించారు.13,20 వార్డులను ఎస్సీ మహిళలకు, 5,19,16 వార్డులను ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. 10,9,8,25 వార్డులను బీసీ మహిళలకు, 4,7,22,23 బీసీ జనరల్‌కు, 2,6,11,12,14,21,28 వార్డులను జనరల్ మహిళలకు, 1,15,17,18,26,27 వార్డులను జనరల్‌కు కేటాయించారు. అయితే చైర్మన్ పదవి రిజర్వేషన్‌కు సంబంధించి పలు విమర్శలు వస్తున్నాయి. తొలుత ఎన్నికలు జరుగుతున్న నగర పంచాయతీ కావడంతో జనరల్‌కు కేటాయించాల్సి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనరల్‌కు కేటాయిస్తే టికెట్ ఎవరికి ఇవ్వాలనే ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో. రిజర్వేషన్ ఎస్సీకి కేటాయించేలా కూటమి నాయకులు చూశారనే ఆరోపణలు సాక్షాత్లూ ఆ పార్టీ నాయకులు నుంచే వస్తుండటం గమనార్హం. చైర్మన్ పదవి రిజర్వేషన్ ఏ కేటగిరికి మంజూరైనా ఎన్నికలు నియమ నిబంధనల మేరకు జరిగితే వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
పొదిలి: స్థానిక నగర పంచాయతీకి ఎన్నికల నగరా మోగింది. నవంబర్ 14 నుంచి 16వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 17వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు. నవంబర్19వ తేదీన నామినేషన్లకు ఉపసంహరణకు చివరీ తేదీగా నిర్ణయించారు. నవంబర్ 26న పోలింగ్, నవంబర్ 30న ఓట్ల లెక్కింపు జరుగుతుందని అధికారులు తెలిపారు.
పొదిలిలో
నగర పంచాయతీ ఏర్పడిన
ఆరేళ్లకు ఎన్నికలు
నోటిఫికేషన్ విడుదల


