సంతనూతలపాడు: మండల కేంద్రమైన సంతనూతలపాడులో విజిలెన్స్ అధికారులు గురువారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. రెండు బృందాలుగా ఏర్పడిన అధికారులు బియ్యం, వంటనూనెలు, నిత్యవసరాల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. సంతనూతలపాడులోని పలు బియ్యం దుకాణాలతో పాటు దత్త సాయి రైస్ ట్రేడర్స్, శృతి ట్రేడర్స్, వెంకటేశ్వర ఆయిల్ ట్రేడర్స్ తదితర వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారంటూ వ్యాపారులపై ఐదు కేసులు నమోదు చేసి రూ.52,500 విలువైన సరుకుల విక్రయాలు నిలిపివేశారు. వెంకటేశ్వర ఆయిల్ ట్రేడర్స్‌పై 6(ఏ) కేసు నమోదు చేసి సుమారు రూ.3 లక్షల విలువైన వంటనూనె సీజ్ చేశారు. తనిఖీల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, లీగల్ మెట్రాలజీ, పౌరసరఫరాలు, కమర్షియల్ టాక్స్, వ్యవసాయ మార్కెటింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎన్నికల వేళ తనిఖీలపై ఆందోళన..
అయితే ప్రాదేశిక ఎన్నికలు ముగిసి పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సమయంలో అన్ని శాఖల అధికారులు ఒక్కసారిగా రంగంలోకి దిగి వ్యాపార దుకాణాలపై విస్తృత తనిఖీలు నిర్వహించడంపై స్థానిక వ్యాపారులు, పలువురు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారస్తులు భయభ్రాంతులకు గురిచేయాలనే ఉద్దేశంతోనే ఈ తనిఖీలు చేపట్టారని స్థానికులు చర్చించుకుంటున్నారు. మూసి వేసి ఉన్న ఆయిల్ దుకాణాన్ని అధికారులు ఒత్తిడి చేసి తెరిపించి తనిఖీలు నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు దుకాణాల్లోనే ఉండి తనిఖీలు నిర్వహించారు.


