● జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు
మార్కాపురం టౌన్: మార్కెట్‌లో బియ్యం ధరలు పె రుగుతున్న నేపథ్యంలో, ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన బియ్యం అందుబాటులో ఉండేలా చూడా లని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో బియ్యం వ్యాపారులు, రైస్ మిల్లుల యజమానులతో గురువారం జేసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే బియ్యాన్ని ప్రజలకు విక్రయించాలని, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు, రైస్ మిల్లుల యజమానులు ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ప్రతి బియ్యం దుకాణం, రైస్ మిల్లు వద్ద బియ్యం రకాల వారీగా ప్రభుత్వం నిర్ణయించిన ధరలను తెలిపే ధరల పట్టికలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు బియ్యం విక్రయించడం, వినియోగదారుల నుంచి అదనపు ధరలు వసూలు చేయడం వంటి చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యాపారులు, రైస్ మిల్లుల యజమానులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మార్కాపురం జిల్లా పౌర సరఫరాల డీఎం అంకయ్య, లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్లు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.


