సర్పంచ్ ఎన్నికలపైనా కన్ను!
పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు రేపు విడుదల కానున్న నోటిఫికేషన్ ఉమ్మడి జిల్లాలో 924 గ్రామ పంచాయతీలు మొత్తం ఓటర్లు 18,26,163 మంది ఈ నెల 13 నుంచి డిసెంబర్ 2 దాకా ఎన్నికల ప్రక్రియ
నేడు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం 15 ఏళ్ల తరువాత జరగనున్న కందుకూరు మున్సిపల్ ఎన్నికలు రాజకీయ వర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై జోరుగా సమాలోచనలు
పదవులకు
జెండా మోసినోళ్లకు మొండి చెయ్యి.. జేబు నింపినోళ్లకు పదవి
అధికార టీడీపీలో పార్టీ ఫండ్ పేరుతో రూ. కోట్లు వసూళ్లు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల నుంచి ఎంపీపీ, జెడ్పీటీసీ పదవుల వరకు అధికార తెలుగుదేశం పార్టీలో డబ్బుదే కీలక పాత్ర. మేయర్, చైర్మన్, వార్డు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక వరకూ పెద్ద ఎత్తున బేరసారాల వ్యవహారం సాగినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ ఫండ్ పేరుతో నియోజకవర్గ స్థాయి నేతలు కోట్ల రూపాయలు దండుకున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన వారిని పక్కనపెట్టి, అప్పటికప్పుడు వచ్చిన ధనవంతులకు పదవులు కట్టబెట్టడంతో తెలుగు తమ్ముళ్లలో అసంతృప్తి రగులుతోంది.
మున్సిపల్ పదవులకు రూ.కోట్ల బేరం!
ఒంగోలు మేయర్ మొదలుకొని దర్శి, కనిగిరి, అద్దంకి, మార్కాపురం, గిద్దలూరు మున్సిపల్ పదవుల వరకు బేరసారాలు సాగినట్లు టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒంగోలు మేయర్ పదవికి పార్టీ ఫండ్‌తో పాటు నియోజకవర్గ స్థాయి నేతలకు కోట్ల రూపాయలు ముట్టినట్లు ప్రచారం జరుగుతోంది. కార్పొరేటర్ పదవికి రూ.30 లక్షలకు తగ్గకుండా వసూలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ మేయర్ పదవికి సైతం బేరం పెట్టినట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దర్శి, కనిగిరి మున్సిపాలిటీల్లో నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న ఘటనల వెనుక కూడా భారీ బేరసారాలు ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చైర్మన్ అభ్యర్థుల నుంచి రూ.5 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ప్రచారం సాగుతోంది. కౌన్సిలర్ల నుంచి సైతం ముక్కుపిండి డబ్బులు వసూలు చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణ పదవులు అమ్ముకోవడంపై ఆ పార్టీ కిందిస్థాయి నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు.
గ్రామీణ పదవులకూ రేట్లు!
మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ), జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకూ రేట్లు నిర్ణయించినట్లు పార్టీ వర్గాల్లో ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి రూ.25 కోట్ల వరకు ధర పలికినట్లు ప్రచారం సాగుతోంది. ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఎస్సీలకు రిజర్వు కావడంతో రూ.10 కోట్ల వరకు చెల్లించే అభ్యర్థి కోసం అన్వేషణ సాగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గిద్దలూరు నియోజకవర్గంలో ఎంపీపీ పదవికి రూ.3 కోట్ల వరకు బేరం సాగినట్లు చర్చ నడుస్తోంది. ఇతర మండలాల్లో రూ.కోటి నుంచి రూ.కోటిన్నర వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గిద్దలూరు, కనిగిరి, దర్శి తదితర ప్రాంతాల్లో నామినేషన్లను అడ్డుకుని, ఎంపీపీ పదవులకు రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు రేట్లు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. జెడ్పీటీసీ పదవులకు సైతం రూ.కోటి తగ్గకుండా వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కొత్త జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఎంపీపీ, జెడ్పీటీసీ పదవుల పేరిట రూ.10 కోట్ల వరకు వసూలు చేసినట్లు పార్టీ నేతలు లెక్కలతో సహా చెబుతుండటం గమనార్హం.
పల్లె పోరులో తగ్గేదేలే..!
మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో అద్దంకి నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ చింతలపూడి అశోక్‌కుమార్, ఒంగోలు మేయర్ అభ్యర్థి కుప్పం ప్రసాద్ దంపతులు, అద్దంకి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఊడత్తు సురేష్ కుటుంబ సభ్యులు ఉన్నారు.
ఒంగోలు సబర్బన్: మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు, పోలీసుల అడ్డంకులను ఎదురొడ్డి వైఎస్సార్ సీపీ కేడర్ పోరాడింది. ఎన్ని అవరోధాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా రాజకీయంగా సత్తా చాటింది. ఇప్పుడు అదే పోరాట పటిమతో పల్లెపోరుకు సమరశంఖం పూరించేందుకు సిద్ధమవుతోంది. మున్సిపల్, పరిషత్ ఎన్నికలతో పోలిస్తే పంచాయతీ పోరు భిన్నంగా ఉంటుంది. పార్టీ రహితంగా జరిగే ఎన్నికలైనా రాజకీయ పార్టీ మద్దతుతో పాటు అభ్యర్థుల బలాబలాలు కూడా గెలుపును ప్రభావితం చేస్తాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ రాజకీయ ఒత్తిళ్లు, దౌర్జన్యాలకు ఎదురొడ్డి గ్రామాల్లో పట్టు సాధించడమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు పల్లెపోరుకు సన్నద్ధమవుతున్నాయి. దీంతో జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందడి అప్పుడే ఊపందుకుంది. రిజర్వేషన్లు ఖరారు కావడంతో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు ఆశావహులు కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. సామాజిక సమీకరణాలు, గ్రామాల్లో వ్యక్తిగత పట్టుతో పాటు ప్రజల్లో ఉన్న ఆదరణను అంచనా వేస్తూ గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు. గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటూ ఈసారి అధికార పార్టీ ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.
రేపు నోటిఫికేషన్:
ఉమ్మడి జిల్లాలోని 924 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటికి మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. శుక్రవారం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. అయితే ఒంగోలు డివిజన్‌లోని కొండపికి పాలక మండలి కొనసాగుతోంది. దీంతో పాటు ఒంగోలు డివిజన్‌లోని సంతనూతలపాడు మండలం ముంగమూరు, ఒంగోలు మండలంలోని సర్వేరెడ్డిపాలెం, నాగులుప్పలపాడు మండలంలోని దాసరివారిపాలెం గ్రామాలకు సంబంధించి హైకోర్టులో కేసులు ఉన్నందున వాటి వివరాలు ఎన్నికల నోటిఫికేషన్‌లో ప్రకటించనున్నారు. అదేవిధంగా మార్కాపురం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలకు సంబంధించి కూడా డీ నోటిఫికేషన్ వివరాలను ఎన్నికల నోటిఫికేషన్‌లో వెలువరించనున్నారు.
ఉమ్మడి జిల్లాలో మొత్తం ఓటర్లు 18,26,163...
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం ఓటర్లు 18,26,163 మంది ఉన్నారు. ప్రకాశం జిల్లాలో 10,70,902 మంది కాగా వారిలో మహిళలు 5,40,141 మంది, పురుషులు 5,30,734 మంది, ఇతరులు 27 మంది ఉన్నారు. మార్కాపురం జిల్లాలో మొత్తం ఓటర్లు 7,55,261 మంది కాగా వారిలో మహిళలు 3,73,362 మంది, పురుషులు 3,81,871 మంది, ఇతరులు 28 మంది ఉన్నారు. ప్రకాశం జిల్లాలో పురుషుల కంటే మహిళలు 9,407 మంది అధికంగా ఉండగా, మార్కాపురం జిల్లాలో అందుకు భిన్నంగా మహిళల కంటే పురుషులు 8,509 మంది అధికంగా ఉన్నారు.
మొదటి విడత ఇలా..
మొదటి విడత ఈ నెల 26న ప్రకాశం జిల్లాలోని ఒంగోలు రెవెన్యూ డివిజన్‌తో పాటు మార్కాపురం జిల్లాలోని కనిగిరి రెవెన్యూ డివిజన్ పరిధిలోని పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒంగోలు డివిజన్‌లోని 180 పంచాయతీలకు సంబంధించిన ఒంగోలు రూరల్ మండలంతో పాటు కొత్తపట్నం, సంతనూతలపాడు నియోజకవర్గంలోని సంతనూతలపాడు, చీమకుర్తి, మద్దిపాడు, నాగులుప్పలపాడు, కొండపి నియోజకవర్గంలోని కొండపి, సింగరాయకొండ, టంగుటూరు, జరుగుమల్లి మండలాల పరిధిలోని గ్రామాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. అదేవిధంగా కనిగిరి రెవెన్యూ డివిజన్‌లోని కనిగిరి, పీసీపల్లి, హెచ్.ఎం.పాడు, వెలిగండ్ల, పామూరు, సీఎస్.పురం మండలాల్లోని 135 పంచాయతీలకు పోలింగ్ జరగనుంది.
రెండో విడతలో...
రెండో విడత ఈ నెల 29న ప్రకాశం జిల్లాలోని అద్దంకి రెవెన్యూ డివిజన్‌లోని 198 పంచాయతీలకు సంబంధించి అద్దంకి, బల్లికురవ, జే.పంగులూరు, కొరిశపాడు, సంతమాగులూరు మండలాలతో పాటు దర్శి నియోజకవర్గంలోని దర్శి, దొనకొండ, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లోని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అదేవిధంగా మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు, కొమరోలు, బేస్తవారిపేట, కంభం, రాచర్ల, అర్థవీడు, మార్కాపురం రూరల్, తర్లుపాడు మండలాల్లోని 134 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.
మూడో విడతలో...
మూడో విడత డిసెంబర్ 2వ తేదీన ప్రకాశం జిల్లాలోని కందుకూరు రెవెన్యూ డివిజన్‌లోని 137 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని కందుకూరు రూరల్‌తో పాటు గుడ్లూరు, ఉలవపాడు, వలేటివారిపాలెం, లింగసముద్రం మండలాలతో పాటు కొండపి అసెంబ్లీ నియోజకవర్గంలోని పొన్నలూరు, మర్రిపూడి మండలాల్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. అదేవిధంగా మార్కాపురం జిల్లాలోని యర్రగొండపాలెం, దోర్నాల, త్రిపురాంతకం, పెద్దారవీడు, పుల్లలచెరువు, కొనకనమిట్ల, పొదిలి మండలాల్లోని 133 పంచాయతీలకు పోలింగ్ జరగనుంది.
స్థానిక ఎన్నికల్లో డబ్బు వసూళ్లకు అలవాటు పడిన టీడీపీ నేతలు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలపైనా కన్నేశారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే గ్రామ పంచాయతీల్లోనూ అమలు చేసేందుకు ఎత్తుగడలు వేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నామినేషన్లను అడ్డుకోవడం, ప్రత్యర్థులను పోటీకి దూరం చేయడం, అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడం వంటి పద్ధతులనే మళ్లీ ప్రయోగించాలని చూస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఓటుహక్కు వినియోగించుకోకుండా అడ్డుకున్నారన్న ఆగ్రహంతో ఉన్న ప్రజలు సర్పంచ్ ఎన్నికల్లో తమ ఓటుతో కూటమి పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని భావిస్తున్నట్లు స్థానికంగా చర్చ సాగుతోంది. పారదర్శకంగా ఎన్నికలు జరిగితే తమకు ఓటమి తప్పదన్న భయంతోనే అధికార పార్టీ నేతలు అక్రమాలకు తెరలేపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని పక్కనపెట్టి పదవులను సొమ్ము చేసుకునే ఈ బేరసారాల రాజకీయానికి గ్రామీణ ఓటర్లు చెక్ పెడతారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


