ఒంగోలు వన్‌టౌన్: 2026–27 విద్యా సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం అందించే నేషనల్ స్కాలర్ షిప్‌ల కోసం జిల్లాలోని ఓబీసీ, ఈబీసీ, డీఎన్‌టీ విద్యార్థినీ, విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా బీసీ సంక్షేమ శాఖ సాధికారత అధికారి నిర్మల జ్యోతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు విద్యనభ్యసిస్తున్న సంబంధిత పాఠశాలలు, కళాశాలల ద్వారా నూతనంగా, రెన్యువల్ దరఖాస్తులను చేసుకోవాల్సిందిగా కోరారు. దరఖాస్తులు చేసుకోవడానికి ఈ నెల 30 తుది గడువని చెప్పారు. హెడ్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూషన్ బయోమెట్రిక్ అథంటికేషన్ విధానం ద్వారా విద్యార్థుల వెరిఫికేషన్‌ను పూర్తి చేసి నేషనల్ స్కాలర్ షిప్‌ల పోర్టల్ ద్వారా జిల్లా బీసీ సంక్షేమ అధికారి, ఒంగోలు కార్యాలయానికి పంపాలని కోరారు. ఇతర పూర్తి వివరాలకు 9440204193 అనే నంబరు ద్వారా సంప్రదించాలన్నారు.
సంతనూతలపాడు: మండలంలోని మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపికల్లో పాఠశాలకు చెందిన 12 మంది విద్యార్థులు వివిధ విభాగాల్లో రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. అండర్ 14 బాలుర విభాగంలో గిరి వర్ధన్, శ్రావణ సాయి తేజ, మోక్షాజ్ఞ, వంశీకృష్ణ, అండర్ 17 బాలుర విభాగంలో నరేంద్ర, జీవన్ కుమార్, సలీం, అండర్ 19 బాలికల విభాగంలో లోహిత, మనోజ, ఆయేషా, అండర్ 19 బాలుర విభాగంలో చిట్టిబాబు, సాహిద్ ఎంపికై నట్లు పీఈటీలు డి.శ్రీనివాసరావు, తిరుమలశెట్టి రవికుమార్ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో పాల్గొననున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం పాఠశాలలో విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు డీవీఎల్.నరసింహారావు మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికవడం పాఠశాలకు గర్వకారణమన్నారు. కార్యక్రమంలో పాఠశాల స్టాఫ్ సెక్రటరీ అంజయ్యతో పాటు ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.
మార్కాపురం టౌన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 7, 10వ తరగతి విద్యార్థుల ప్రతిభను వెలికితీసి, ప్రోత్సహించడమే లక్ష్యంగా ఎడ్యుకేషనల్ ఎఫిఫనీ నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఈఈ మెరిట్ టెస్ట్ (ఈఈఎంటీ–2027) పాఠశాలల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని డీఈఓ సామా సుబ్బారావు తెలిపారు. డీఈఓ కార్యాలయంలో బుధవారం ఈఈఎంటీ కరపత్రాన్ని జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం మునగాల చంద్రశేఖర్ రెడ్డి, ఈఈఎంటీ మార్కాపురం జిల్లా కో ఆర్డినేటర్ యమా లక్ష్మీ శ్రీనివాసులుతో కలిసి విడుదల చేశారు. వరుసగా ఐదోసారి నిర్వహిస్తున్న ఈ పరీక్షలో ప్రభుత్వ పాఠశాలల 7, 10వ తరగతి విద్యార్థులతో పాటు మార్కాపురం జిల్లాలో 5వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక పైలట్ కార్యక్రమం ద్వారా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 30 వరకు పాఠశాలల రిజిస్ట్రేషన్ కొనసాగుతుందని, డిసెంబర్ 5న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ పరీక్షకు ఎటువంటి రిజిస్ట్రేషన్, పరీక్ష ఫీజు లేదని, ప్రతిభ కనబరిచిన విద్యార్థులందరికీ కలిపి మొత్తం 9 లక్షల 56 వేల రూపాయలు నగదు బహుమతులతో పాటు సుమారు 4,020 మంది విద్యార్థులకు 1 లక్ష 60 వేల 800 రూపాయల విలువైన మెడల్స్, మెరిట్ సర్టిఫికెట్లు అందించనున్నట్లు వెల్లడించారు. www.educationalepiphany.org వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. పరీక్షకు సంబంధించిన వివరాలు కోసం 83283 12945 లేదా 79897 96602 నంబర్‌లను సంప్రదించాలని కోరారు.


