మార్కాపురం: పవిత్ర కార్తీకమాసాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం మార్కాపురం ఆర్టీసీ డిపో నుంచి పంచారామాల దర్శనానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ లావణ్య బుధవారం విలేకరులకు తెలిపారు. ప్రతి సోమవారం ఒకేరోజు పంచారామ క్షేత్రాలను సందర్శించేలా ప్రత్యేక యాత్ర నిర్వహించనున్నారు. ఆసక్తి గల భక్తులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని డిపో అధికారులు సూచించారు. ఈ యాత్రలో గుంటూరు జిల్లాలోని అమరారామం (అమరేశ్వర స్వామి), పశ్చిమగోదావరి జిల్లాలోని సోమారామం (సోమేశ్వర స్వామి), క్షీరారామం (క్షీరారామలింగేశ్వర స్వామి), తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామం (భీమేశ్వర స్వామి), సామర్లకోటలోని కుమారారామం (కుమారరామ భీమేశ్వర స్వామి) క్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పించారు. ఈ యాత్ర కోసం ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశారు. ప్రతి ఆదివారం రాత్రి 10 గంటలకు మార్కాపురం నుంచి బయలుదేరి, క్షేత్రాల దర్శనం అనంతరం మంగళవారం ఉదయం 6 గంటలకు తిరిగి మార్కాపురం చేరుకుంటుంది. ఒక్కొక్కరికి ప్రయాణ చార్జీ రూ.2 వేలుగా నిర్ణయించారు.
అరుణాచలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు:
అరుణాచల క్షేత్ర దర్శనానికి కూడా మార్కాపురం డిపో నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఈ యాత్రలో భాగంగా కాణిపాకం, తిరుత్తణి, కంచి మీదుగా అరుణాచలం చేరుకుని స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం వేలూరులోని గోల్డెన్ టెంపుల్ సందర్శించి మార్కాపురం చేరుకునేలా ప్రయాణ మార్గాన్ని రూపొందించారు. ఈ యాత్రకు ఒక్కొక్కరికి రూ.2,500 గా చార్జీగా నిర్ణయించారు. కార్తీకమాసంలో పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే భక్తులు ఈ ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు. టికెట్ల ముందస్తు రిజర్వేషన్ కోసం మార్కాపురం ఆర్టీసీ డిపోను సంప్రదించాలని కోరారు.


