కందుకూరు మున్సి‘పోల్స్‌’కు నగారా | - | Sakshi
Sakshi News home page

కందుకూరు మున్సి‘పోల్స్‌’కు నగారా

Nov 12 2026 3:24 AM | Updated on Nov 12 2026 3:24 AM

కందుకూరు: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కందుకూరు మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ సైరన్‌ మోగనుంది. కోర్టు కేసులతో వాయిదా పడిన పెండింగ్‌ మున్సిపాలిటీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్న నేపథ్యంలో కందుకూరు మున్సిపల్‌ ఎన్నికలు షూరూ కానున్నాయి. దాదాపు 15 ఏళ్ల విరామం అనంతరం కందుకూరు మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సాధారణ ప్రజల్లో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొని ఉంది.

పెరిగిన వార్డులు:

కందుకూరు మున్సిపాలిటీకి చివరి సారిగా 2007లో ఎన్నికలు జరిగాయి. గ్రామాల విలీనం సమస్యతో ఆ తరువాత ఎన్నికల నిర్వహణ సాధ్యం కాలేదు. చివరికి ఇటీవల కోర్టు కేసులు పరిష్కారం కావడంతో గ్రామాల విలీనం ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు మున్సిపాలిటీలో అధికారులు వార్డుల పునర్విభజన చేపట్టారు. గతంలో ఉన్న 30 వార్డులు పునర్విభజన తరువాత 40 వార్డులకు పెరిగాయి. ఈ 40 వార్డుల పరిధిలో 47,470 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా ఓటు హక్కు వినియోగించుకునేందుకు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 65 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఒక్కొక్క పోలింగ్‌ కేంద్రం పరిధిలో సగటున 730 మంది ఓటర్లు ఉండేలా చర్యలు చేపట్టారు. వార్డుల వారీగా చూస్తే ఒక వార్డులో అత్యధికంగా రూ.1400లకు పైగా ఓటర్లు ఉంటే అత్యల్పంగా 1000 ఓటర్ల లోపు ఉన్న వార్డులు కూడా ఉన్నాయి. ఇలా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు అన్ని పూర్తి కావడంతో ఎన్నికల కమిషన్‌ ఇచ్చే నోటిఫికేషన్‌ కోసమే అంతా ఎదురుచూస్తున్నారు. ఎన్నికలకు ముందే మున్సిపల్‌ చైర్మన్‌ పీఠం కోసం టీడీపీలో కొంతకాలంగా తీవ్ర గందరగోళం నెలకొని ఉంది. పార్టీ సీనియర్‌ నాయకులు పదవి నాకంటే నాకంటూ ఎవరికి వారు సోషల్‌మీడియా వేదికగా సొంత ప్రచారాన్ని జోరుగా చేసుకుంటున్నారు. ప్రధానంగా ఆ పార్టీలో పిడికిటి వెంకటేశ్వర్లు, ఉప్పుటూరి శ్రీనివాసరావు, కండ్రా మాల్యాద్రి వంటి సీనియర్‌లతో పాటు, ఎమ్మెల్యే ఇంటూరి రైట్‌హ్యాండ్‌ వడ్లమూడి సురేష్‌, ఎమ్మెల్యే అనుచరుడు అప్పబోయిన నరశింహ చైర్మన్‌ పీఠం కోసం పట్టుబడుతున్నారు. అదే సందర్భంలో మాజీ ఎమ్మెల్యే దివి శివరాం సతీమణి సౌభాగ్య కూడా రంగంలోకి దిగారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు సాధించిన వైఎస్సార్‌ సీపీలో ప్రస్తుతం రెట్టింపు ఉత్సాహం కనిపిస్తోంది. అధికార పార్టీ ఎన్నికలు దాడులు, ఇబ్బందులు పెట్టినా గట్టిగా పోరాడి స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి దీటుగా నిలబడడం అదే ఉత్సాహంతో మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. 40 వార్డులను నుంచి పోటీ చేసేలా కౌన్సిలర్‌ అభ్యర్థులు సిద్ధం కావడంతో పాటు, చైర్మన్‌ అభ్యర్థి ఎంపికపై తీవ్ర కసరత్తు పార్టీ నాయకులు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement