బాబు పాలనలో 9 గంటల ఉచిత విద్యుత్ ఉత్తమాటే.. ● పొలాల్లో జనరేటర్ల మోత.. అన్నదాతల జేబులకు కోత!
● బల్లికురవ మండలంలో పది రోజులుగా త్రీఫేస్ సరఫరా బంద్..
● జె.పంగులూరు మండలంలో రోజుకు 16 సార్లు కోతలు..
● పొట్ట దశలో ఎండుతున్న వరి.. పెట్టుబడి కూడా రాదని రైతుల ఆక్రందన
● జనరేటర్లతో జేబులు గుల్ల చేసుకుంటున్న అన్నదాతలు
● విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి సొంత నియోజకవర్గంలోనే అగచాట్లు
సూరేపల్లిలో పొట్ట దశకు వచ్చిన వరి(ఇన్‌సెట్) నీరు లేక ఎలుకలు ధ్వంసం చేసిన పంట
బల్లికురవ/జె.పంగులూరు:
సాక్షాత్తు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న అద్దంకి నియోజకవర్గంలోనే కరెంట్ కటకట అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వ్యవసాయానికి పగటిపూటే నిరంతరాయంగా 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో రైతులను నిలువునా ముంచుతోంది. నాగార్జునసాగర్ కాల్వల ద్వారా నీరు విడుదల లేకపోవడంతో పూర్తిగా బోరుబావులపైనే ఆధారపడి సాగు చేసిన పంటలు.. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో కళ్ల ముందే ఎండిపోతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. బల్లికురవ మండల పరిధిలోని ముక్తేశ్వరం, సూరేపల్లి, వైదన, భూసావారిపాలెం, రామాంజనేయపురం గ్రామాల్లో సుమారు 260 ఎకరాల్లో రైతులు వరి సాగు చేపట్టారు. ఎకరాకు ఇప్పటికే రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం పంట పొట్ట దశకు చేరుకుని, డిసెంబరు రెండో వారం నాటికి కోతకు రావాల్సి ఉంది. ఈ కీలక సమయంలో బల్లికురవ 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలోని లైన్లలో సాంకేతిక లోపాలు, స్తంభాలు విరిగిపడటంతో గత పది రోజులుగా త్రీఫేస్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీనిపై అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో చేసేది లేక రహదారి సౌకర్యం ఉన్న రైతులు రోజుకు వేల రూపాయలు ఖర్చు చేసి అద్దె జనరేటర్లతో పంటలను తడుపుకోవాల్సిన దుస్థితి దాపురించింది. కొప్పెరపాడు సబ్‌స్టేషన్ నుంచి వచ్చే లైన్‌ను ప్రత్యామ్నాయంగా కలపాలని కోరినా అధికారులు స్పందించడం లేదని రైతులు లబోదిబోమంటున్నారు.
కోతల మీద కోతలు!
జె.పంగులూరు మండలంలోని కొండమంజులూరు, కోటపాడు గ్రామాల్లో సుమారు 150 ఎకరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ కౌలు రైతులు అప్పులు చేసి బెండ, గుమ్మడి, చిక్కుడు తదితర కూరగాయల పంటలు సాగు చేశారు. వీరికి రోజుకు నాలుగు, ఐదు గంటలు కూడా సక్రమంగా విద్యుత్ అందడం లేదు. ఆ కాసేపట్లోనే ఏకంగా 16 సార్లు విద్యుత్ కోతలు విధిస్తుండటంతో మోటార్లు ఆన్ చేసి పొలాలకు నీళ్లు పారేలోపే కరెంట్ పోతోంది.
తుఫాన్ తర్వాత సమస్య తీవ్రం
‘మురసు’ తుఫాన్ నాటి నుంచి ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా మరింత అస్తవ్యస్తంగా మారింది. గృహావసరాలకే దిక్కులేక రాత్రిళ్లు ఇచ్చి పగలు కట్ చేస్తుంటే.. ఇక వ్యవసాయానికి ఏం న్యాయం చేస్తారని రైతులు మండిపడుతున్నారు. అధికారులకు ఫోన్ చేస్తే కనీసం స్పందించడం లేదని వాపోతున్నారు.
పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరే..
రెండు ఎకరాల్లో బోరు కింద వరి సాగు చేశా. ఇప్పటివరకు సుమారు రూ.90 వేల వరకు పెట్టుబడి పెట్టాను. గత పది రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పైరు ఎదుగుదల లోపించి నిలువునా ఎండిపోతోంది. తక్షణమే లైన్ల లోపాలను సరిచేసి త్రీఫేస్ సరఫరాను పునరుద్ధరించకపోతే మా శ్రమ, పెట్టిన పెట్టుబడి మొత్తం బూడిదలో పోసిన పన్నీరవుతుంది.
– బైలడుగు సుబ్బారావు, కౌలు రైతు, ముక్తేశ్వరం
జేబులు గుల్ల చేసుకుంటూ జనరేటర్ పెట్టా..
నాలుగు ఎకరాల్లో బోర్ల ఆధారంగా వరి పంట సాగు చేపట్టా. ఎరువులు, దుక్కులు, విత్తనాల రూపంలో ఇప్పటికే రూ.2 లక్షల దాకా పెట్టుబడి పెట్టాను. పది రోజులుగా కరెంట్ లేకపోవడంతో చేలల్లో నీరు ఇంకిపోయి, పొట్ట దశలో ఉన్న వరి పైరును ఎలుకలు విపరీతంగా నాశనం చేస్తున్నాయి. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో, అద్దె జనరేటర్ తెచ్చుకుని తడులు ఇస్తున్నా.
– కారసాని శివారెడ్డి, రైతు, సూరేపల్లి
కూటమి పాలనలో అన్నదాతకు దగా
వ్యవసాయానికి నాణ్యమైన 9 గంటల నిరంతర విద్యుత్ ఇస్తామని ప్రగల్భాలు పలికిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులను దగా చేస్తోంది. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సొంత నియోజకవర్గంలోనే చిన్న, సన్నకారు రైతులు బలవుతుండటం దుర్మార్గం. ఉన్నతాధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయి సిబ్బంది అలసత్వం ప్రదర్శిస్తున్నారు. నిరంతరాయంగా 9 గంటల విద్యుత్ అందేలా చర్యలు తీసుకోవాలి.
– జంపని రవిబాబు, వైఎస్సార్ సీపీ నేత


