విద్యుత్‌ సమస్యే ఉసురు తీసిందా..? | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సమస్యే ఉసురు తీసిందా..?

Nov 8 2026 10:12 AM | Updated on Nov 8 2026 10:12 AM

గుర్తుతెలియని వ్యక్తి మృతి

ఒంగోలు టౌన్‌: మురసు తుఫాన్‌ ప్రభావంతో నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరాను ఐదు రోజులైనా పునరుద్ధరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది. ఇన్వర్టర్‌ బ్యాటరీల మరమ్మతుల కోసం ఒంగోలు వచ్చిన బాల్య స్నేహితులు తిరిగి ఇంటికి వెళ్తుండగా రాంగ్‌రూట్‌లో వచ్చిన కంటైనర్‌ ఢీకొనడంతో దుర్మరణం పాలయ్యారు. బాధిత కుటుంబం, స్నేహితుల కథనం ప్రకారం... నాగులుప్పలపాడు మండలంలోని అమ్మనబ్రోలు గ్రామంలో చికెన్‌ దుకాణం నిర్వహించే రహంతుల్లా, తాహెరున్నిసాల ఏకై క కుమారుడు పఠాన్‌ రియాజ్‌ (21), రావినూతల సురేష్‌, తిరుపతమ్మ దంపతుల చిన్నకుమారుడు నికొద్దేవ్‌ (22)లు బాల్యం నుంచి కలిసి చదువుకున్నారు. రియాజ్‌ ప్రస్తుతం ఒంగోలులోని ఒక కాలేజీలో ఇంజినీరింగ్‌ ఫైనలియర్‌ చదువుతున్నాడు. నికొద్దేవ్‌ ఇంజినీరింగ్‌ చదువు మధ్యలోనే ఆపేశాడు. గత సోమవారం రాత్రి మురసు తుఫాన్‌ కారణంగా వీచిన బలమైన గాలులకు విద్యుత్‌ తీగలు తెగిపోయి వారి గ్రామంలో కరెంటు పోయింది. ఐదు రోజులుగా గ్రామంలో కరెంటు లేదు. ఇళ్లంతా చీకటిగా ఉందంటూ ఇన్వర్టర్‌ బ్యాటరీలకు మరమ్మతులు చేయించడానికి తన స్నేహితుడు నికొద్దేవ్‌తో కలిసి శుక్రవారం బైకుపై రియాజ్‌ ఒంగోలు వచ్చాడు. సాయంత్రం తిరిగి వెళుతున్న సమయంలో ఒంగోలు సమీపంలోని బృందావనం ఫంక్షన్‌ హాలు వద్ద రాంగ్‌ రూట్‌లో వేగంగా వచ్చిన ఐషర్‌ కంటైనర్‌ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్నేహితులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. సమీపంలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం వారి మృతదేహాలను ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు. ఒంగోలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరణంలోనూ స్నేహబంధాన్ని వీడలేదని గ్రామస్తులు, స్నేహితులు రోదిస్తున్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం...

మురసు తుఫాన్‌ కారణంగా గత సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. ఆరు రోజులవుతుండగా నేటికీ పలు గ్రామాల్లో కరెంటు ఇవ్వలేదు. ఇంట్లో చీకటిగా ఉండటంతో ఇబ్బందిగా ఉందని, ఇన్వర్టర్‌ రిపేరు కోసం ఒంగోలు వెళ్లిన రియాజ్‌, నికొద్దెవ్‌లు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ప్రభుత్వం సకాలంలో కరెంటును పునరుద్ధరించి ఉంటే వారు ఒంగోలుకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదని, రోడ్డు ప్రమాదంలో మరణించి ఉండేవారు కాదని గ్రామస్తులు, మృతుల స్నేహితులు అంటున్నారు. ఎన్నికల హడావిడిలో పడిన ప్రభుత్వం.. గ్రామీణ ప్రజలను గాలికి వదిలేసిందని, ఫలితంగా గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు చనిపోయారని కన్నీరు పెడుతున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మృతుల నేత్రాలు దానం చేసిన కుటుంబ సభ్యులు...

రోడ్డు ప్రమాదంలో తమ కుమారులు మరణించిన విషాదంలో ఉన్నప్పటికీ వారి తల్లిదండ్రులు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. చనిపోయిన తమ కుమారుల నేత్రాలను దానం చేయడానికి వైద్యులకు అంగీకారం తెలిపారు. దాంతో జీజీహెచ్‌లోని ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ట్రస్ట్‌ ప్రతినిధులు రియాజ్‌, నికొద్దేవ్‌ కార్నియాలు సేకరించారు.

మార్కాపురం టౌన్‌:

పట్టణంలోని గొర్లగడ్డ పీర్లచావిడి వద్ద సుమారు 75 నుంచి 80 సంవత్సరాల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి శనివారం మృతిచెందినట్లు పట్టణ ఎస్సై విశ్వనాథరెడ్డి తెలిపారు. అతని ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

మురసు తుఫాన్‌ ప్రభావంతో ఐదు రోజులుగా నిలిచిన విద్యుత్‌ సరఫరా

ఇన్వర్టర్‌ బ్యాటరీలకు మరమ్మతుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో మరణించిన ఇద్దరు యువకులు

బాల్య స్నేహితుల మృతితో అమ్మనబ్రోలు గ్రామంలో విషాదం

ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ స్నేహితుల ఆరోపణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement