ఫలితాలు తారుమారు చేసి..
ఉమ్మడి జిల్లాలో ప్రాదేశిక కౌంటింగ్‌లో పచ్చపాతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపులో ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులు వైఎస్సార్ సీపీ గెలిచిన ప్రాదేశికాలకు డిక్లరేషన్ ఇవ్వకుండా తాత్సారం కొన్ని స్థానాలకు ఐదుసార్లు రీకౌంటింగ్ తీవ్ర జాప్యమైన లెక్కింపు ప్రక్రియ
గెలుపును దాచి..
టీడీపీ గెలిస్తే ప్రకటన.. వైఎస్సార్‌సీపీ గెలిస్తే గోప్యత
పరిషత్ కౌంటింగ్‌లోనూ అధికార పార్టీకి అధికారుల ఊడిగం
ఉమ్మడి జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు టీడీపీ అరాచకాలకు, ఎన్నికల అధికారుల పక్షపాత వైఖరికి అద్దం పట్టాయి. నామినేషన్ల నుంచి కౌంటింగ్ వరకు అధికార పార్టీ దౌర్జన్యాలు కొనసాగాయి. ఓట్ల లెక్కింపు సమయంలో అధికారులు పచ్చచొక్కాలు తొడిగేశారు. టీడీపీ గెలిచిన స్థానాలను హడావుడిగా ప్రకటించిన అధికారులు.. వైఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలిచిన చోట మాత్రం ఫలితాలను తొక్కిపెట్టారు. గెలిచిన అభ్యర్థులకు డిక్లరేషన్ ఫారాలు ఇచ్చేందుకు నిరాకరిస్తూ అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గారు. ప్రజాతీర్పును గౌరవించాల్సిన ఎన్నికల అధికారులే పక్షపాతంగా వ్యవహరించడంతో కౌంటింగ్ ప్రక్రియ గందరగోళంగా మారింది.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 40 జెడ్పీటీసీ, 277 ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఎన్నికలు జరిగాయి. మార్కాపురం జిల్లాలో 21 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా 6 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 15 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. 275 ఎంపీటీసీలకుగాను 218 స్థానాలు ఏకగ్రీవం కాగా.. 57 ఎంపీటీసీలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. ప్రకాశం జిల్లాలో 27 జెడ్పీటీసీ స్థానాలుండగా 2 ఏకగ్రీవం అయ్యాయి. 25 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. 371 ఎంపీటీసీ స్థానాలకు గాను 151 ఏకగ్రీవం అయ్యాయి. 220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. శనివారం ఓట్ల లెక్కింపు జరిగింది. ప్రకాశం జిల్లాకు సంబంధించి రైస్, క్విస్ ఇంజినీరింగ్ కాలేజీల్లో, మార్కాపురం జిల్లాలో మార్కాపురం మార్కెట్ యార్డు, కంభం ప్రభుత్వ కళాశాల, కనిగిరి మోడల్ స్కూళ్లలో ఓట్లు లెక్కించారు. రైస్ ఇంజినీరింగ్ కాలేజీలో కందుకూరు, కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గాలు, క్విస్ ఇంజినీరింగ్ కళాశాలలో ఒంగోలు, అద్దంకి, దర్శి నియోజకవర్గాలకు చెందిన ఓట్ల లెక్కింపును చేపట్టారు. అలాగే మార్కాపురం మార్కెట్ యార్డులో మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాలకు, కంభం ప్రభుత్వ కళాళాలలో గిద్దలూరు నియోజకవర్గం, కనిగిరిలో కనిగిరి నియోజకవర్గానికి సంబంధించి ఓట్లు లెక్కింపు జరిగింది. మార్కాపురం జిల్లాలో కొనకనమిట్ల జెడ్పీటీసీ స్థానం ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి వరకు కొనసాగుతూనే ఉంది. ప్రకాశం జిల్లాలో ఉలవపాడు, కొత్తపట్నం జెడ్పీటీసీలను వైఎస్సార్ సీపీ కై వసం చేసుకుంది. ఉలవపాడు జెడ్పీటీసీని వైఎస్సార్ సీపీ అభ్యర్థి మద్దసాని నవీన్‌కృష్ణ, కొత్తపట్నం జెడ్పీటీసీగా లంకపోతు అంజిరెడ్డి విజయం సాధించారు.
ఓట్ల లెక్కింపులో తీవ్ర జాప్యం:
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. క్విస్, రైజ్ కళాశాలల్లో అయితే మధ్యాహ్నం వరకు కనీసం ఒక్క ఎంపీటీసీ స్థానంలో కూడా ఫలితాలు ప్రకటించలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ కేంద్రంలో కౌంటింగ్ అర్ధరాత్రి వరకు కొనసాగింది. దీని వల్ల అటు అభ్యర్థులతో పాటు, అధికారులు, భద్రతా అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసిన స్థానాలకు సంబంధించి డిక్లరేషన్ ఫారాల జారీలో అధికారులు అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. దీంతో అసలు ఏం జరుగుతుంతో అర్థంకాని పరిస్థితి నెలకొంది.
వైఎస్సార్ సీపీ గెలిచినా ప్రకటించకుండా....
ఉమ్మడి జిల్లాలో పలు ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే అక్కడ ఫలితాలు ప్రకటించకుండా ఎన్నికల అధికారులు తాత్సారం చేశారు. అధికార పార్టీ నాయకులతో కలసి ఫలితాలను తారుమారు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు డిక్లరేషన్ ఫారాలు ఇవ్వకుండా హోల్డ్‌లో పెట్టారు. కందుకూరు నియోజకవర్గం కరేడు తూర్పు ప్రాదేశికం నుంచి వైఎస్సార్ సీపీ తరుఫున పోటీ చేసిన బండి భూపతి దాదాపు 11 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కానీ గెలిచినట్లు ప్రకటించకుండా ఈ స్థానాన్ని హోల్డ్‌లో పెట్టారు. టీడీపీ ఏజెంట్‌ల ఒత్తిడికి తలొగ్గి రీకౌంటింగ్ పేరుతో వైఎస్సార్ విజయాన్ని ప్రకటించకుండా రాత్రి 7.30 గంటల వరకు నిలిపేశారు. ఉన్నతాధికారుల జోక్యంతో చివరకు స్వల్ప తేడాతో వైఎస్సార్ సీపీ గెలిచినట్లు ప్రకటించారు. అలాగే లింగసముద్రం మండలం మొగిలిచర్ల ప్రాదేశికంలోను వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బండి రాజమ్మ దాదాపు 400కి పైగా ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించారు. అయితే ఇక్కడ కూడా డిక్లరేషన్ ఫారం ఇవ్వకుండా తీవ్ర జాప్యం చేశారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఈ ప్రాదేశికంలో గెలుపును అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను మొగిలిచర్లలో విజయం సాధించాలంటూ పార్టీ కేడర్‌కు ఆదేశాలు జారీ చేయడంతో పాటు, డబ్బులు కూడా భారీగా పంపిణీ చేశారు. కానీ ఇక్కడ మాత్రం ఓటర్లు ఏకపక్షంగా వైఎస్సార్ సీపీ వైపు నిలవడం గమనార్హం. ఇక అద్దంకి నియోజకవర్గం శంకవరప్పాడు ఎంపీటీసీ స్థానం నుంచి పోటీ చేసిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి జీ యోగేశ్వరి భారీ మెజార్టీతో గెలిచినా డిక్లరేషన్ ఫారం ఇవ్వకుండా జాప్యం చేశారు. ఇన్‌చార్జ్ అశోక్‌బాబు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పోరాటం చేయడంతో తరువాత ఎట్టకేలకు ఆమె గెలిచినట్లు ప్రకటించారు. బల్లికురవ మండలంలోనూ వల్లాపల్లి, కూకట్లపల్లి, కొణిదెన ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మల్లాయపాలెం, వెలమవారిపాలెంలో కూడా వైఎస్సార్ సీపీ అభ్యర్థులే విజయం సాధించేలా ఉండటంతో ఫలితాలు ప్రకటించకుండా మంత్రి గొట్టిపాటి రవికుమార్ పీఏ కుట్రలకు తెరతీశారు. లెక్కింపు కేంద్రంలో ఎస్సై నాగరాజులు కూడా హల్‌చేసి అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరించారు. చివరకు ఆ రెండు స్థానాల్లో టీడీపీ విజయం సాధించినట్లు ప్రకటించారు.
● మార్కాపురం జిల్లా త్రిపురాంతకం సీఐ మాతంగి శ్రీనివాసులు ఓట్ల లెక్కించే సమయంలో ఆ ప్రాంతంలోనే ఉండి కౌంటింగ్ ఏజెంట్లను, అభ్యర్థులను బెదిరించడమే పనిగా పెట్టుకున్నాడు. త్రిపురాంతకం మండలంలోని గణపవరం ఎంపీటీసీ సెగ్మెంట్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భవనం కుమారి 33 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించాడు. అయితే ఆమెకు డిక్లరేషన్ ఫారం ఇవ్వడంలో తీవ్రజాప్యం చేశారు. మధ్యాహ్నం 12 గంటలలోపు ఆ సెగ్మెంట్ కౌంటింగ్ పూర్తయినా డిక్లరేషన్ ఫారం ఎందుకు ఇవ్వడంలేదని, ఈ విషయాన్ని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు కౌంటింగ్ జరిగే మార్కాపురం మార్కెట్ యార్డ్ వద్దకు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ వచ్చారు. అక్కడ ఉన్న మార్కాపురం డీవైఎస్పీ నిమ్మగడ్డ సత్యనారాయణ, సీఐ అల్తాఫ్ హుసేన్‌లు ఆయనను అడ్డుకున్నారు. బయటికి పోవాలని ఎమ్మెల్యేతో వారు వాగ్వాదానికి దిగారు. కలెక్టర్‌తో మాట్లాడిన తరువాత తాను వెళ్తానని, ముందుగా కౌంటింగ్ హాల్‌లో ఉన్న సీఐ మాతంగి శ్రీనివాసులును బయటికి పంపాలని ఆయన అన్నారు. గెలిచిన అభ్యర్థినికి డిక్లరేషన్ ఫారం ఇవ్వకుండా సీఐ జాప్యం చేయించడమే కాకుండా కౌంటింగ్ ఏజెట్లను, అభ్యర్థులను బెదిరిస్తున్నాడని ఆయన ఆరోపించారు. అయినా పోలీసు బలగాలతో ఆయనను బలవంతంగా డీఐఎస్పీ బయటికి తీసుకొని వెళ్లారు. చివరకు రాత్రి గం.9.30 తరువాత భవనం కుమారి విజయం సాధించినట్లు డిక్లరేషన్ ఫారం అందజేశారు.
తేలని కొనకనమిట్ల జెడ్పీటీసీ స్థానం ఫలితం
కొత్తపట్నం మండలానికి చెందిన గమళ్లపాలెం ఎంపీటీసీ స్థానం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థి తాతా నాగేంద్రమ్మ 11 ఓట్లతో గెలిచింది. రీకౌంటింగ్ నిర్వహించి ఒక సారి ఆరు, మరో సారి మూడు ఓట్లకు తెచ్చారు. తర్వాత ఆర్‌ఓ డిక్లరేషన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో టీడీపీ నాయకులు మళ్లీ రీకౌంటింగ్ చేయాలని పట్టుబట్టారు. కొత్తపట్నం తహశీల్దార్ డీ రామానాయుడు నోటా ఓట్ల నుంచి ఐదు ఓట్లు టీడీపీకి వేశారు. చివరకు రెండు ఓట్లతో టీడీపీ గెలిచినట్టు ప్రకటించారు. దీనిపై అభ్యర్థి తాతా నాగేంద్రమ్మ అధికారులు వ్యవహరించిన తీరును ఎండగట్టారు.
పొందూరులో ఫలితం తారుమారుకు తీవ్రయత్నం...
టంగుటూరు మండలం పొందూరు వైఎస్సార్ సీపీ అభ్యర్థిని కొమ్ము రమాదేవికి 61 ఓట్ల మెజార్టీ వచ్చింది. అయితే ఈ ఫలితాన్ని తారుమారు చేసేందుకు అధికార పార్టీ నాయకులు తీవ్ర ప్రయత్నం చేశారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఫోన్‌తో వెళ్లిన టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు చదలవాడ చంద్రశేఖర్ కేంద్రం నుంచే ఫోన్‌లు చేస్తూ ఆర్‌ఓను బెదిరిస్తూ ఫలితాన్ని తారుమారు చేసేందుకు తీవ్ర ఒత్తిడి చేశారు. రమాదేవి తనకు డిక్లరేషన్ ఫారం ఇవ్వాలని ఎంత వేడుకున్నా ఆర్‌ఓ కనికరించలేదు. దీంతో కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన ఆమె అక్కడ ఉన్న కలెక్టర్ రాజాబాబు కాళ్లు పట్టుకుని తనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించింది. అలాగే అక్కడే ఉన్న జెడ్పీ సీఈఓ దగ్గరకు వచ్చి అన్యాయం జరుగుతోందని, న్యాయం చేయాలంటూ వేడుకుంది. దీంతో స్పందించిన అధికారులు రీకౌంటింగ్ చేపట్టారు. రీకౌంటింగ్‌లోనూ రమాదేవికి 61 ఓట్లు వచ్చినట్లు తేలడంతో టీడీపీ ఏజెంట్‌లు అక్కడి నుంచి చిన్నగా జారుకున్నారు. దాదాపు నాలుగు గంటల పోరాటం అనంతరం రమాదేవి గెలిచినట్లు ప్రకటించక అధికారులకు తప్పని పరిస్థితి. ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రకటించాల్సిన అధికారులే.. అధికార పార్టీకి అనుకూలంగా తీర్పులను తారుమారు చేసే ప్రయత్నాలకు వత్తాసు పలికారన్న విమర్శలు వెల్లువెత్తాయి.


