అరాచకశక్తులతో ఎన్నికలు జరపడమే కూటమి విజయం వైఎస్సార్ సీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌ల నుంచి బయటకు లాగిపడేశారు అరాచకాలకు చంద్రబాబు బాధ్యత వహించాలి గెలిచిన అభ్యర్థులను కూడా ఓడిపోయినట్లు ప్రకటించడం నేరం దౌర్జన్యాలను ఎదుర్కొని గెలిచిన వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు సలాం మాజీ మంత్రి మేరుగు నాగార్జున
ఒంగోలు టౌన్: ‘‘ఇవేం ఎన్నికలు...గతంలో ఎన్నో ఎన్నికలు చేశాం. ఎప్పుడూ ఇంత దారుణం జరగలేదు. నామినేషన్ పత్రాలను లాక్కొని చించివేయడం, పోలింగ్ బూతుల్లో ఏజంట్లను లేకుండా చేయడం, అభ్యర్థులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కూర్చోబెట్టడం, పోలింగ్ బూత్‌లను క్యాప్చర్ చేయడం...ఛీఛీ ఇలాగేనా ఎన్నికలు నిర్వహించేది. దీన్ని గెలుపంటారా...సిగ్గులేదా చంద్రబాబు’’ అని మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి మేరుగు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘స్థానిక ఎన్నికలు ఎక్కడ సజావుగా జరిగాయో చెప్పు. పోలీసులతో ఎన్నికలు నిర్వహించడం నిజం కాదా. ప్రభుత్వ వ్యవస్థలను దాసోహం చేసుకున్నావు, అరాచకశక్తులతో చేతులు కలిపి ఎన్నికలు నిర్వహించావు. కూటమి అభ్యర్థులను గెలిపించకపోతే మీ అంతు చూస్తానంటూ టీడీపీ ఎమ్మెల్యేలు బెదిరించి మీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. నామినేషన్ వేసిన అభ్యర్థులపై దాడులు చేయడం, భయాందోళనకు గురిచేయడం, పోలీసులను ఇంటి దగ్గరకు పంపించి వారి కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి చేయించడం వంటి ఘోరాలు జరిగాయి. చివరికి రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని కూడా కొట్టించారు. దీనికి చంద్రబాబు బాధ్యత వహించాలి. దర్శి మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం రాష్ట్రమంతా చూసింది. ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికల్లో రాత్రి ఒక రకమైన పోలింగ్ శాతం లెక్కలు చెప్పిన అధికారులు మరుసటి ఉదయానికల్లా మరో లెక్క చెప్పారు. అక్రమాలు జరిగాయని చెప్పడానికి ఇది నిదర్శనం. చీమకుర్తిలో రీ పోలింగ్ జరిగిన చోట వైఎస్సార్ సీపీ అభ్యర్థి గెలుపు సాధించాడు. రాష్ట్రంలో సజావుగా, ప్రశాంతంగా ఎన్నికలు జరిగితే ఏ శక్తి కూడా వైఎస్సార్ సీపీ విజయాన్ని అడ్డుకునేదికాదు. మీ అరాచకాలను, అక్రమాలను ఎదురొడ్డి గెలుపు సాధిస్తున్న అభ్యర్థులకు సలాం. సంతనూతలపాడు నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఎన్నికలలో అరాచకాలకు పాల్పడ్డారు. అయినా ప్రజల మద్దతుతో మెరుగైన ఫలితాలు సాధించాం. దేవరపాలెం గ్రామంలో 400 ఓట్లకు పైగా మెజారిటీతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి గెలిస్తే ఫలితం ప్రకటించకుండా నిలిపేశారు. త్రిపురాంతకం వంటి చోట కూడా డిక్లరేషన్ ఇవ్వడం లేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అరాచకాలకు పాల్పడుతున్నారు. అధికార టీడీపీ కూటమికి వంతపాడుతున్న అధికారులు, పోలీసులు రేపు మా ప్రభుత్వం వచ్చాక కూడా పనిచేయాల్సి ఉంటుందన్న సంగతి గుర్తుంచుకోవాలి. రేపు ప్రాయశ్చితం పడితే ఉపయోగం ఉండదు. అధికారులు నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. 2029 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయఢంకా మోగించడానికి ఈ ఎన్నికలే పునాదులని’’ మేరుగు నాగార్జున స్పష్టం చేశారు.
లేళ్ల అప్పిరెడ్డి అరెస్టు అన్యాయం...
లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ లేళ్ల అప్పిరెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమని మేరుగు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ పదవిలో ఉన్న నాయకులపై కూడా దాడులు చేయడం, అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమని మండిపడ్డారు. పోలింగ్ అయిపోయిన తరువాత సీలేసి ఉన్న బ్యాలెట్ బాక్సుతో ఒక ప్రభుత్వ ఉద్యోగి భుజం మీద ఎత్తుకొని మార్గంమధ్యలో బస్సు దిగితే వైఎస్సార్ సీపీ నాయకులు ధర్నాకు దిగారని, దీంతో ఎలాంటి సంబంధంలేని లేళ్ల అప్పిరెడ్డిని అరెస్టు చేయడం ప్రభుత్వ కుట్రలకు నిదర్శనమన్నారు. అప్పిరెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఇది ప్రభుత్వానికి మంచిదికాదన్నారు.
అన్యాయాన్ని ఎదుర్కొని గెలిచిన వీరుడు...
సంతనూతలపాడు నియోజకవర్గంలోని గురవారెడ్డిపాలెంలో టీడీపీ నాయకులు బూత్‌లు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారని మేరుగు నాగార్జున ఆరోపించారు. టీడీపీ అరాచకాలను అడ్డుకొన్న వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొండు రామాంజనేయులును ప్రజలు గెలిపించి వారికి బుద్ధి చెప్పారని తెలిపారు. టీడీపీ అరాచకాలను ఎదుర్కొన్న వీరుడు రామాంజనేయులు వంటి నాయకులే రేపు ప్రజల గొంతుకలను బలంగా వినిపించి టీడీపీకి గుణపాఠం చెబుతారన్నారు. రామాంజనేయులును సంతనూతలపాడు మండల నాయకులు, గురవారెడ్డిపాలెం గ్రామస్తులతో కలిసి ఘనంగా సన్మానించారు.


