ఒంగోలు టౌన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఒంగోలు జీజీహెచ్‌లో లాపరోస్కోపిక్ ఆపరేషన్లు నిలిచిపోయాయి. లక్షలాది రూపాయల విలువైన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నప్పటికీ రెండున్నరేళ్లుగా వాటిని ఉపయోగించడంలేదు. దీన్ని గమనించిన జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు లాపరోస్కోపిక్ ఆపరేషన్లు పునరుద్ధరించడానికి చొరవ చూపించారు. దాంతో శనివారం జీజీహెచ్‌లో మళ్లీ లాపరోస్కోపిక్ ద్వారా ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్లో సూపరింటెండెంట్ స్వయంగా పాల్గొనడమే కాకుండా పీజీ వైద్యులకు, ఇతర వైద్యులకు దిశానిర్దేశం చేశారు. లాపరోస్కోపిక్ విధానంపై పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాపరోస్కోపిక్ ఆపరేషన్ వలన రోగులు త్వరగా కోలుకునే వీలుంటుందని తెలిపారు. కోత, కుట్టు ఉండనందున రక్తస్రావం సమస్య కూడా ఉండదని, పేషెంట్ కూడా త్వరగా డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో గైనకాలజీ హెచ్‌ఓడీ డాక్టర్ సంధ్యారాణి, అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీదేవి, పీజీలు పాల్గొన్నారు.


