భగ్గుమంటున్న బాణసంచా రేట్లు.. సామాన్యుడి జేబుకు చిల్లులు
బాణసంచా అనుమతుల వివరాలు
తాత్కాలిక లైసెన్సులు
అగ్నిమాపకశాఖ మంజూరు
పరిధి చేసిన లైసెన్సులు
మార్కాపురం 26
గిద్దలూరు 25
వైపాలెం, దోర్నాల 25
కంభం 14
కనిగిరి 43
పర్మినెంట్ లైసెన్సులు
మార్కాపురం 2
గిద్దలూరు 2
కనిగిరి 3
పొదిలి 1
మార్కాపురం: వెలుగుల పండుగ దీపావళి వేళ మార్కెట్లలో సందడి మొదలైంది. అయితే రంగుల హరివిల్లు కురిపించే బాణసంచా ధరలు చూస్తే మాత్రం పండుగకు ముందే పేలిపోతున్నాయి. నిత్యావసరాల ధరలతో అల్లాడుతున్న సామాన్యుడికి టపాసుల ధరల మోత గుబులు పుట్టిస్తోంది. గత ఏడాదితో పోల్చితే ఈసారి ధరలు ఏకంగా 20 నుంచి 30 శాతం వరకు పెరగడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు. చిన్నారుల ఆనందం కోసం పెద్దలు అయిష్టంగానే జేబులు గుల్ల చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
123 దుకాణాలకు అనుమతి
దీపావళి పండుగను పురస్కరించుకుని అగ్నిమాపక శాఖ అధికారులు నిబంధనల మేరకు బాణసంచా దుకాణాలకు తాత్కాలిక లైసెన్సులు మంజూరు చేశారు. మార్కాపురం డివిజన్ పరిధిలోని మార్కాపురం, కంభం, గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి ఫైర్ స్టేషన్ల పరిధిలో మొత్తం 123 షాపులకు అధికారులు అనుమతి పత్రాలు అందజేశారు. మార్కాపురం పట్టణంలో 26 దుకాణాలకు అనుమతి లభించగా, వ్యాపారులంతా పట్టణంలోని ఎస్వీకేపీ కళాశాల ప్రాంగణంలో తాత్కాలిక స్టాళ్లు ఏర్పాటు చేసుకుని విక్రయాలు సాగిస్తున్నారు. అలాగే మార్కాపురం, పొదిలి, తర్లుపాడు, కొనకనమిట్ల మండలాల పరిధిలో సుమారు 45 దుకాణాలు ఏర్పాటవుతున్నాయి. తమిళనాడులోని ప్రసిద్ధ శివకాశితో పాటు రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, చిలకలూరిపేట తదితర ప్రాంతాల నుంచి భారీగా టపాసులు మార్కాపురానికి దిగుమతి అయ్యాయి.
హడలెత్తిస్తున్న ధరలు
ముడిసరుకుల వ్యయం, రవాణా చార్జీలు పెరగడంతో తయారీ కంపెనీలు టపాసుల ధరలను భారీగా పెంచేశాయి. కాకరపువ్వొత్తులు, చిచ్చుబుడ్లు, భూచక్రాలు, విష్ణుచక్రాలు, ఫ్యాన్సీ ఐటమ్స్ ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి. దీపావళి వస్తే పెద్దల కంటే పిల్లలకే ఉత్సాహం ఎక్కువ. ఏడాదికోసారి వచ్చే పండుగ కావడంతో పిల్లల ఆనందాన్ని కాదనలేక తల్లిదండ్రులు భారమైనా కొనుగోళ్లు చేస్తున్నారు. అయితే ధరల భారం తీవ్రంగా ఉండటంతో గతంలో మాదిరి కాకుండా, చాలామంది నామమాత్రంగా టపాసులు కొనుగోలు చేసి పండుగను మమ అనిపించేందుకు సిద్ధమవుతున్నారు.
జనావాసాల్లో అమ్మితే కటకటాలకే..
ఈ నెల 7, 8, 9 తేదీల్లో మాత్రమే తాత్కాలిక లైసెన్సులు పొందిన వ్యాపారులు బాణసంచా అమ్మకాలు సాగించాలని అధికారులు స్పష్టం చేశారు. మార్కాపురం పట్టణంలో ప్రధాన రహదారులు, ఇళ్ల మధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయాలు జరపకూడదని, కేవలం ఎస్వీకేపీ కళాశాల మైదానంలోనే విక్రయాలు చేపట్టాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించి రహస్యంగా నిల్వ చేసినా, జనావాసాల మధ్య విక్రయాలు చేపట్టినా క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు.
నిబంధనలు తప్పనిసరి
లైసెన్స్ పొందిన వ్యాపారులు ప్రతి షాపునకు మధ్య కనీసం 3 మీటర్ల దూరం పాటించాలి. ప్రమాదాల నివారణకు ప్రతి దుకాణం వద్ద 200 లీటర్ల నీటి డ్రమ్ము, సరిపడా ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచుకోవాలి. అగ్నిమాపక శాఖ అధికారుల ఫోన్ నంబర్లను దుకాణాల వద్ద బోర్డులపై ప్రదర్శించాలి. ప్రజలు కూడా టపాసులు కాల్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. గడ్డివాములు, పూరిగుడిసెల సమీపంలో టపాకాయలు కాల్చకూడదు. ప్రమాదాలకు తావులేకుండా పిల్లల పక్కనే తల్లిదండ్రులు ఉండి జాగ్రత్తగా టపాసులు కాల్పించాలి.
– రామకృష్ణ, ఫైర్ ఆఫీసర్, మార్కాపురం
విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న టపాసులు
మార్కాపురం డివిజన్ పరిధిలో 123 దుకాణాలకు తాత్కాలిక లైసెన్సులు
మార్కాపురం ఎస్వీకేపీ కళాశాల మైదానంలో 26 షాపుల ఏర్పాటు
గతేడాదితో పోలిస్తే 20 నుంచి 30 శాతం పెరిగిన ధరలు
జనావాసాల్లో విక్రయిస్తే జైలుకే.. అగ్నిమాపక శాఖ హెచ్చరిక
టపాసుల ధరలు ఇలా..
రకం ధర(రూ.లో)
గత ఏడాది ప్రస్తుతం
కాకర పువ్వొత్తులు బాక్స్ 1350 1450
చిచ్చుబుడ్లు(బాక్స్) 300 350
లక్ష్మిబాంబులు(చిన్న ప్యాక్) 400 450
లక్ష్మిబాంబులు(పెద్ద ప్యాక్) 550 600
ఫ్లవర్ ఆటమ్ బాక్స్ 290 390
వంకాయబాంబ్‌లు 200 350
100వాలా 120 150
1000వాలా 350 400
10000వాలా 3500 3900
రాకెట్స్ బాక్స్ 420 500
భూచక్రాలు(బాక్స్) 250 270
మతాబులు(బాక్స్) 250 290


