మృతదేహాలను పరిశీలించిన తమిళనాడు మంత్రి | - | Sakshi
Sakshi News home page

మృతదేహాలను పరిశీలించిన తమిళనాడు మంత్రి

Nov 6 2026 2:08 AM | Updated on Nov 6 2026 2:08 AM

మృతదేహాలను పరిశీలించిన తమిళనాడు మంత్రి సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌కు కన్నీటి వీడ్కోలు

● మత్స్యకారుల కుటుంబ సభ్యులతో కలిసి జీజీహెచ్‌లో మృతదేహాల పరిశీలన

● నాలుగు మృతదేహాలను గుర్తించిన మత్స్యకారుల కుటుంబ సభ్యులు

● కలెక్టర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్న తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రి

ఒంగోలు టౌన్‌: చైన్నె సోనాబోటు మునిగిన ఘటనలో మరణించిన తమిళనాడుకు చెందిన మత్స్యకారుల మృతదేహాలు కొత్తపట్నం సముద్రతీరంలో లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రి ఎన్‌. మేరీ విల్సన్‌ గురువారం రాత్రి ఒంగోలుకు వచ్చారు. అప్పటికీ ప్రత్యేక వాహనంలో మత్స్యకారుల కుటుంబ సభ్యులు కూడా ఒంగోలుకు చేరుకున్నారు. వారితో పాటు రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్‌ రమా శంకర్‌ నాయక్‌, కలెక్టర్‌ పి.రాజాబాబులతో కలసి జీజీహెచ్‌ మార్చూరీలో ఉన్న మృతదేహాలను పరిశీలించారు. పడవలో మొత్తం 9 మంది ఉండగా అంతా సముద్రంలో గల్లంతయ్యారు. వారిలో ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. వాటిలో నాలుగు మృతదేహాలను మత్స్యకారుల కుటుంబ సభ్యులు గుర్తించినట్లు మంత్రి మేరీ విల్సన్‌ మీడియాకు తెలిపారు. రాత్రి కావడంతో గాలింపు చర్యలు నిలిపివేసినట్లు కలెక్టర్‌ రాజాబాబు వివరించారు. శుక్రవారం గాలింపు చర్యలను ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మృతదేహాలను వెలికితీసేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేయడం, బోటును బయటకు తీసుకురావడంపై కోస్టల్‌ అధికారులతో ప్రకాశం భవనంలో తమిళనాడు మంత్రి మేరీ విల్సన్‌, కలెక్టర్‌ రాజాబాబు, ఏపీ మత్స్య శాఖ కమిషనర్‌ రమా శంకర్‌ నాయక్‌ చర్చించారు.

కొత్తపట్నం తీరంలో నేవీ జెట్‌ చక్కర్లు

● ఐదుగురి మృతదేహాల కోసం గాలింపు

ఒంగోలు సబర్బన్‌: చైన్నెకి చెందిన సోనా బోటు సముద్రంలో మునిగి మత్స్యకారులు మృతి చెందిన సమాచారంతో గురువారం విశాఖ నుంచి నేవీ జెట్‌ విమానం కొత్తపట్నం తీరంలో చక్కర్లు కొట్టింది. మృతదేహాలను గాలించే క్రమంలో సముద్ర జలాలపై అతి నెమ్మదిగా రెండు పర్యాయాలు చక్కర్లు కొట్టింది. కాగా కొత్తపట్నం తీరానికి కొట్టుకొచ్చిన నలుగురు మత్స్యకారుల మృతదేహాలను కలెక్టర్‌ పి.రాజాబాబు గురువారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. బోటు ప్రమాదంలో మృతి చెందిన తొమ్మిది మందిలో నలుగురి మృతదేహాలు తీరానికి కొట్టుకురాగా తమిళనాడుకు చెందిన అధికారులకు సమాచారం అందించామని తెలిపారు. మిగతా వారి ఆచూకీ ఇంకా తెలియలేదని, గాలింపు ముమ్మరం చేశామని చెప్పారు. బోటును ఒడ్డుకు తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ టి.చంద్రశేఖర్‌ నాయుడు, మత్స్య శాఖ జేడీ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కొమరోలు: మండలంలోని గోపానిపల్లె ఎస్సీ కాలనీకి చెందిన సీఆర్పీఎఫ్‌ జవాన్‌ ఇసుకల శాంతిబాబు(32) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరులో మృతి చెందారు. అక్కడి డాగ్‌ బ్రీడింగ్‌ అండ్‌ ట్రైనింగ్‌ స్కూల్లో విధులు నిర్వహిస్తున్న శాంతిబాబు గత నెల 28వ తేదీన అనారోగ్యానికి గురై అస్పత్రిలో చికిత్స పొందుతూ బుధావరం మృతి చెందారు. శాంతిబాబు పార్థివదేహాన్ని సీఆర్పీఎఫ్‌ ఉన్నతాధికారులు బెంగళూరు నుంచి స్వగ్రామమైన కొమరోలు పంచాయతీ గోపానిపల్లె ఎస్సీకాలనీకి గురువారం తీసుకువచ్చారు. సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ను చివరి చూపు చూసేందకు వచ్చిన వారితోపాటు భార్య, తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో ఎస్సీకాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనంతరం సీఆర్‌పీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండర్‌ కేవీకే సింగ్‌, ఎస్సై మహమ్మద్‌ ఖాన్‌, సిబ్బందితో కలిసి గాలిలో కాల్పులు జరిపి, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఇసుకల శాంతిబాబుకు భార్య ఝాన్సీ, నాలుగేళ్ల వయసు కుమార్తె ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement