టంగుటూరు: టీడీపీ నాయకులు కొణిజేడు గ్రామంలో బౌన్సర్లను పెట్టి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి ఓటు హక్కు వినియోగించకుండా అడ్డుకున్నారని, ఇక్కడ రీ పోలింగ్ నిర్వహించాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, కొండపి ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. గురువారం కొణిజేడు గ్రామానికి చేరుకున్న ఆయన ఓటర్లకు మద్దతుగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాల్సిన అధికారులు.. ఓటు వేయడానికి వస్తున్న వైఎస్సార్ సీపీ సానుభూతిపరులను గూండాలతో అడ్డగిస్తున్నా స్పందించకపోవడాన్ని తప్పుబట్టారు. అధికారులు టీడీపీకి వత్తాసు పలుకుతూ పచ్చ చొక్కాలు వేసుకుని విధులు నిర్వర్తిస్తున్నారని విమర్శించారు. ఓటు హక్కు అనేది రాజ్యాంగం కల్పించిందని, అటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా అధికారులు ప్రవర్తిస్తున్న తీరు గర్హనీయమన్నారు. కొణిజేడులో రీపోలింగ్ నిర్వహించని పక్షంలో కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే కూటమి నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు మంచి చేస్తే ఎలక్షన్లకు భయపడేవారు కాదని ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి ఎలక్షన్లకు వెళ్లడం వలన ప్రజలు ఓడగొడతారని భయపడి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు. ఆయన వెంట కొణిజేడు వైఎస్సార్ సీపీ నాయకులు, ఓటర్లు టున్నారు.
కొణిజేడులో రీపోలింగ్ నిర్వహించాలి
మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ డిమాండ్


