వ్యాపారుల కిడ్నాప్‌.. కిలోన్నర బంగారం చోరీ | - | Sakshi
Sakshi News home page

వ్యాపారుల కిడ్నాప్‌.. కిలోన్నర బంగారం చోరీ

Nov 5 2026 1:34 AM | Updated on Nov 5 2026 1:34 AM

ఒంగోలు టౌన్‌: ఒంగోలులో పట్టపగలే చోరీ జరిగింది. తమిళనాడుకు చెందిన బంగారు వ్యాపారులను కిడ్నాప్‌ చేసిన దొంగలు ఊరిబయటకు తీసుకెళ్లి దాడి చేసి వారి వద్ద ఉన్న బంగారు నగలను తీసుకెళ్లడం సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం...కోయంబత్తూరు చెట్టి స్ట్రీట్‌కు చెందిన తండ్రి కొడుకులు ఆర్‌డీ బాలాజీ, అతడి కుమారుడు రత్న శరవణ్‌ బంగారం వ్యాపారం చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లోని బంగారు దుకాణాల నుంచి ఆర్డర్‌ తీసుకొని నగలు తయారు చేయించి విక్రయిస్తుంటారు. అందులో భాగంగా ఒంగోలులోని బంగారు దుకాణాల నుంచి తీసుకున్న ఆర్డర్‌ తాలుకు నగలను డెలివరీ చేసేందుకు మంగళవారం మధ్యాహ్నం గం.3.30 కు శబరీ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కి బుధవారం ఉదయం 5.30 గంటలకు ఒంగోలు చేరుకున్నారు. రైలు దిగి తాము వెళ్లాల్సిన చోటుకు ఆటో మాట్లాడుకొని బయలుదేరారు. ఆటో రైల్వే స్టేషన్‌ రోడ్డులోని ఉపాస్‌ హాస్పిటల్‌ వద్దకు రాగానే ఇన్నోవా కారులో వచ్చిన ఏడుగురు దుండగులు ఆటోను అటకాయించారు. ఆటోలో ఉన్న బంగారు వ్యాపారులను బలవంతంగా కిడ్నాప్‌ చేసి కారు ఎక్కించుకున్నారు. నగర శివారులో నెల్లూరు వైపు వెళ్లే దారిలో డి6 ఎక్సోటికా వద్దకు తీసుకెళ్లారు. అక్కడ బాలాజీ, శరవణ్‌ మీద దాడి చేసి కొట్టారు. వారి వద్ద ఉన్న కిలోన్నర బంగారు నగలు, రెండు మొబైల్‌ ఫోన్లు తీసుకొని పరారయ్యారు. ఈ బంగారం విలువ సుమారు రూ.2 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. బాధితులు గాంధీనగర్‌ చేరుకొని దోపిడీ జరిగిన విషయాన్ని బంగారు దుకాణాల వ్యాపారులకు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు వెంటనే రంగంలోకి దిగిన డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, టూ టౌన్‌ సీఐ వీరానాయక్‌ రంగంలోకి దిగారు. దుండగుల దాడిలో గాయపడిన బాధితులను జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సెంట్రల్‌ క్రైం పోలీసు స్టేషన్‌ సీఐ కమలాకర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ దోపిడీ ఒంగోలు నగరంలో కలకలం సృష్టించింది.

ఇంటి దొంగల పనేనా...

జిల్లాలో కలకలం సృష్టించిన బంగారం చోరీ కేసుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలాజీ, శరవణ్‌లు కొంతకాలంగా బంగారు వ్యాపారం చేస్తున్నారు. ఆర్డర్‌ మీద నగలు తయారు చేసి అమ్ముతున్నారు. ఒకేసారి కిలో, రెండు కిలోల బంగారు నగలు తయారు చేసుకొని ఒంగోలుకు బయలుదేరుతుంటారు. ఈ వ్యవహారం బయటి వాళ్లకు తెలిసే అవకాశఽం లేదు. బంగారు దుకాణాల నిర్వాహకులకు, లేదా దుకాణాల్లో పనిచేసే వారికి మాత్రమే తెలిసే అవకాశం ఉంది. చోరీ జరిగిన తీరు చూస్తే బాలాజీ, శరవణ ఇద్దరు కోయంబత్తూరులో నగలు తీసుకొని బయలు దేరిన సమయం కచ్చితంగా తెలుసుకొన్న తర్వాతే ఒంగోలులో దొంగలు రైల్వే స్టేషన్‌ వద్ద కాపు కాసినట్లు తెలుస్తోంది. ఇన్నోవా కారును సైతం సిద్ధం చేసుకోవడం, బంగారు వ్యాపారులను కిడ్నాప్‌ చేసి దక్షిణ బైపాస్‌ వైపునకు తీసుకెళ్లడం మొత్తం పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇది ఇంటి దొంగల పనే అయి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.

ఒంగోలులో పట్టపగలే దొంగల హల్‌చల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement