ప్రాదేశిక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి | - | Sakshi
Sakshi News home page

ప్రాదేశిక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

Nov 5 2026 1:34 AM | Updated on Nov 5 2026 1:34 AM

ఒంగోలు టౌన్‌: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ప్రాదేశిక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్‌ పి.రాజాబాబు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా తగిన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. కలెక్టర్‌ కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోలు రూంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... 2 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా జిల్లాలోని మిగిలిన 25 స్థానాలకు, 271 ఎంపీటీసీ స్థానాల్లో 151 ఏకగ్రీవంగా కాగా మిగిలిన 220 ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 599 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, 12665 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. జిల్లాలో 362 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించినట్లు చెప్పారు. 372 హైపర్‌ సెన్సిటివ్‌ కేంద్రాలున్నాయని, 524 సాధారణ కేంద్రాలున్నట్లు చెప్పారు. సమస్యాత్మక, హైపర్‌ సెన్సిటివ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సాధారణ పోలింగ్‌ కేంద్రాలలో ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు లాప్‌ టాప్‌లు ఇచ్చి వారి ద్వారా డేటాని నిక్షిప్తం చేయడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ప్రతి పోలింగ్‌ కేంద్రంలోనూ డేటా రికార్డింగ్‌ చేయనున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైందని, గ్రామీణ ప్రజలంతా తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సందర్భంగా ఎవరైనా సమస్యలు సృష్టించాలని ప్రయత్నిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తుఫాన్‌ నష్ట పునరుద్ధరణ చర్యలు తీసుకుంటున్నాం

ఒకవైపు ఎన్నికల ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు మురసు తుఫాను నష్ట నివారణతో పాటుగా పునరుద్ధరణ చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈదురుగాలులు బలంగా వీచడం వలన పంట నష్టం కంటే విద్యుత్‌ స్తంభాలు, చెట్లు ఎక్కువగా దెబ్బ తిన్నాయని వివరించారు. జిల్లాలో సుమారు 1000కి పైగా విద్యుత్‌ స్తంభాలు దెబ్బతిన్నాయని, చెట్లు కూడా భారీగానే కూలిపోయాయని తెలిపారు. తుఫాను 3 వేల హెక్టార్ల వరకు ప్రభావం చూపిందని తెలిపారు. జిల్లాలో సుమారు 500 ఇళ్ల వరకు దెబ్బతిన్నాయని, 2800 మందిని శిబిరాలకు తరలించినట్లు చెప్పారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను శిబిరాలకు తరలించడం వల్ల ప్రాణనష్టం జరగకుండా కాపాడగలిగామన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి, జిల్లా పరిషత్‌ సీఈఓ చిరంజీవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement