సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అతి తీవ్ర తుఫాన్ మురసు జిల్లాలో విధ్వంసం సృష్టించింది. మంగళవారం తెల్లవారుజామున సుమారు 5.30 గంటలకు కొత్తపట్నం–చిన్నగంజాం మధ్య తుఫాన్ తీరం దాటింది. ఆ సమయంలో 110 నుంచి 150 కిలోమీటర్ల మేర వీచిన పెనుగాలు బీభత్సం సృష్టించాయి. ఒంగోలు, కొండపి, సంతనూతలపాడు, అద్దంకి నియోజకవర్గాల్లో జన జీవనం స్తంభించింది. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేల కూలడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పంటపొలాలు దెబ్బతిన్నాయి. నాగులుప్పలపాడు మండలంలో సోమవారం రాత్రి 10 గంటల నుంచే గాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. సుమారు 70 కి.మీ వేగంతో గాలులు వీచాయి. తుఫాన్ తీరానికి దగ్గరయ్యే కొద్దీ ఆ తీవ్రత 140 కి.మీ వేగానికి చేరుకుంది. తుఫాన్ తీరం దాటిన కొత్తపట్నం, చినగంజాంల మధ్య నాగులుప్పలపాడు ఉండటంతో పెద్ద ఎత్తున విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, చెట్లు కూలిపోయాయి. ఎక్కువ నష్టం కూడా ఈ మండలంలోనే వాటిల్లిందని కలెక్టర్ రాజాబాబు తెలిపారు.
అంధకారంలో ఒంగోలు..
జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో భారీగాలులతో జనం బెంబేలెత్తారు. రాత్రి నుంచి కుండపోత వర్షం కురిసింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సోమవారం రాత్రి 11 గంటల నుంచి మంగళవారం సాయంత్రం వరకూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో ఎనిమిది గంటల వరకూ విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదు. దీంతో జనం తీవ్ర అవస్థల పాలయ్యారు. నీళ్లులేక ఇక్కట్లపాలయ్యారు. పలు ప్రాంతాల్లో నేలకొరిగిన భారీ వృక్షాలను తొలగించడంలో కార్పొరేషన్, విద్యుత్ శాఖలు తీవ్రంగా విఫలమయ్యాయి. నగరంలో ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, కర్నూలు రోడ్డు, లాయర్‌పేట పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. దక్షిణ బైపాస్ వద్ద విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్‌లు నేలకూలాయి. కేశవస్వామిపేటలోని చెన్నకేశవస్వామి ఆలయంలోని ధ్వజస్తంభం కూలిపోయింది. నగర శివారు త్రోవగుంట, కరవది ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనం రాకపోకలు స్తంభించాయి. తీర ప్రాంత మండలం కొత్తపట్నంలో భారీగాలులకు చివురుటాకులా వణికింది. 150 కిలో మీటర్లు మేర పెనుగాలులు బీభత్సాన్ని సృష్టించాయి. దాదాపు 15 గ్రామాలు అంధకారంలో ఉండిపోయాయి. సుమారు 100 ట్రాన్స్‌ఫార్మర్లు, 600 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 11 కేవీ, ఎల్‌టీ లైన్లపై చెట్లు విరిగి పడడంతో విద్యుత్‌కు అంతరాయం కలిగింది. బకింగ్‌హామ్ కాలువ దాటుతుండగా ఓ మహిళ గల్లంతయింది. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం రంగంలోకి దిగి ప్రయత్నించినా కాపాడలేకపోయారు. సముద్రం 30 మీటర్ల మేర ముందుకొచ్చింది. మత్స్యకారులు సోమవారం నుంచే తీరానికి పరిమితమయ్యారు. పునరావాస కేంద్రాలను జిల్లా ప్రత్యేక అధికారి రంజిత్ బాష, కలెక్టర్ రాజాబాబు పరిశీలించారు. జిల్లాలో అత్యధికంగా నాగులుప్పలపాడు 20, కొత్తపట్నం 18, త్రోవగుంట 17 సెంటిమీటర్ల మేర వర్షం కురిసింది.
నిలిచిన రైళ్లు..ప్రయాణికులకు నరకం
తుఫాన్ ప్రభావంతో రైల్వే విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. పెనుగాలులకు ఒంగోలు–చిన్నగంజాం స్టేషన్ల మధ్య రైల్వే విద్యుత్ కేబుల్‌కు ఉండే సపోర్టు రాడ్స్ వంగి పోవటంతో విద్యుత్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు 50 రైళ్లు పది నుంచి 13 గంటలు ఆలస్యంగా నడిచాయి. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటలకు విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించటంతో చైన్నె వైపు, మూడు గంటల నుంచి విజయవాడ వైపు రైళ్లు పునరుద్ధరించారు. సింగరాయకొండ రైల్వేస్టేషన్ లో మంగళవారం విశాఖపట్నం వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు(18510) 13 గంటల సేపు నిలిచిపోయింది. తెల్లవారుజామున 2.15 గంటల నుంచి ఆగిన రైలు తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు బయలు దేరింది. దీంతో ప్రయాణికులు ఆహారం లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు ఎవరూ వారి బాధలు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీనికి తోడు రైల్వేస్టేషన్ సమీపంలోని హోటళ్లు అధిక ధరలు వసూలు చేసి ప్రయాణికులను దోచుకున్నారు. ప్రయాణికుల ఇబ్బందులు గమనించిన స్థానిక ఆర్యవైశ్యులు చందాలు వేసుకుని పులిహోర, బిస్కెట్‌లు, పొంగలి తయారు చేయించి పంపిణీ చేసి వారి ఆకలి తీర్చారు. విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ వెళ్లిన తరువాత తిరుపతి–కాకినాడ ఎక్స్‌ప్రెస్, శబరి ఎక్స్‌ప్రెస్ రైళ్లు వెళ్లాయి. సూరారెడ్డిపాలెం స్టేషన్‌లో తెల్లవారుజామున 4 గంటల సమయంలో తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు ఆగగా మధ్యాహ్నం 11 గంటలకు ఒంగోలు చేరుకుంది. ఈ ప్రాంతంలోని తెట్టు, ఉలవపాడు, టంగుటూరు స్టేషన్‌లలో గూడ్స్ రైళ్లను నిలిపారు. పినాకినీ, విక్రమ సింహపురి (ఇంటర్ సిటీ) రైళ్లు రద్దయ్యాయి.
కొండపి నియోజకవర్గం ఉక్కిరిబిక్కిరి..
మురసు తుఫాన్ కొండపి నియోజకవర్గం పరిధిలోని సింగరాయకొండ, టంగుటూరు, సింగరాయకొండ మండలాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపింది. సింగరాయకొండ మండలంలో 56.80 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈదురు గాలుల తీవ్రత ఉధృతంగా ఉండటంతో చాలా ప్రాంతాల్లో చెట్టు కొమ్మలు విరిగిపడగా విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. రేకుల ఇళ్లు ఉన్న ప్రాంతాల్లో రేకులు లేచిపోయాయి. సోమవారం రాత్రి 11 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పాకల బీచ్‌లో అలల తీవ్రతకు తీరం కోతకు గురవటంతో పాటు సముద్రం 20 మీటర్లు ముందుకు వచ్చింది. మత్స్యకారులు బోట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించి జాగ్రత్త చేసుకున్నారు. పాకల, ఊళ్లపాలెం, బింగినపల్లి గ్రామాల్లో గాలుల తీవ్రతకు విద్యుత్ స్తంభాలు కూలిపోగా సాయంత్రం వరకు వాటిని తొలగించిన దాఖలాలు లేవు. తీర ప్రాంత గ్రామాల్లో ఎటువంటి సహాయక చర్యలు చేపట్టలేదని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సరఫరా లేకపోవటంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొండపి మండలంలో పెనుగాలులు విధ్వంసం సృష్టించాయి. రాత్రి అంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. రాకపోకలు స్తంభించాయి. మండలంలోని ముప్పవరం ఎస్సీ కాలనీ వద్ద భారీ చెట్టు రోడ్డుకు అడ్డంగా నేలమట్టం కావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొండపి టంగుటూరు మీదుగా ఒంగోలు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు కందుకూరు నియోజకవర్గం రామాయపట్నం పల్లెపాలెం తీరంలో సముద్రం 70 మీటర్లు ముందుకొచ్చింది.
పొంగిన వాగులు, వంకలు
అద్దంకి నియోజకవర్గంలో బల్లికురవ, జే పంగులూరు, కొరిశపాడు మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. ఆయా మండలాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర విఘాతం కలిగింది. బల్లికురవ మండలంలో మిర్చి, పత్తి, కురగాయలు, చెరకు తోటలు నీట మునిగాయి. జేపంగులూరు మండలంలో సుమారు 21 గ్రామాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. వాగులు పొంగి పొర్లడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఓ ప్రైవేటు స్కూలు బస్సుపై చెట్టు పడింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. కొరిశపాడు మండలంలో వీచిన పెను గాలులకు, భారీ వర్షాలకు పలు పంటలు దెబ్బతిన్నాయి. దైవాలరావూరు పడమర వాగు కట్ట తెగిపోవడంతో కట్టకింద ఉన్న పొలాలు నీట మునిగాయి. అలాగే ఎగువ నుంచి వచ్చే వర్షపు నీటి ప్రవాహానికి మరి కొన్ని ప్రాంతాల్లోని చేలల్లో పంటలు దెబ్బతిన్నాయి.
నేటి ఉదయానికి విద్యుత్ పునరుద్ధరణ:
నాగులుప్పలపాడు, కొత్తపట్నం మండలాల్లో బుధవారం ఉదయం 11 గంటల లోపు పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. తీవ్ర గాలుల ప్రభావంతో ఒంగోలు నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని చెప్పారు. ఒంగోలు నగరంలో మంగళవారం సాయంత్రానికి 50 శాతం ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరించామని, మిగిలిన చోట్ల రాత్రి 11 గంటల లోపు సరఫరా చేస్తామని తెలిపారు.
కొత్తపాలెం గ్రామ సమీపంలో పొంగిపొర్లుతున్న వాగు
రామాయపట్నం మండలం పల్లెపాలెంలో కోతకు గురైన తీరం
తుఫాన్ నేపథ్యంలో బుధవారం ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు డీఈఓ తెలిపారు. గురువారం ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ ఉన్నందున విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు చెప్పారు.


