మార్కాపురం: మార్కాపురం జిల్లాలో స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ పంకజ్ కుమార్ మీనా తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల బందోబస్తు కోసం సుమారు 800 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్, చెక్‌పోస్టుల ద్వారా నిరంతర నిఘా, పోలింగ్ కేంద్రాలు, రిసెప్షన్ సెంటర్లు, స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఉంటుందన్నారు. మార్కాపురం, గిద్దలూరు స్ట్రాంగ్ రూంలను పరిశీలించి భద్రతా ఏర్పాట్లు చేశామని, స్ట్రాంగ్ రూంల వద్ద రెండు అంచెల భద్రత.. మొదటి అంచెలో ఆర్మ్ గార్డులు, రెండో అంచెలో సివిల్ పోలీసుల పహారా ఉన్నట్టు తెలిపారు. ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్సుల తరలింపు సమయంలో ప్రత్యేక రూట్ బందోబస్తు ఏర్పాటు చేసి స్ట్రాంగ్ రూములకు తరలిస్తామన్నారు. 3వ తేదీన జరగనున్న కౌంటింగ్ రోజు కూడా ఇదే తరహాలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. సెక్షన్ 144 అమల్లో ఉన్నందున ఓటర్లు తమ ఓటు ఉన్న ప్రాంతంలోనే ఉండాలని, ఇతర ప్రాంతాల్లో సంచరించవద్దన్నారు. అనవసరంగా గుంపులుగా చేరడం, ఇతర ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లడం చేయరాదన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ఎన్నికలకు సంబంధించి సమస్యలు, ఫిర్యాదులు ఉంటే ఎస్‌హెచ్‌ఓ, సీఐ, డీఎస్పీ లేదా ఎస్పీకి ఫోన్, మెసేజ్ లేదా లిఖితపూర్వకంగా తెలియజేయవచ్చని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
గిద్దలూరు రూరల్: గిద్దలూరు పోలీసు అధికారులు కూటమి నాయకులకు ఒత్తాసు పలుకుతూ వైఎస్సార్ సీపీ నాయకులను టార్గెట్ చేస్తూ అక్రమ నిర్బంధనలకు పాల్పడుతున్నారు. ప్రజాక్షేత్రంలో ఎన్నికల పోటీలో గెలవలేమని గ్రహించిన కూటమి నాయకులు కుటిల రాజకీయాలకు తెరతీస్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని అక్రమ నిర్బంధనలతో పాటుగా అక్రమ కేసులు బనాయించేందుకు రంగం సిద్ధం చేశారు. వైఎస్సార్ సీపీ మున్సిపల్ అభ్యర్థి డాక్టర్ భూమా నరసింహారెడ్డి ముఖ్య అనుచరుడుగా ఉన్న వెంకటేశ్వరరెడ్డిని గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌లో నిర్బంధించారు. ఎందుకు నిర్బంధించారని ప్రశ్నిస్తే సమాచారం ఇవ్వడం లేదని లేదంటున్నారు. ఒక వైపు వైఎస్సార్ సీపీ వార్డు కౌన్సిలర్లకు బెదిరింపు ఫోన్ కాల్స్ చేయడమే కాకుండా పోలింగ్ కేంద్రాల్లో వైఎస్సార్ సీపీ తరఫున ఏజెంటుగా కూర్చునే వారినిసైతం బెదిరిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లను కూర్చునివ్వకుండా చేసి ఏకపక్షంగా ఎన్నికలను నిర్వహించుకోవాలనే దుష్ట ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఎలాగైన సరే ఎన్నికలను సజావుగా నిర్వహించకుండా అడ్డుకునేందుకు కూటమి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు ముందుగానే తెలుస్తోంది.
ఒంగోలు సబర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల విధుల పర్యవేక్షణలో లోపాలు సహించేది లేదని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అధికారులను ఆదేశించారు. ఒంగోలు నగరపాలక సంస్థతో పాటు కొత్తపట్నం మండలంలో పర్యటించి శుక్రవారం వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కల్పనా కుమారి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రానున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు వీలుగా జిల్లా యంత్రాంగం పూర్తి సన్నద్ధతతో ఉండాలని సూచించారు. ఒంగోలు అర్బన్ పరిధిలోని కొప్పోలు చెక్ పోస్ట్ వద్ద ఉన్న బృందాల పనితీరును పరిశీలించి క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. చెక్‌పోస్టుల నుంచి వెళ్లే ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా నగదు, బంగారం, మద్యం లేదా ప్రలోభాలకు గురిచేసే ఎలాంటి వస్తువులు తరలకుండా వీలైనంత తీవ్రమైన నిఘా ఉంచాలని సూచించారు. బృందాలు నిరంతరం పర్యటిస్తూ ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై కన్నేసి ఉంచాలని, ఏదైనా ఫిర్యాదు అందగానే తక్షణమే స్పందించి నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విధుల పట్ల ఎలాంటి అలసత్వం వహించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు, పోలీస్ సిబ్బంది, ఎన్నికల తనిఖీ బృందాల ప్రతినిధులు పాల్గొన్నారు.
మార్కాపురం ఎస్పీ పంకజ్ కుమార్ మీనా
వాహనాల తనిఖీ పక్కాగా చేపట్టాలి జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి


