పెద్దారవీడు: జాతీయ రహదారికి అడ్డంగా వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలో సానికవరం బస్టాండ్ దగ్గర శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..సానికవరం గ్రామానికి చెందిన కంకణాల వెంకటశేషయ్య (45) రోడ్డుకు అడ్డంగా వెళుతున్న సమయంలో దోర్నాల నుంచి హనుమాన్‌జంక్షన్‌కుంట వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. మృతుడు మతిస్థిమితం లేకుండా తిరుగుతూ భిక్షాటన చేస్తూ జీవనం సాగించేవారు. జాతీయ రహదారిలో గ్రామానికి వెళ్లే సర్వీసు రోడ్డు లేకపోవడంతో పాటు రాత్రి సమయంలో విద్యుత్ స్తంబాలకు లైట్లు వేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఒంగోలు సబర్బన్: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఒంగోలు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూము ఏర్పాటు చేసి ఫోన్ నంబర్లు సిద్ధం చేశామని కలెక్టర్ పి.రాజాబాబు పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కంట్రోల్ రూమ్ నంబరు –1077 అని వివరించారు. ఈ నంబర్‌తో పాటు మరో 9 సెల్‌ఫోన్ నంబర్లను కూడా ఏర్పాటు చేసి ప్రతి నంబరు వద్ద ఒక సిబ్బందిని కేటాయించామన్నారు. జిల్లాలో ఎక్కడ ఎలాంటి అవాంచనీయ కార్యక్రమాలు జరిగినా, ఎలాంటి సమాచారం కోసం ప్రజలు 9281034478, 9281034479, 9281034481, 9281034482, 9281034483, 9281034485, 9281620305, 9281620306, 9281620312 నంబర్లకు సమాచారం అందింవచ్చన్నారు.
● ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడటం చట్ట విరుద్ధం
● ఈ ఘటనలు తిరిగి పునరావృతం అయితే కఠిన చర్యలు
● తహసీల్దార్, ఎస్సై హెచ్చరిక
కందుకూరు రూరల్: మండలంలోని కొండముడుసుపాలెం గ్రామం వడ్డెపాలెంలో రామాలయానికి చందా ఇవ్వలేదన్న నెపంతో పది కుటుంబాలను కుల బహిష్కరణ చేశారు. ఈ ఘటనపై కందుకూరు తహసీల్దార్ పి.మురళి, ఎస్సై ఎం.నాయుడులు శుక్రవారం వడ్డెపాలెంలో విచారణ చేపట్టి గ్రామస్తులతో మాట్లాడారు. రామాలయానికి చందాలు ఇవ్వలేదని కుల బహిష్కరణ చేయడం చట్ట విరుద్ధమని చెప్పారు. చందాలనేవి ఎవరి ఇష్టానికి వారిని వదిలేయాలని, బలవంతంగా చందాలు వసూళ్లు చేయకూడదని కుల పెద్దలకు తెలియజేశారు. కుల బహిష్కరణ చేస్తున్నట్లు వాట్సాప్ గ్రూపులో లేఖ పోస్టు చేయడం, శుభకార్యాలకు, అశుభకార్యాలయాలకు, ఎవరైనా వారితో మాట్లాడి జరిమానాలు విధిస్తామని చెప్తూ లేఖ రాయడం చట్ట విరుద్ధమన్నారు. ఇలాంటి తిరిగి పునరావృతం కాకుండా అందరూ కలిసిమెలసి ఉండాలని గ్రామస్తులకు సూచించారు. ఇలాంటి జరగకుండా చూసుకుంటాని వడ్డెపాలెం వాస్తులతో అధికారులు సంతకాలు తీసుకున్నారు. ఇది ఇలా ఉంటే వాట్సాప్ గ్రూపుల్లో మాత్రం ఆ కుల పెద్దలు రెచ్చగొట్టే మేసేజ్‌లు పెడుతున్నారని బాధితులు భయాందోళన చెందుతున్నారు. ఎవరూ వచ్చినా ఎవరూ భయపడకండా మేసేజ్‌లు పెడుతూ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలకు ఎవరైనా మనస్తాపం చెందితే ఆ కుటుంబాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని బాధితులు వాపోతున్నారు. అధికారులు కూడా కుల పెద్దలందరినీ పిలిపించి వారి సమక్షంలో సమస్యను పరిష్కరించేలా చూడాలని కోరుతున్నారు. అలా కాకుండా గ్రామంలో ఉండే ఒకరిద్దరు కుల పెద్దలు, తక్కువ మంది గ్రామస్తులతో మాట్లాడి వెళ్లడం వల్ల మిగిలిన వారు వారిని రెచ్చగొడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.


