మార్కాపురం టౌన్: మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసిందని మార్కాపురం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం. విజయ సునీత స్పష్టంచేశారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. కనిగిరి మున్సిపల్ చైర్మన్ స్థానం ఏకగ్రీవం కావడంతో అక్కడ ఎన్నికల నిర్వహణ ఉండదని తెలిపారు. జిల్లాలో మొత్తం 100 పోలింగ్ కేంద్రాలకు బదులుగా 70 కేంద్రాల్లోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే రెండు విడతల శిక్షణ పూర్తయిందని పేర్కొన్నారు. ప్రతి ఓటరు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్లను నియమించామని వెల్లడించారు. మార్కాపురంలోని ఎస్వీకేపీ కళాశాలలో రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ కేంద్రంతో పాటు స్ట్రాంగ్ రూమ్‌ను ఏర్పాటు చేశామని, పోలింగ్ పూర్తయిన వెంటనే బ్యాలెట్ బాక్సులను పటిష్ట భద్రత నడుమ ఎస్వీకేపీ కళాశాలకు తరలిస్తామని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు పోలీసు బలగాలతో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికల నియమ నిబంధనలను జిల్లా యంత్రాంగం పూర్తి పారదర్శకంగా అమలు చేస్తోందని, ఏవైనా ఫిర్యాదులు లేదా సమస్యలు ఉంటే నేరుగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ దృష్టికి గానీ తీసుకురావచ్చని సూచించారు. పోలింగ్ రోజున అభ్యర్థులు, కౌన్సిలర్లు, ఏజెంట్లు పాటించాల్సిన నిబంధనలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని, పోలింగ్ ఏజెంట్లు తమ గుర్తింపు కార్డులు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పోలింగ్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని తెలిపారు. ఓటర్లు భయాందోళనలు లేకుండా నిర్భయంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఎస్పీ పంకజ్‌కుమార్ మీనా, డీఆర్‌ఓ శ్రీదేవి, ఆర్‌డీఓ వెంకట శివరామిరెడ్డి, డీడీఓ పి.సుజాత, మున్సిపల్ కమిషనర్ నారాయణ పాల్గొన్నారు.
70 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి
కలెక్టర్ ఎం. విజయ సునీత


