న్యూస్‌రీల్
రెండున్నరేళ్ల కూటమి పాలనలో ఒంగోలులో విచ్చలవిడిగా అవినీతి అక్రమాలు మెప్మాలో రూ.300 కోట్ల పేదల డబ్బులు మింగిన కీలకనేత తాలూకా పోలీసు స్టేషన్ కేంద్రంగా భూ కబ్జాలు పోతురాజు కాలువలో మెక్కిందెంతో.. కూరగాయల మార్కెట్‌పై కన్ను.. ఆక్రమణల పేరుతో షాపుల కూల్చివేత కార్మికనగర్ కూల్చివేతల వెనుక కీలకనేత హస్తం
ఏటీఎంగా మారిన పోతురాజుకాలువ...
కొత్త కూరగాయల మార్కెట్ కూల్చివేత...
అవినీతి ఏలిక..
ఒంగోలు నగరంలో అవినీతి అక్రమాలదే రాజ్యం.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో భూ కబ్జాలు.. ఇసుక దోపిడీ.. మెప్మాలో భారీ కుంభకోణం.. నగరపాలక సంస్థ 150 ఏళ్ల వేడుకల పేరుతో వసూళ్ల పర్వం.. ఇలా ఒక్కొక్కటిగా అక్రమాల బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. నియోజకవర్గ కీలక ప్రజాప్రతినిధి ఏకంగా ఏడుగురు పీఏలను ఏర్పాటు చేసుకుని ప్రభుత్వ కార్యాలయాల నుంచే నెలవారీ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కీలక నేత ఇంటి నుంచే మెప్మా అవినీతికి ప్రణాళిక రచించారంటూ రోజుల తరబడి కథనాలు వచ్చినా తీరు మారలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నగరపాలక సంస్థ 150 ఏళ్ల వేడుకలు సైతం వసూళ్లకు వేదికగా మారాయన్న ఆరోపణలు సొంత పార్టీ నేతల్లోనే చర్చనీయాంశమయ్యాయి. ప్రజాసేవ మాటున పైసా వేట.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అందినకాడికి దండుకోవడమే లక్ష్యంగా అధికార కూటమి నేతలు రెచ్చిపోతున్నారు.
నగరంలోని హైవే సమీపంలో కేన్సర్ హాస్పిటల్ సమీపంలోని కార్మికనగర్‌లో గత 15 ఏళ్లుగా నిరుపేద ప్రజలు నివాసముంటున్నారు. ఇప్పుడా భూములకు మంచి ధర రావడంతో కీలక నేత అనుచరుల కన్నుపడింది. రాత్రికిరాత్రే రౌడీలు రంగం సిద్ధం చేశారు. బుల్డోజర్లతో వెళ్లి విధ్వంసకాండ సృష్టించారు. సుమారు 70 నివాసాలను కూల్చివేశారు. కనీసం ఇళ్లలోని సామాన్లు తీసుకుంటామని కాళ్లు పట్టుకుని బతిమాలినా రౌడీల మనసు కరగలేదు. మహిళలని కూడా చూడకుండా బయటకు లాగిపడేశారు. పనులకు వెళ్లి వచ్చి వండుకుంటున్న అన్నాన్ని కూడా కాళ్లతో తన్నేశారు. చిన్నారుల బడి పుస్తకాలను వీధిలో విసిరేశారు. బాధితులు పోలీసుల వద్దకు వెళితే పట్టించుకోలేదు. ప్రైవేటు వ్యక్తుల ముసుగులో కీలక నేత సన్నిహితులు కార్మిక నగర్‌ను కబ్జా చేశారు.
కార్మికనగర్‌లో టీడీపీ నాయకులు నేటమట్టం చేసిన పేదల ఇళ్లు (ఫైల్)
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సాధారణ ఎన్నికలకు ముందు నగరానికి చెందిన కొందరు నాయకులు భూ వివాదాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వెంటనే సిట్ వేసి విచారణకు ఆదేశించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ విచారణను అటకెక్కించిన కీలక నేత అండ్ కో ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌ను కేంద్రంగా చేసుకుని భూ కబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. నగరంలోని మైనార్టీలకు చెందిన ఒక భూ వివాదాన్ని సెటిల్ చేసిన వైనంపై స్థానిక ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. మంగమూరుడొంక, ముక్తినూతలపాడు, కార్మిక నగర్ వంటి ఎన్నో భూములను సెటిల్‌మెంట్ల పేరుతో కాజేసినట్లు ప్రచారం జరుగుతోంది. సిట్‌లో ఫిర్యాదు చేసిన వారందరినీ తాలూకా పోలీసు స్టేషన్‌కు పిలిపించి బలవంతపు రాజీలు చేయడం వివాదంగా మారింది. ఈ విషయంలో కూటమి నాయకులు మీడియాకు ఎక్కి పరస్పర ఆరోపణలు చేసుకోవడం కూడా జరిగింది. ఒక్క భూ కబ్జాల మీదనే వందలాది కోట్ల రూపాయలు చేతులు మారినట్లు జనం చెవులు కొరుక్కుంటున్నారు. సిట్ విచారణ కొనసాగిస్తే అసలు దొంగలు బయటపడతారని నగర ప్రజలు చెప్పుకుంటున్నారు.
మెప్మా కుంభకోణంలో మెక్కిందెన్ని కోట్లో...
మెప్మాలో జరిగిన అవినీతి గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంతమంచిదని కూటమి పెద్దలు గుసగుసలాడుకుంటున్నారు. కీలక నేతకు చెందిన అత్యంత సన్నిహిత వ్యక్తి ఒక్కరే వంద కోట్లు మెక్కేసినట్లు ఆరోపణలు వినిపించాయి. కీలక నేత పీఏలు, ద్వితీయ శ్రేణి నాయకులు కలిపి మొత్తం 500 కోట్ల రూపాయల వరకు అవినీతికి పాల్పడినట్లు ప్రచారం జరిగింది. నిరుపేద, మధ్య తరగతి మహిళలకు ఆర్థిక భరోసా ఇవ్వాల్సిన స్వయం సహాయక గ్రూపులను అడ్డం పెట్టుకుని నకిలీ సభ్యులతో గ్రూపులు సృష్టించి అందినకాడికి బొక్కేసిన వైనం ప్రభుత్వ పెద్దల వద్దకు వెళ్లినప్పటికీ చర్యలేమీ తీసుకోలేదు. పైగా, నామమాత్రంగా విచారణ జరిపి అధికారులు, కిందిస్థాయి సిబ్బంది మీద వేటు వేసి చేతులు దులుపుకున్నారు. ఈ మెప్మా కుంభకోణం విషయంలో కీలక నేత పీఏ ఒకరు విడుదల చేసిన లేఖలో స్పష్టంగా పేర్కొనడం నియోజకవర్గ ప్రజలంతా చూశారు. సుమారు రూ.300 కోట్లు మెక్కేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఇంతవరకూ అక్రమార్కులపై ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం.
ప్రైవేటు సైన్యంతో ఇసుక దోపిడీ...
ఒంగోలులో కీలకనేత అత్యంత సన్నిహిత వ్యక్తి కనుసన్నల్లో ఇసుకాసురులు రెచ్చిపోయారు. సదరు నేత పీఏల ద్వారా ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని నగరంలోకి వచ్చే ఇసుక టిప్పర్లను అడ్డుకుని కప్పం వసూలు చేయడంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. టిప్పరు యజమానులపై దాడులకు ఉసిగొల్పారు. దాడులు చేయడమే కాకుండా టిప్పర్లు తీసుకెళ్లి తాలూకా పోలీసు స్టేషన్ వద్ద నిలిపివేసి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశారు. టిప్పర్ల నుంచి తీసుకున్న ఇసుక తాలూకు డబ్బులు ఇవ్వకుండా వేధించడంతో టిప్పర్ యజమానులు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయడం సంచలనం సృష్టించింది.
మట్టి కొల్లగొడుతున్న దొంగలు...
నగరంలోని కొప్పోలు ప్రాంతంలో కీలకనేత 100 ఎకరాల్లో ఒక వెంచర్ వేశాడు. దానికి కొత్తపట్నం మండలంలోని చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలించుకుపోతుంటే ప్రజలు తిరగబడ్డారు. వందల ట్రాక్టర్లు పెట్టి పగలూరాత్రీ తేడా లేకుండా మట్టి తరలించడంతో కొత్తపట్నం మండల ప్రజలు కొందరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కొప్పోలు ప్రాంతంలోని చెరువు నుంచి మట్టి తరలించడంతో సమీపంలోని కాలనీలకు వరద ముప్పు ముంచుకొస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేసినా కీలక నేతకు చీమకుట్టినట్లయినా లేకపోవడం గమనార్హం. అంతేగాకుండా గుంటూరుకు చెందిన ఒక మహిళా ఎమ్మెల్యే భర్త తాలూకు వెంచర్‌కు కూడా భారీగా మట్టి తరలించడం వివాదాస్పదమైంది.
150 ఏళ్ల వేడుకల పేరుతో రూ.కోట్లు మెక్కారు...
నగరపాలక సంస్థ ఏర్పడి 150 ఏళ్లయింది. ఈ నేపథ్యంలో అట్టహాసంగా వేడుకలు నిర్వహించారు. వేడుకల పేరుతో చేతికి ఎముక లేకుండా ఖర్చు చేశారు. దీనికి మున్సిపల్ నిధుల నుంచి ఎంత ఖర్చు పెట్టారో, నగర ప్రముఖుల నుంచి వసూలు చేసిన కోట్లాది రూపాయల నుంచి ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తుంటే నోరు మెదపకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 10 పర్సంటేజీ సొమ్ము కీలక నేత జేబులోకి చేరినట్లు నగరంలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. నిజానిజాల సంగతి ఎలా ఉన్నా చేసిన ఖర్చు విషయంలో పారదర్శకత పాటించకపోవడం గమనార్హం. గత రెండేళ్ల కాలంలో నగర పాలక సంస్థను అవినీతికి మారుపేరుగా మార్చివేసినట్లు ప్రజలు విమర్శిస్తున్నారు. ఏసీబీ దాడులలో మున్సిపల్ ఉద్యోగులు పలువురు పట్టుబడ్డారు. ఇంకా అసలు దొంగలు తప్పించుకున్నారన్న వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి.
నగరంలోని పోతురాజుకాలువను అభివృద్ధి చేస్తానంటూ మాయమాటలు చెప్పి ఎన్నికల్లో గెలిచిన కీలకనేత రెండున్నరేళ్లుగా అటువైపు తొంగి కూడా చూడలేదు. మోంథా తుఫాన్ సమయంలో పోతురాజుకాలువ నుంచి వరద నీరు పారేదారిలేక కాలనీల మీద వచ్చి పడింది. దాంతో నగరంలోని 50 కాలనీలకుపైగా నీటమునిగాయి. ఆ తర్వాతైనా పోతురాజు కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని శుభ్రం చేయించారా అంటే అదీ లేదు. పోతురాజుకాలువ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు కాలువ నుంచి వస్తున్న దుర్వాసనతో అల్లాడిపోతున్నారు. కీలక నేతకు పోతురాజు కాలువ ఏటీఎంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నగరం నడిబొడ్డునున్న కొత్త కూరగాయల మార్కెట్ మీద కీలక నేత కన్ను పడింది. అంతే.. కోవిడ్ సమయంలో బకాయిల మీద వడ్డీ, చక్రవడ్డీలు వేసి వ్యాపారులను వేధించారు. బలవంతంగా వారి దుకాణాలను కూల్చివేశారు. ఏరోజుకారోజు కూరగాయలు అమ్ముకుని పొట్ట నింపుకునే చిరువ్యాపారుల బతుకుల మీద బుల్డోజర్లు నడిపి విధ్వంసం సృష్టించారు. మా కడుపులు కొట్టొద్దంటూ కన్నీళ్లతో బాధితులు వేడుకున్నా వదిలిపెట్టలేదు. ఆక్రమణల పేరుతో కూరగాయల మార్కెట్‌ను ధ్వంసం చేసిన కీలకనేత.. ఇప్పుడు తన అనుచరులకు కొన్ని దుకాణాలు కట్టబెట్టినట్లు తెలుస్తోంది.


