ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు 1,265 పోలింగ్ కేంద్రాలు 130 సెన్సిటివ్ కేంద్రాల గుర్తింపు నవంబర్ 5న పోలింగ్, 7న కౌంటింగ్ జెడ్పీ సీఈఓ చిరంజీవి వెల్లడి
ఒంగోలు సిటీ: ప్రకాశం జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జెడ్పీ సీఈఓ బి.చిరంజీవి వెల్లడించారు. ఒంగోలులోని కలెక్టరేట్ మీడియా హాలులో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ తేదీని నవంబర్ 3 నుంచి 5కు మార్చినట్లు చెప్పారు. ఆ రోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. సాయంత్రం 5 గంటలకు క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు స్లిప్పులందించి ఓటు వేసే అవకాశం కల్పిస్తామన్నారు. అవసరమైతే నవంబర్ 6న రీపోలింగ్ నిర్వహిస్తామని, నవంబర్ 7న ఓట్ల లెక్కింపు చేపడతామని వివరించారు.
25 జెడ్పీటీసీ స్థానాలకు 96 మంది పోటీ...
జిల్లాలోని 27 మండలాల పరిధిలో రెండు జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయని జెడ్పీ సీఈఓ తెలిపారు. మర్రిపూడి నుంచి గురిజాల రాజు, పొన్నలూరు నుంచి పి.మాధవి టీడీపీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు వెల్లడించారు. మిగిలిన 25 స్థానాలకు 96 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు చెప్పారు. వైఎస్సార్ సీపీ నుంచి 25 మంది, టీడీపీ నుంచి 22 మంది, బీఎస్పీ, కాంగ్రెస్ నుంచి ఐదుగురు చొప్పున, జనసేన నుంచి ముగ్గురు, సీపీఐ, సీపీఎం తరఫున కలిపి ముగ్గురు, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నట్లు వివరించారు.
220 ఎంపీటీసీ స్థానాలకు
ఎన్నికలు...
జిల్లాలో మొత్తం 371 ఎంపీటీసీ స్థానాలకుగానూ 151 స్థానాలు ఏకగ్రీవమైనట్లు జెడ్పీ సీఈఓ తెలిపారు. వాటిలో టీడీపీకి 143, జనసేనకు ఐదు, వైఎస్సార్ సీపీకి రెండు స్థానాలు దక్కగా, ఒక స్వతంత్ర అభ్యర్థి ఎన్నికయ్యారని చెప్పారు. మిగిలిన 220 స్థానాలకు 599 మంది అభ్యర్థులు పోటీపడుతున్నట్లు వివరించారు. వీరిలో వైఎస్సార్ సీపీ నుంచి 211 మంది, టీడీపీ నుంచి 210 మంది, జనసేన నుంచి 25 మంది, సీపీఎం నుంచి ఆరుగురు, కాంగ్రెస్ నుంచి ఐదుగురు, బీఎస్పీ నుంచి ముగ్గురు, బీజేపీ, సీపీఐ నుంచి ఒక్కొక్కరు ఉన్నట్లు వెల్లడించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత...
జిల్లావ్యాప్తంగా 1,265 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సీఈఓ తెలిపారు. దివ్యాంగుల సౌకర్యార్థం ర్యాంపులు, వీల్‌చైర్లు అందుబాటులో ఉంచుతామన్నారు. సుమారు 130 కేంద్రాలను సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ కేంద్రాలుగా గుర్తించినట్లు చెప్పారు. అవసరమైన చోట మైక్రో అబ్జర్వర్లు, వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ ఒంగోలులోని మూడు ప్రింటింగ్ ప్రెస్‌లలో కొనసాగుతోందని, రెండు రోజుల్లో పూర్తి చేసి భద్రపరుస్తామని వివరించారు.
84 జోన్లు.. 144 రూట్లు...
పోలింగ్ సిబ్బంది రవాణా కోసం జిల్లాను 84 జోన్లు, 144 రూట్లుగా విభజించినట్లు జెడ్పీ సీఈఓ తెలిపారు. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల ద్వారా నవంబర్ 4వ తేదీ సాయంత్రానికే సిబ్బందిని వారికి కేటాయించిన కేంద్రాలకు చేరుస్తామన్నారు. ఎన్నికల సంఘం ప్రత్యేక యాప్ ద్వారా పోలింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేస్తామని చెప్పారు. జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ, ఎంసీసీ బృందాలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
ఒంగోలులోనే కౌంటింగ్...
ఓట్ల లెక్కింపు కోసం ఒంగోలులోని రైజ్ కళాశాల, క్విస్ కళాశాలలను ఎంపిక చేసినట్లు జెడ్పీ సీఈఓ వెల్లడించారు. కొండపి, కందుకూరు, సంతనూతలపాడు నియోజకవర్గాల పరిధిలోని మండలాల కౌంటింగ్ రైజ్ కళాశాలలో, దర్శి, అద్దంకి, ఒంగోలు నియోజకవర్గాల పరిధిలోని మండలాల కౌంటింగ్ క్విజ్ కళాశాలలో నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రతి మండలానికి ఒక ఏఆర్‌ఓ బాధ్యతలు నిర్వహిస్తారని, ఫలితాల అనంతరం విజేతలకు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారని చెప్పారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని జెడ్పీ సీఈఓ చిరంజీవి కోరారు.


