ఓటమి భయంతోనే దౌర్జన్యంగా ఏకగ్రీవాలు | - | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతోనే దౌర్జన్యంగా ఏకగ్రీవాలు

Oct 30 2026 7:42 AM | Updated on Oct 30 2026 7:42 AM

● దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి

గిద్దలూరు రూరల్‌: వెన్నుపోటు పార్టీకి ఓటమి భయం వల్లే ఎన్నికలకు వెళ్లకుండా అధికార గర్వంతో అక్రమంగా దౌర్జన్యంగా ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌ సీపీ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి డాక్టర్‌ భూమానరసింహారెడ్డిని గెలిపించాలని కోరుతూ గురువారం పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్‌, మెయిన్‌బజారు, పొట్టిశ్రీరాములు సెంటర్‌, గణేష్‌నగర్‌ మీదుగా వైఎస్సార్‌ సర్కిల్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను నమ్మించి వెన్నుపోటు పొడిచాడన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచక పాలన కొనసాగిస్తున్నారన్నారు. నామినేషన్లు అడ్డుకోవడం, బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడటం వంటి ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి భారతీయ పౌరుడిపై ఉందన్నారు. ఓటింగ్‌ సమయంలోనూ ఓటర్లు వారి అమూల్యమైన ఓటు హక్కును తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరోనా వంటి కష్ట కాలంలో సైతం జగనన్న ప్రభుత్వం ప్రజలు పూర్తి సేవలను అందించిందన్నారు. చంద్రబాబు మాదిరి ప్రజలను నమ్మించి మోసగించడం జగనన్నకు చేతకాదన్నారు. అన్ని వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరూ వైఎస్సార్‌ సీపీకి పూర్తి మద్దతు పలుకుతున్నారన్నారు. అందరికీ అందుబాటులో ఉన్న ప్రజల వైద్యుడుగా పేరుపొందిన డాక్టర్‌ భూమా నరసింహారెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి కేపీ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారన్నారు. మున్సిపల్‌ అభ్యర్థి డాక్టర్‌ భూమా నరసింహారెడ్డి గత 29 ఏళ్ల నుంచి గిద్దలూరు పట్టణంలోనే ఉంటూ పేద ప్రజలకు వైద్య సేవలను అందిస్తూ అందరి డాక్టర్‌గా పేరుగాంచారన్నారు. మున్సిపాలిటీలో వైఎస్సార్‌ సీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు, యర్రగొండపాలెం పరిశీలకుడు పిడతల ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, యేలం వెంకటేశ్వర్లు, నాయకులు వేమిరెడ్డి రామచంద్రారెడ్డి, మానం బాలిరెడ్డి, ఆర్‌.డి.రామక్రిష్ణ, చేరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, కడప వంశీధరరెడ్డి, ఓబుల్‌రావు, బొర్రా క్రిష్ణారెడ్డి, ఈదుల పాండురంగారెడ్డి, డాక్టర్‌ సూరేపల్లె రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement