రూట్‌ ఆఫీసర్ల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

రూట్‌ ఆఫీసర్ల పాత్ర కీలకం

Oct 30 2026 7:42 AM | Updated on Oct 30 2026 7:42 AM

రూట్‌ ఆఫీసర్ల పాత్ర కీలకం ● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజాబాబు

● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజాబాబు

ఒంగోలు సబర్బన్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో రూట్‌ ఆఫీసర్ల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పి.రాజాబాబు తెలిపారు. ఎన్నికల నిర్వహణ, రూట్‌ ఆఫీసర్ల విధులు, రవాణా–ఓటింగ్‌ విధానంపై మార్గదర్శకాలు జారీ చేశారు. గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఎన్నికల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రూట్‌ ఆఫీసర్ల బాధ్యతలు, సామగ్రి రవాణా, పోలింగ్‌ విధానం, బ్యాలెట్‌ పేపర్‌ మార్కింగ్‌, మడిచే పద్ధతితో పాటు కౌంటింగ్‌ వరకు అధికారులు అనుసరించాల్సిన అన్ని రకాల నిబంధనలపై కలెక్టర్‌ అత్యంత వివరణాత్మక ఆదేశాలు జారీ చేశారు. రూట్‌ ఆఫీసర్లు వారికి కేటాయించిన రూట్‌ పరిధిలోని అన్ని పోలింగ్‌ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ నుంచి పోలింగ్‌ సామగ్రి, బ్యాలెట్‌ బాక్సులు, పోలింగ్‌ సిబ్బంది సురక్షితంగా పోలింగ్‌ కేంద్రాలకు చేరేలా చూడాలని ఆదేశించారు. ఏదైనా కేంద్రంలో సామగ్రి కొరత, బ్యాలెట్‌ బాక్సుల సమస్యలు, సాంకేతిక సందేహాలు తలెత్తితే రూట్‌ ఆఫీసర్లు తక్షణమే స్పందించి పరిష్కరించాలని తెలిపారు. రవాణా ఏర్పాట్ల విషయానికొస్తే, పోలింగ్‌ సామగ్రి, సిబ్బందిని తీసుకెళ్లే వాహనాలు నిర్ణీత రూట్‌ మ్యాప్‌ ప్రకారమే ప్రయాణించాలని, ఎలాంటి కారణం చేతనైనా మార్గం మళ్లించకూడదని స్పష్టం చేశారు. ప్రతి వాహనానికి గట్టి పోలీస్‌ బందోబస్తు ఉండాలని, పోలింగ్‌ ముగిసిన తర్వాత సీల్‌ చేసిన బ్యాలెట్‌ బాక్సులను అత్యంత భద్రత నడుమ నేరుగా స్ట్రాంగ్‌ రూమ్‌లకు చేర్చే రవాణా ప్రక్రియ నిరంతర పర్యవేక్షణలో ఉండాలని సూచించారు.

పోలింగ్‌ రోజు అనుసరించాల్సిన విధానాలను వివరించారు. పోలింగ్‌ ప్రారంభానికి ముందే పోలింగ్‌ ఏజెంట్ల సమక్షంలో ఖాళీ బ్యాలెట్‌ పెట్టెలను పరిశీలించి ప్రత్యక్షంగా చూపించిన అనంతరమే నిబంధనల ప్రకారం సీల్‌ చేసి రికార్డులను ప్రారంభించాలని కలెక్టర్‌ ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రానికి వచ్చే ప్రతి ఓటరు గుర్తింపును పక్కాగా పరిశీలించి ఎడమ చేతి చూపుడు వేలికి చెరగని సిరా గుర్తు వేసిన తర్వాత ఓటర్ల జాబితా రికార్డులో సంతకం లేదా బొటనవేలి ముద్ర సేకరణ పూర్తయ్యాకే ఓటింగ్‌కు అవకాశం కల్పించాలని తెలిపారు. బ్యాలెట్‌ పేపర్‌ ఉపయోగించే ప్రత్యేక విధానం గురించి వివరించారు. ఓటరు రహస్య ఓటింగ్‌ కంపార్ట్‌మెంట్‌లో తనకు నచ్చిన అభ్యర్థి గుర్తుపై ‘క్రాస్‌ మార్క్‌ స్టాంప్‌’ ముద్రించిన తర్వాత ఓటు మైరా (ఇంకు) ఆరిపోక ముందే బ్యాలెట్‌ పేపరును సరైన పద్ధతిలో మడవాలని ఆదేశించారు. ఆ విధానంపై ఓటర్లకు అవగాహన కల్పించాలని ప్రిసైడింగ్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement