రాష్ట్రంలో 22 మున్సిపాలిటీల్లో నామినేషన్లే వేయనివ్వని కూటమి నాయకులు వైఎస్సార్ సీపీ నాయకులను అడ్డుకున్న అధికారులను వదిలేదు లేదు రాజ్యసభ ఫ్లోర్‌లీడర్, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికల్లో..
ఒంగోలు సబర్బన్: రాష్ట్రంలో కూటమి పార్టీల నాయకులు విధ్వంసం సృష్టించి లోకల్ బాడీ ఎన్నికల్లో ఆధిపత్యం చలాయిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని రాజ్యసభ ఫ్లోర్‌లీడర్, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నాయకులు నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికే తీరని మచ్చ అని అన్నారు. ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నగరానికి వచ్చిన ఆయన.. స్థానిక వీఐపీ రోడ్డులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కొందరు అధికారులు, పోలీసులు సైతం అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారిపోయారని విమర్శించారు. అటువంటి వారిని రానున్న రోజుల్లో వదిలేదు లేదని హెచ్చరించారు. ఎవరైతే అధికారులు వైఎస్సార్ సీపీ నాయకుల నామినేషన్లకు అడ్డంపడ్డారో.. వేసిన నామినేషన్లను సైతం ఏ విధంగా తిరస్కరిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ దారుణాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. అధికార పార్టీ నాయకులు, కొందరు అధికారులు కలిసి రాష్ట్రంలో 22 మున్సిపాలిటీల్లో వైఎస్సార్ సీపీ నాయకులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుని కూటమి పార్టీ నాయకులను ఏకగ్రీవం చేసుకున్నారని ధ్వజమెత్తారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రాష్ట్రపతి దృష్టికి, సుప్రీంకోర్టు దృష్టికి, జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఎన్నికల సమయంలో చెప్పిన హామీలేవీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయలేదని, ప్రజలను ప్రలోభపెట్టే కార్యక్రమాలు మాత్రమే చేస్తున్నారని, అందువలన ప్రజలు ఓడిస్తారనే భయంతో ఇతరుల నామినేషన్లను అడ్డుకుంటున్నారని అన్నారు. మీడియా సమావేశంలో ఒంగోలు నగరపాలక సంస్థ వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థి కుప్పం ప్రసాదు, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పీడీసీసీబీ మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏ.వెంకటేశ్వరరావు, తదితర నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ మేయర్, కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలి...
ఒంగోలు సబర్బన్/ఒంగోలు సెంట్రల్: ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీచేస్తున్న మేయర్, కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ఓటర్లను కోరారు. నగరంలో గురువారం వైఎస్సార్ సీపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. భారీగా హాజరైన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఒంగోలు నగరం దద్దరిల్లింది. వైవీ సుబ్బారెడ్డి సుడిగాలి పర్యటన చేసి ఆరు డివిజన్లలో ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరించారు. తొలుత 36వ డివిజన్లో కొణిజేడు బస్టాండ్ సెంటర్ నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా కొణిజేడు బస్టాండ్ సెంటర్లోని లక్ష్మీగణపతిస్వామి ఆలయంలో మేయర్ అభ్యర్థి కుప్పం ప్రసాదు, 35, 36 డివిజన్ల కార్పొరేటర్ అభ్యర్థులు పసుపులేటి మురళీకృష్ణ, ఎస్కే చాన్‌బీ, నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయం సమీపంలోని షాపులు, ఇళ్ల వద్ద పార్టీ అభ్యర్థుల కరపత్రాలిచ్చి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ప్రత్యేక వాహనంపై నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. 35, 36 డివిజన్లతో పాటు 28, 29, 30, 31 డివిజన్లలో ర్యాలీ సాగింది. కొణిజేడు బస్టాండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ.. రాజాపానగల్‌రోడ్డు, జయరాం సెంటర్, జడ్జీల క్వార్టర్లు, యూనియన్ బ్యాంకు, గాంధీ రోడ్డు ఎంట్రన్స్ నుంచి బంగారు కొట్టుల వీధి, గాంధీ బజారు మీదుగా ట్రంక్ రోడ్డుకు చేరుకుంది. అక్కడి నుంచి గానుగపాలెం, అరవపాలెం, దండుపాలెంలో వాహనం దిగి నడుచుకుంటూ దుకాణాలు, ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ర్యాలీల్లో 31, 35, 36 కార్పొరేటర్ అభ్యర్థులు మల్లిశెట్టి శ్రీనివాస అయ్యప్ప, పసుపులేటి మురళీకృష్ణ, ఎస్కే చాన్‌బీ, 28, 29, 30 డివిజన్ల కార్పొరేటర్ అభ్యర్థులు కుట్టుబోయిన కోటేశ్వరరావు (కోటి), కావటి రవికుమార్, వేముల రాధికతో కలిసి వైవీ సుబ్బారెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు.
వైఎస్ జగన్ నినాదాలతో హోరెత్తిన నగరం...
వైవీ సుబ్బారెడ్డితో కలిసి ర్యాలీలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగన్ నినాదాలతో హోరెత్తించారు. ర్యాలీలో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని వైఎస్ జగన్‌తో పాటు వైవీ సుబ్బారెడ్డి, మేయర్ అభ్యర్థి కుప్పం ప్రసాదు జై అంటూ నినాదాలతో సందడి చేశారు. పార్టీ శ్రేణులు ర్యాలీలో ముందు నడుస్తుండగా వెనుక ప్రత్యేక వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, సీఈసీ మెంబర్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు, మేయర్ అభ్యర్థి కుప్పం ప్రసాదు, కార్పొరేటర్ అభ్యర్థులు ప్రజలను ఆకర్షించారు. 29వ డివిజన్లో మేయర్ అభ్యర్థి కుప్పంతో పాటు కార్పొరేటర్ అభ్యర్థి కావటి రవికుమార్‌తో కలిసి వాహనం దిగి కాలినడకన గానుగపాలెంతో పాటు అరవపాలెం, దండుపాలెంలో దుకాణాలు, ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందజేస్తూ వైవీ సుబ్బారెడ్డి ఓట్లు అభ్యర్థించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, పీడీసీసీబీ మాజీ చైర్మన్లు డాక్టర్ మాదాసి వెంకయ్య, వైఎం ప్రసాదరెడ్డి (బన్నీ), పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వరరావు, మద్దిపాడు ఏఎంసీ మాజీ చైర్మన్ ఇనగంటి పిచ్చిరెడ్డి, పార్టీ జిల్లా గౌడ సంఘ అధ్యక్షుడు తాతా నరసింహగౌడ, రాష్ట్ర బలిజ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ దాసరి కరుణాకర్, పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ దామరాజు క్రాంతికుమార్, పలువురు నాయకులు పాల్గొన్నారు.


