దౌర్జన్యాలకు పాల్పడే వారిని వదలం | - | Sakshi
Sakshi News home page

దౌర్జన్యాలకు పాల్పడే వారిని వదలం

Oct 30 2026 7:42 AM | Updated on Oct 30 2026 7:42 AM

ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే సహించం వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులు పనిచేయాలి ఒంగోలు పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి

సీఎస్‌ పురం (పామూరు): స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడే వారిని గుర్తించుకుని భవిష్యత్‌లో వారు ఊరు వదిలి పారిపోయేలా చేస్తామని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఒంగోలు పార్లమెంట్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు. సీఎస్‌ పురంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో చెవిరెడ్డి మాట్లాడారు. గ్రామాల్లో పార్టీలకు అతీతంగా అందరూ ఎంతో ఆప్యాయంగా కుటుంబ సభ్యుల మాదిరిగా ఉంటారని, కానీ ఎన్నికల సందర్భంగా టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతూ ప్రజల మధ్య అనుబంధాన్ని తెంపేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది హేయమైన చర్యని అన్నారు. ప్రభుత్వం, అధికారులు ప్రజలకు ఓటు వేసుకునే పరిస్థితులు కల్పించాలని, అలా కాకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకుల్లా పనిచేస్తే రానున్న కాలంలో అధికారులు పశ్చాత్తాప్పడేలా మా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వైఎస్సార్‌ సీపీ నాయకులను ఇబ్బందిపెట్టే అధికారుల పేర్లు రాసిపెట్టుకోవాలని, అధికారం మారాక వారికి తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు. పార్టీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి దద్దాల నారాయణయాదవ్‌కు అనారోగ్యం కారణంగా హాజరుకాలేకపోయారని చెవిరెడ్డి తెలిపారు. సీఎస్‌ పురం జెడ్పీటీసీ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి దుగ్గిరెడ్డి ప్రతాప్‌ను గెలిపించాలని కోరారు. అనంతరం చెవిరెడ్డిని నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు పాలుగుళ్ల మల్లికార్జునరెడ్డి, మితికాల వరుణ్‌కుమార్‌, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల నారాయణరెడ్డి, వైఎస్సార్‌ టీయూసీ జిల్లా అధ్యక్షుడు మితికాల గురవయ్య, మాజీ ఎంపీపీ భువనగిరి వెంకటయ్య పలువురు నాయకులు పాల్గొన్నారు.

మళ్లీ జగన్‌ రావడం ఖాయం : చెవిరెడ్డి

ఒంగోలు సబర్బన్‌: వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగనన్న సీఎం కావడం ఖాయమని వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. ఒంగోలు మేయర్‌ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌ను గెలిపించాలని కోరుతూ పేర్నమిట్టలోని 50వ డివిజన్‌లో గురువారం రాత్రి ప్రచార ర్యాలీ నిర్వహించారు. పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, మేయర్‌ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ విద్యావంతుడు, వినయశీలి, అందరివాడైన కుప్పం ప్రసాద్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ కుట్రలను తిప్పికొట్టేందుకు వైఎస్సార్‌ సీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement