సింగరాయకొండ: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గోకుల్ పాలకేంద్రం వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును గురువారం జేసీ కల్పనాకుమారి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫ్‌లైయింగ్ స్క్వాడ్ వాహనాల తనిఖీ బృందాలు ఏర్పాటు చేశారా లేదా తహసీల్దార్ రాజేష్‌ను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల విధుల్లో ఎక్కడ నిర్లక్ష్యం వహించవద్దని, పారదర్శకంగా జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డిప్యూటీ తహసీల్దార్ తానికొండ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
● ఎస్పీ హర్షవర్థన్ రాజు
ఒంగోలు టౌన్: పురపాలక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ హర్షవర్థన్ రాజు తెలిపారు. 950 మందికి పైగా పోలీసులను బందోబస్తు కోసం నియమించినట్లు చెప్పారు. నగరంలోని సెయింట్ జెవియర్ స్కూల్, పేర్నమిట్ట జెడ్పీ హైస్కూలు, ఇస్లాంపేటలోని డాన్ బాస్కో టీఐ, అగ్రహారంలోని అంగన్‌వాడీ పాఠశాల, వెంగముక్కలపాలెంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలను గురువారం సందర్శించారు. అక్కడి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. మూడు ప్రదేశాల్లో మొత్తం 122 వార్డులు, 104 పోలింగ్ లోకేషన్లు, 53 నార్మల్, సెన్సిటివ్ 32, హైపర్ సెన్సిటివ్ 19 ఉన్నట్లు వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను అఽధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలన్నారు. ఎటువంటి భయం, ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎన్నికల రోజున 950 మంది పోలీసులు బందోబస్తులో ఉంటారని తెలిపారు. అతి సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించనున్నట్లు పేర్కొన్నారు. స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల వద్ద 24 గంటల భద్రతను కల్పించనున్నట్లు చెప్పారు. ప్రచార గడువు ముగిసిన తరువాత బహిరంగ సభలు, ఊరేగింపులు, లౌడ్ స్పీకర్ల వినియోగం, గుంపులుగా ప్రచారం నిర్వహించడం నిషేధమన్నారు. సంబంధిత పురపాలక సంఘాల ఓటర్లు, నాయకులు , కార్యకర్తలు ప్రచార గడువు ముగిసిన వెంటనే పట్టణం విడిచివెళ్లాలని స్పష్టం చేశారు. ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ చేయడం, ప్రలోభాలకు గురిచేయడం, బెదిరించడం, బూత్‌ల ఆక్రమణలకు పాల్పడడం, ఆయుధాలు తీసుకెళ్లడం, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయడం చట్టరిత్యా నేరమన్నారు. అభ్యర్థులు, ఓటర్లు, ఏజెంట్లు ఎన్నికల నియమావళిని పాటించాలని, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరం వరకు గుంపులుగా ఉండరాదని చెప్పారు. ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ శ్రీనివాసరావు, తాలుకా సీఐ విజయకృష్ణ, వీర నాయక్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


