మార్కాపురం టౌన్: మున్సిపల్ ఎన్నికల విధుల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఎం విజయ సునీత అన్నారు. ఎన్నికలను పురస్కరించుకుని పోలింగ్ ప్రక్రియపై స్థానిక శ్రీనివాస ఫంక్షన్ హాలులో సిబ్బందికి మంగళవారం ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలింగ్ రోజున స్టేషన్ స్థాయిలో అధికారులు నిర్వహించాల్సిన బాధ్యతలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఈవీఎంల వినియోగం, మాక్ పోల్ నిర్వహణ, వివిధ రకాల నమోదు ఫారాల భర్తీ ప్రక్రియలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు ఎదురైనా తక్షణమే ఉన్నతాధికారులకు సమాచారం అందించి సమర్థవంతంగా పరిష్కరించుకోవాలన్నారు. శిక్షణలో 444 మంది ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారులు పాల్గొన్నారు. శిక్షణలో భాగంగా సందేహాలను నివృత్తి చేస్తూ అధికారులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మార్కాపురం నగర మున్సిపల్ కమిషనర్ నారాయణ పాల్గొన్నారు.


