పట్టం కట్టండి..సమస్యలు పరిష్కరిస్తా | - | Sakshi
Sakshi News home page

పట్టం కట్టండి..సమస్యలు పరిష్కరిస్తా

Oct 27 2026 1:56 AM | Updated on Oct 27 2026 1:56 AM

వైఎస్సార్‌ సీపీ మేయర్‌ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌ ఎన్నికల ప్రచారంలో కుప్పంకు సమస్యలు విన్నవించిన స్థానికులు

ఒంగోలు సిటీ: కార్పొరేషన్‌ ఎన్నికల్లో మేయర్‌గా తనకు, వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్‌ అభ్యర్థులకు ఓటేసి గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని వైఎస్సార్‌ సీపీ ఒంగోలు మేయర్‌ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌ అన్నారు. స్థానిక 61వ డివిజన్‌ నెహ్రూ కాలనీ, 11వ డివిజన్‌ పులి వెంకటరెడ్డి కాలనీ, రాజీవ్‌ గృహకల్ప, ఇందిరమ్మ కాలనీల్లో శనివారం ఆయన పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన 560 ఇళ్ల స్థలాల పట్టాలను ప్రస్తుత ప్రభుత్వం నిలిపేసిందని, కాలనీలోని యానాదుల కుటుంబాలు ఇళ్లు, స్థలాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని పులివెంకటరెడ్డి కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ స్తంభం లేదనే కారణంతో తన గుడిసెకు కరెంటు సరఫరా చేయడం లేదంటూ మల్లవరపు రమణమ్మ తన బాధను వెళ్లబోసుకున్నారు. రహదారుల దుస్థితి, ప్రభుత్వ పథకాలు అందకపోవడం వంటి సమస్యలను స్థానికులు ప్రస్తావించారు. ఈ సందర్భంగా కుప్పం ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే గడపగడపకూ వెళ్తున్నామన్నారు. కాలనీవాసులు ఎదుర్కొంటున్న ఇళ్ల స్థలాలు, విద్యుత్‌, రహదారులు, సంక్షేమ పథకాల సమస్యలను గుర్తించామని, ప్రజల కష్టాలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, 11వ డివిజన్‌ అభ్యర్థి మరపాల స్వాతిని కూడా ఆదరించాలని కోరారు. కాలనీవాసుల సమస్యలు విన్న కుప్పం ప్రసాద్‌ వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు, కార్పొరేటర్‌ అభ్యర్థి నాగమణి, వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు అసెంబ్లీ పరిశీలకుడు వై.వెంకటేశ్వర్లు, మరపాల పూర్ణచంద్రరెడ్డి, యరజర్ల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement