కందుకూరు: కందుకూరు మండలం బడేవారిపాలేనికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు ఇంటూరి హరిబాబును అక్రమంగా అరెస్టు చేశారని, ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన సతీమణి భారతితో పాటు, మరికొందరు మహిళలు సోమవారం రాత్రి డీఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. హరిబాబును అక్రమంగా అరెస్టు చేశారని మహిళలు మండిపడ్డారు. వెంటనే విడుదల చేయాలని వారు డీఎస్పీని కోరారు. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి సుధాకర్ని తీసుకొస్తేనే హరిబాబును విడుదల చేస్తామని స్వయంగా డీఎస్పీ చెప్పడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన వ్యక్తి ఎంపీటీసీగా నామినేషన్ వేస్తే హరిబాబుకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఏ కేసులో అరెస్టు చేశారో కూడా చెప్పకుండా వేధించడం సరైన విధానం కాదని, పోలీసులు బేషరతుగా హరిబాబును విడుదల చేయాలంటూ ఆందోళనకు దిగారు.


