ఒకవైపు నామినేషన్లు అడ్డగింత.. మరోవైపు నకిలీ పత్రాల దాఖలు వైఎస్సార్ సీపీ పేరుతో టీడీపీ నేతల నయామోసం నాలుగు నియోజకవర్గాల్లో భారీగా బోగస్ నామినేషన్లు కనిగిరిలో 21, గిద్దలూరులో 23, కొండపిలో 18, యర్రగొండపాలెంలో 12 కోర్టులను తప్పుదోవ పట్టించేందుకేనంటూ విమర్శలు టీడీపీ నేతల తీరును ఛీత్కరిస్తున్న జనం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార తెలుగుదేశం పార్టీ బరితెగించింది. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న ఆ పార్టీ నేతలు కొత్త మోసానికి తెరతీశారు. వైఎస్సార్ సీపీ పేరుతో టీడీపీ వారే నామినేషన్లు వేసి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం పాలు చేశారు. కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కాపురం, దర్శి, కొండపి నియోజకవర్గాల్లో మొత్తం మీద 82 ఫేక్ నామినేషన్లు వేసి నయా కుట్రలకు తెరతీసింది. నియోజకవర్గాల వారీగా అందిన సమాచారం మేరకు కనిగిరిలో 21, గిద్దలూరులో 23, కొండపి నియోజకవర్గం మర్రిపూడిలో 18, యర్రగొండపాలెంలో 12, మార్కాపురంలో 5, దర్శిలో 3 ఈ తరహా నామినేషన్లు దాఖలైనట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ప్రజలు ఆ పార్టీని ఛీత్కరించుకుంటున్నారు.
ఇవిగో ఉదాహరణలు
మార్కాపురం నియోజకవర్గంలోని తర్లుపాడు మండలం సీతానాగులవరం ఎంపీటీసీ స్థానం నుంచి టీడీపీ కార్యకర్త నాగేళ్ల ఆంజనేయులు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పేరుతో నామినేషన్ దాఖలు చేశారు. యర్రగొండపాలెం మండలం గురిజేపల్లి ఎంపీటీసీ స్థానం నుంచి టీడీపీ నాయకుడు భవనం మల్లారెడ్డి కూడా వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్ వేశారు. గిద్దలూరు నియోజకవర్గం కంభంలో అయితే భార్యభర్తలు ఒకరు టీడీపీ తరఫున, మరొకరు వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్ వేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
కోర్టులను తప్పుదోవ పట్టించే యత్నమా?
పరిషత్ నామినేషన్ల సందర్భంగా మార్కాపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. వైఎస్సార్ సీపీ అభ్యర్థులను అడ్డుకోవడం, నామినేషన్ పత్రాలు చించివేయడం, మహిళా అభ్యర్థుల పట్ల దురుసుగా ప్రవర్తించడం వంటి ఘటనలు జరిగినట్లు ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తమకు నామినేషన్లు వేసే అవకాశం కల్పించలేదంటూ వైఎస్సార్ సీపీ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న నేపథ్యంలో.. ఆ పార్టీ పేరుతో నామినేషన్లు వేయడం వెనుక కోర్టులను తప్పుదోవ పట్టించే ఉద్దేశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసినట్లు చూపించేందుకే ఈ ఎత్తుగడ వేశారనేది వైఎస్సార్ సీపీ నాయకుల ఆరోపణ. ఈ వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.


