గిద్దలూరు రూరల్: ప్రమాదవశాత్తూ రైలు నుంచి జారిపడి ఇద్దరు మృతిచెందిన సంఘటనలు రెండు వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి. గిద్దలూరు పట్టణానికి చెందిన మద్దిరాల లక్ష్మీదేవి (46) తన భర్త పాండుతో కలిసి హైదరాబాద్ వెళ్లి శుక్రవారం తిరిగి గిద్దలూరు వచ్చింది. స్థానిక రైల్వేస్టేషన్‌లో రైలు దిగే సమయంలో ప్లాట్‌ఫాం నంబర్ 2లో రైలుకు – ప్లాట్‌ఫాంకు కొంత గ్యాప్ ఉండటం వలన ప్రమాదవశాత్తూ జారి రైలు చక్రాల కింద పడి రెండు ముక్కలై అక్కడికక్కడే మృతిచెందింది. భర్త పాండు పెద్దగా కేకలు వేసి రైలును నిలిపేందుకు ప్రయత్నించాడు. ఈలోపే లక్ష్మీదేవి శరీరం రెండు ముక్కలై అతని కళ్లముందే రైలు చక్రాల కిందపడి మృతిచెందడంతో తట్టుకోలేక తల్లడిల్లిపోయాడు. సమాచారం అందుకున్న నంద్యాల జీఆర్‌పీఎఫ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలు గిద్దలూరు మండలం తంబళ్లపల్లె గ్రామంలో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తుంటుంది. ఆమె భర్త పట్టణంలో ఏషియన్ పెయింటింగ్ వ్యాపారం చేస్తుండగా, ఇద్దరు పిల్లలున్నారు.
సోమరాజుపల్లి రైల్వే గేటు వద్ద
గుర్తుతెలియని వ్యక్తి...
సింగరాయకొండ: మండలంలోని సోమరాజుపల్లి రైల్వే గేటు సమీపంలో రైలు నుంచి జారిపడి సుమారు 45 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. రైల్వే జీఆర్‌పీ పోలీసుల కథనం ప్రకారం... నలుపు రంగు నిండు చేతుల చొక్కా, నీలి రంగు జీన్స్ ప్యాంటు ధరించి నల్లని ఒకపేట మొలతాడు, మెడలో ఎరుపురంగు దారానికి రుద్రాక్ష కలిగిన వ్యక్తి ప్రమాదవశాత్తూ రైలు నుంచి జారి పడి మృతిచెందాడు. మృతుని సమాచారం తెలిసిన వారు ఒంగోలు రైల్వే పోలీస్‌స్టేషన్ ఎస్సై టి.శ్రీరామ్ (9247575632)ను సంప్రదించాలని రైల్వే జీఆర్‌పీ పోలీసులు కోరారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టి.శ్రీరామ్ తెలిపారు.
వేర్వేరు ప్రాంతాల్లో ప్రమాదాలు
కళ్లముందే భార్య మరణంతో తల్లడిల్లిన భర్త


