● ఎన్నికల వ్యయ పరిశీలకుడు వివేక్
ఒంగోలు సబర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో సోషల్ మీడియా కంటెంట్ పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యయ పరిశీలకుడు వివేక్ సూచించారు. ఒంగోలు కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌లో ప్రకాశం జిల్లా వ్యయ పరిశీలకుడు వివేక్ జిల్లాలోని సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లతో ఆయన ప్రత్యేక పర్యవేక్షణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియామవాళి అమల్లో ఉన్నందున సోషల్ మీడియాల్లో ప్రచురించే ప్రతి పోస్ట్, రీల్, వీడియో, కంటెంట్‌పై కమాండ్ కంట్రోల్ రూమ్‌లోని మీడియా సర్వేలెన్స్ బృందాలు నిరంతరం ప్రత్యేక నిఘా ఉంచుతున్నాయని తెలిపారు.కులాలు, మతాలు, వర్గాల మధ్య విభేదాలు రేకెత్తించేలా గానీ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా గానీ, అభ్యర్థుల వ్యక్తిగత ప్రతిష్టను భంగపరిచేలా గానీ ఎటువంటి వివాదాస్పద కంటెంట్‌ను తయారు చేయడం లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాజకీయ పార్టీలు లేదా పోటీ చేసే అభ్యర్థుల తరఫున సోషల్ మీడియా వేదికగా చేసే ప్రచారాలు, చెల్లింపుల కంటెంట్, బ్రాండ్ కొల్లాబరేషన్లు అన్నీ కూడా నేరుగా అభ్యర్థుల ఎన్నికల వ్యయం పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు. ఇన్‌ఫ్లూయెన్సర్లు పొందే ప్రచార రుసుంలను షాడో అబ్జర్వేషన్ రిజిస్టర్‌లో నమోదు చేస్తామని, వీటిని పారదర్శకంగా ఎన్నికల అధికారులకు వెల్లడించాల్సి ఉంటుందని గుర్తుచేశారు. అభ్యర్థుల ప్రచార సంబంధ ప్రకటనలు లేదా వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు జిల్లా స్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ నుంచి ముందస్తు అనుమతి పొందాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సోషల్ మీడియా ప్రతినిధులు, క్రియేటర్లు పూర్తి సహకారం అందించాలని కోరారు. సమావేశంలో జిల్లా ఎక్స్పెండేచర్ మానిటరింగ్ కమిటీ నోడల్ అధికారి తిరుపతయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.


