ఒంగోలు సబర్బన్: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. తొలిరోజు నామినేషన్లు వేసేవారు ఎలాంటి ఇబ్బంది పడకుండా సంబంధిత పత్రాలను సమర్పించినట్లు చెప్పారు. ఈ ఎన్నికలకు బుధవారం నుంచి నామినేషన్లు ప్రారంభమైన నేపథ్యంలో ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారిలతో కలిసి బుధవారం ప్రకాశం భవనంలోని ఎన్నికల మీడియా సెంటర్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలు ఆయన వెల్లడించారు. దర్శి, తాళ్లూరు, ముండ్లమూరులో నామినేషన్లకు చేసిన ఏర్పాట్లను స్వయంగా తాను పరిశీలించినట్లు కలెక్టర్ చెప్పారు. నామినేషన్ల దాఖలుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు, పోలీసు సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నామినేషన్ వేసే వ్యక్తితో పాటు మరో ఇద్దరిని మాత్రమే లోపలికి అనుమతించాలని చెప్పామన్నారు. నామినేషన్ దాఖలులో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే కలెక్టరేట్లో 1077 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని, దీని ద్వారా తమ దృష్టికి తీసుకురావచ్చు అని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల నిర్వహణలో రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని ఆయన కోరారు. ఎన్‌ఓసీ, నో డ్యూస్ సర్టిఫికెట్లు లేకపోయినా అభ్యర్థులు తమ నామినేషన్లను సమర్పించవచ్చని కలెక్టర్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల సమయంలో దర్శిలో చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోటీలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించకుండా నిలిపివేస్తున్నట్లు వివరించారు. ఎస్పీ మాట్లాడుతూ కందుకూరు, సింగరాయకొండ ప్రాంతాల్లో పర్యటించి భద్రతాపరంగా చేపట్టిన చర్యలను పరిశీలించినట్లు చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాలలో ప్రత్యేక పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్ల సెంటర్లకు వంద మీటర్ల నిబంధన కచ్చితంగా అమలయ్యేలా చూస్తున్నామన్నారు.
ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురైతే టోల్‌ఫ్రీ నంబర్ – 1077కు ఫోన్ చేయండి
దర్శిలో తుది జాబితా ప్రకటించకుండా నిలిపివేత
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్ణయం
అధికారులతో ఎన్నికల పరిశీలకులు


