దండయాత్ర! | - | Sakshi
Sakshi News home page

దండయాత్ర!

Oct 23 2026 2:15 AM | Updated on Oct 23 2026 2:15 AM

ప్రాదేశిక పోరులోనూ పచ్చమూకల స్వైరవిహారం మహిళా అభ్యర్థులపై సైతం టీడీపీ గూండాల ఆగడాలు

నామినేషన్ల రెండోరోజూ కొనసాగిన రౌడీయిజం దర్శి, మార్కాపురం, కనిగిరి, కొండపి, కందుకూరు, గిద్దలూరు నియోజకవర్గాల్లో బరితెగింపు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలు లాక్కుని చించివేత టీడీపీ గూండాలను అదుపు చేయలేని దుస్థితిలో పోలీస్‌ వ్యవస్థ వారికి సంపూర్ణ సహకారం అందిస్తున్న అధికారులు, పోలీసులు

టీడీపీ..పోలీసు
ప్రాదేశిక పోరులోనూ పచ్చమూకల స్వైరవిహారం
మహిళా అభ్యర్థులపై సైతం టీడీపీ గూండాల ఆగడాలు

సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా పోలీసుల తీరు మారలేదు. అధికార పార్టీ నేతల దౌర్జన్యాలకు అడ్డుకట్ట పడలేదు. ప్రజాస్వామ్యానికి పునాదులైన ఎన్నికల ప్రక్రియను బలప్రయోగంతో బలితీసుకునే ప్రయత్నాలు ఆగలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల రెండో రోజూ అధికార టీడీపీ అరాచకాలు కొనసాగాయి. ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను అడ్డుకునేందుకు కిరాయి మూకలు బరితెగించాయి. మహిళా అభ్యర్థులపైనా దాడులకు తెగబడ్డాయి. నామినేషన్‌ పత్రాలను చించివేసి అభ్యర్థులను గాయపరిచాయి. ఇదంతా జరుగుతున్నా అడ్డుకోవాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తాయి. పైగా అధికార పార్టీ మూకలకు అండగా నిలిచి ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్లకు ఆటంకాలు సృష్టించారనే ఆరోపణలొచ్చాయి. ఈ దౌర్జన్యాలపై కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జిలు ధర్నాలకు దిగారు. న్యాయస్థానం హెచ్చరికలనూ భేఖాతరు చేయకుండా సాగిన ఈ దమనకాండతో రెండోరోజూ నామినేషన్ల ప్రక్రియలో అధికార పార్టీ బలప్రయోగమే పైచేయిగా నిలిచింది.

గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న సీపీఎం నాయకుడు ఆవులయ్య

పొన్నలూరు: టీడీపీ మూకలు చించివేసిన నామినేషన్‌ పత్రాలు

తిమ్మాపురం: వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి రంగలక్ష్మమ్మ నామినేషన్‌ను చించిపడేస్తున్న టీడీపీ నాయకుడు

పీసీ పల్లి: వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను అడ్డుకుంటున్న పోలీసులు

కొనకనమిట్ల నామినేషన్‌ కేంద్రం వద్ద హల్‌చల్‌ చేస్తున్న టీడీపీ గూండాలు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రకియలో రెండోరోజూ పచ్చమూకలు, కిరాయి గూండాల దాడులతో ఉమ్మడి జిల్లా రణరంగంగా మారింది. నామినేషన్‌ కేంద్రాల వద్ద మాటువేసి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను లాక్కుని చించివేయడం, భౌతిక దాడులకు పాల్పడటం, మహిళా అభ్యర్థుల పట్ల సైతం అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి దురాగతాలకు దిగారు. వారికి పోలీసులు సంపూర్ణ సహకారాన్ని అందించారు. దీంతో జిల్లాలోని కనిగిరి, కొండపి, మార్కాపురం, దర్శి, గిద్దలూరు వంటి నియోజకవర్గాల్లో గురువారం నామినేషన్‌ల ప్రక్రియ పూర్తి గందరగోళంగా మారింది.

● కొండపి నియోజకవర్గంలో రెండో రోజూ నామినేషన్ల ప్రక్రియలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులకు ఇక్కట్లు తప్పలేదు. పొన్నలూరు మండలంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయనీయకుండా పెద్ద ఎత్తున బయట వ్యక్తులను తీసుకొచ్చారు. కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పోలీసులు కూడా టీడీపీ వర్గీయులకే సహకరించారు. దీంతో టీడీపీ, వైఎస్సార్‌ సీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడగా.. పోలీసులు వైఎస్సార్‌ సీపీ శ్రేణులనే నిలువరించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ పొన్నలూరు వెళ్లి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల నామినేషన్‌కు సహకరించాలని డీఎస్పీ చేతులు పట్టుకుని వేడుకున్నారు. ఆ తర్వాత కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేశారు. చివరకు ఇద్దరు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేశారు. కొండపి మండలంలో వెన్నూరు ప్రాదేశికానికి టీడీపీ ఎంపీపీ అభ్యర్థి పోటీ చేస్తుండటంతో ఆ స్థానం నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులెవ్వరూ నామినేషన్‌ వేసేందుకు వీల్లేదని టీడీపీ పెద్దల ఆదేశాలతో పచ్చనేతలు రెచ్చిపోయారు.

● మార్కాపురం నియోజకవర్గంలోని కొనకనమిట్ల, తర్లుపాడు కేంద్రాల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను నామినేషన్‌ల కేంద్రంలోకి పోలీసులు అనుమతించలేదు. మహిళా అభ్యర్థులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. నామినేషన్‌ కేంద్రం వద్ద వందల సంఖ్యలో టీడీపీ గూండాలు మొహరించి కవ్వింపు చర్యలకు దిగారు. కర్రలు, రాడ్లు, రాళ్లతో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులపై దాడులు చేశారు. ఈ దాడిలో పలువురు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులకు గాయాలయ్యాయి. కొనకనమిట్లలో అభ్యర్థులతో నామినేషన్‌ కేంద్రం వద్ద ఆందోళన చేశారు.

● గిద్దలూరు మండల కేంద్రంలో నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన తిమ్మాపురం ఎంపీటీసీ అభ్యర్థి జంగాల రంగలక్ష్మమ్మ నామినేషన్‌ పత్రాలు లొక్కుని చించివేశారు. సీపీఎం ఎంపీటీసీ అభ్యర్థి పోషణ అంజమ్మ నామినేషన్‌కు మద్దతుగా వెళ్లిన ఆవులయ్యపై టీడీపీ గూండాలు దాడి చేసి రక్తం వచ్చేలా తీవ్రంగా కొట్టారు. బేస్తవారిపేటలో బీజేపీ అభ్యర్థి బేస్తవారిపేట–2 ఎంపీటీసీ స్థానానికి నాగమల్లి శైలజ నామినేషన్‌ వేసేందుకు కేంద్రంలోకి వెళ్లిన సమయంలో టీడీపీ వ్యక్తులు పత్రాలు లాక్కెళ్లారు. శైలజ, బీజేపీ నేతలు గట్టిగా నిలదీయడంతో రేపు నామినేషన్‌ వేయిస్తామని చెప్పి పంపారు. మళ్లీ మధ్యాహ్నం మూడు గంటల సమయంలో బీజేపీ నేతలతో నామినేషన్‌ వేసేందుకు వెళ్లినప్పటికీ మళ్లీ టీడీపీ నాయకులు అడ్డుకుని వెళ్లగొట్టారు.

● కొమరోలు ఒకటి, రెండు, మూడు ప్రాదేశిక స్థానాలకు నామినేషన్‌ వేసేందుకు సీపీఎం నాయకుడు ఆవులయ్యతో పాటు పోనాని అంజమ్మ తన అభ్యర్థులతో కలిసి మధ్యాహ్నం 3 గంటలకు పోలీసులు ఏర్పాటు చేసి బ్యారికేడ్ల వద్దకు వెళ్లగా.. మూడు గంటలకు రావాలని చెప్పారు. టీడీపీ నాయకులకు నామినేషన్‌ వేసేందుకు అనుమతిస్తున్నారని, ప్రతిపక్షాలకు ఎందుకు ఇవ్వడం లేదని సీపీఎం నాయకుడు ఆవులయ్య ప్రశ్నించారు. మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చి నామినేషన్‌ వేయాలని ఎస్సై నాగేంద్రరావు సూచించడంతో ఆయన మాటను గౌరవించి అంజమ్మ తన బృందంతో వెనక్కి వెళ్లిపోయారు. మళ్లీ మూడు గంటలకు రావడంతో అక్కడున్న టీడీపీ నాయకులు పోలీసుల సమక్షంలోనే సీపీఎం నాయకుడు ఆవులయ్యపై దాడి చేశారు. ఈ దాడిలో ఆవులయ్య తలకు తీవ్రగాయాలు కావడంతో కిందపడిపోయాడు. అక్కడున్న సీపీఎం అభ్యర్థులు వెంటనే 108 వాహనానికి సమాచారం అందించడంతో వెంటనే 108 వాహనంలో గిద్దలూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. అనంతరం సీపీఎం నాయకురాలు అంజమ్మ మాట్లాడుతూ తమ నాయకుడికి ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతని అన్నారు.

● కనిగిరి నియోజకవర్గంలోని వెలిగండ్ల నామినేషన్‌ కేంద్రంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు నామినేషన్‌లు వేయకుండా టీడీపీ మూకలు అడ్డుకున్నాయి. తమకు నామినేషన్‌లు వేసే అవకాశం కల్పించాలని వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు పోలీసుల కాళ్లుపట్టుకుని మరీ వేడుకున్నారు.

● దర్శి నియోజకవర్గం దొనకొండలో నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన ఆరుగురు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గేటు వద్దే అడ్డుకున్న టీడీపీ గూండాలు విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచారు. ఇక ముండ్లమూరులో ఈదర గ్రామం ఎంపీటీసీ అభ్యర్థిగా అంబాని రాధాకుమారి నామినేషన్‌ వేయగా నరసరావుపేట నుంచి వచ్చిన టీడీపీ గూండాలు అధికారుల చేతుల్లోని నామినేషన్‌ పత్రాలు లాక్కుని మరీ చించివేశారు.

● కురిచేడు మండలంలో వైఎస్సార్‌ సీపీ అఽభ్యర్థులు నామినేషన్‌ కేంద్రానికి వచ్చారని తెలుసుకున్న దర్శి ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి మామ కడియాల రమేష్‌ 50 మంది గూండాలను తీసుకుని వచ్చారు. లోపల నామినేషన్లు వేసి బయటకు వస్తున్న వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌, అభ్యర్థులపై కర్రలు, రాడ్లతో విచక్షణా రహితంగా దాడిచేశారు. దుస్తులు చింపి రశీదులు లాక్కుని చించివేశారు. కొట్టవద్దని ప్రాధేయపడుతున్నా వినకుండా ‘వైసీపీ నా కొ...ల్లారా.. మీకు ఎంత దమ్ముంటే నామినేషన్‌ వేస్త్రారా..? మిమల్ని నరకానికి పంపుతా’ అంటూ విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌, బీసీ నాయకులు యన్నాబత్తుల వెంకట సుబ్బయ్యకు తీవ్రగాయాలయ్యాయి. మిగతా వారు కూడా గాయపడగా ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు.

● తాళ్లూరు మండలంలో గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్తున్న వైఎస్సార్‌ సీపీ మహిళా అభ్యర్థులను అడ్డుకోవడంతో పాటు వారిపై దాడులు చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. నరసరావుపేట ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో వ్యక్తులను తాళ్లూరు మండల కేంద్రానికి తీసుకొచ్చి దాడులు చేయించి వారి సెల్‌ఫోన్లు పగలగొట్టారు. ఈ ఘటనలను వీడియో తీస్తున్న స్థానికులపై కూడా గుంపుగా దాడి చేశారు. తురకపాలెం, రాజానగరం, తూర్పు గంగవరం తదితర గ్రామాలకు చెందిన వైఎస్సార్‌ సీపీ మహిళా ఎంపీటీసీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. నామినేషన్లు వేస్తే చంపేస్తామంటూ బెదిరించారు.

● కందుకూరు నియోజకవర్గంలోని లింగసముద్రం కేంద్రంలో నామినేషన్‌లు వేసేందుకు వెళ్లిన వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను ఉద్దేశపూర్వకంగా పోలీసులు అడ్డుకుని లోపలికి అనుమతించలేదు. మధ్యాహ్నం తర్వాత పంపుతామంటూ కాలయాపన చేసి సమయం ముగిసిన తరువాత అభ్యర్థులను లోపలికి పంపి సమయం అయిపోయిందంటూ డ్రామాలాడారు. అలాగే వలేటివారిపాలెంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను టీడీపీ గూండాలు చించివేశారు.

మారని పోలీసుల తీరు...

స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతి భద్రతల పరిరక్షణకు సంబంధించి సుప్రీంకోర్టు తలంటుతున్నా పోలీసుల పనితీరులో మాత్రం మార్పురావడం లేదు. నామినేషన్‌ కేంద్రాల్లో టీడీపీ గూండాలకు కొమ్ముకాయడమే తమ పని అన్నట్లు విధులు నిర్వర్తిస్తున్నారు. రెండో రోజు కూడా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవడంలో పోలీసులే సైంధవ పాత్ర పోషించారు. నామినేషన్‌ వేసేందుకు వచ్చిన అభ్యర్థులను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, తర్వాత పంపిస్తామంటూ నమ్మబలికి సమయం ముగిసేలా డ్రామాలాడటం, ఆ సమయానికి టీడీపీ నాయకులను పిలిపించి దాడులు చేయించడం వంటివాటికి పాల్పడుతున్నారు. అలాగే నామినేషన్‌ కేంద్రాల్లోనే వందల మంది టీడీపీ మూకలు కర్రలు, రాడ్లు, రాళ్లతో మాటువేసి దాడులు చేస్తుంటే కనీసం నివారించే ప్రయత్నం కూడా పోలీసులు చేయడం లేదు. నామినేషన్‌లు వేసేందుకు వస్తున్న మహిళా అభ్యర్థుల పట్ల గంజాయి, మద్యం మత్తులో జోగుతున్న టీడీపీ గూండాలు అత్యంత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. కేంద్రాలకు వెళ్లిన మహిళా అభ్యర్థులను అడ్డుకుని పత్రాలు లాక్కునే క్రమంలో వారి చీరలు లాగడం, దుస్తులు చించివేయడం, మీద చేతులు వేయడం వంటి దుస్సహాసాలకు ఒడిగడుతున్నారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నా కనీసం వారించే ప్రయత్నం చేయకపోవడంపై మహిళా అభ్యర్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మనం ఏ సమాజంలో బతుకుతున్నామంటూ పోలీసులు తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్సార్‌ సీపీ ముఖ్యనాయకుల ఆందోళన...

నామినేషన్ల ప్రక్రియలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులపై దాడుల నేపథ్యంలో వైఎస్సార్‌ సీపీ కీలక నాయకులు రోడ్లపై ఆందోళనలకు దిగారు. పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నా రాంబాబు పొదిలిలో అభ్యర్థులతో కలిసి పెద్ద ఎత్తున రోడ్డుపై ధర్నాకు దిగారు. అలాగే మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పొన్నలూరులో అభ్యర్థులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. లింగసముద్రం కేంద్రం వద్ద వైఎస్సార్‌ సీపీ కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్‌ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పోలీసులు, ఎన్నికల అధికారులు ఉద్దేశపూర్వకంగా నామినేషన్లను అడ్డుకుంటున్నారంటూ ఆరోపించారు.

● యర్రగొండపాలెంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ను, కనిగిరిలో వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి దద్దాల నారాయణయాదవ్‌ను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. ఈ సంఘటనలను బట్టి చూస్తే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఏ స్థాయిలో పచ్చనేతల గూండాయిజం రాజ్యమేలుతోందో అర్ధం చేసుకోవచ్చు.

యర్రగొండపాలెం: వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ అభ్యర్థిని కుమారుడు సుబ్బారెడ్డిపై దాడి

వెలిగండ్ల: నామినేషన్‌కు పంపించాలని ఎస్సై కాళ్లు పట్టుకుంటున్న వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement