బేస్తవారిపేట: మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ గిద్దలూరు ఇన్‌చార్జి కేపీ నాగార్జునరెడ్డిని గురువారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మార్కాపురం ఎస్సై నోటీసులు అందచేసి మార్కాపురంలోని స్వగృహంలో మాజీ ఎమ్మెల్యే కేపీని బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కేపీ మాట్లాడుతూ పోలీసులను అడ్డుపెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దుర్మార్గానికి పాల్పడుతుందన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులతో ఒక్క నామినేషన్ కూడా వేయనీయకుండ నామినేషన్ కేంద్రాల వద్ద అలజడి సృష్టిస్తున్నారన్నారు.
కంభం: నామినేషన్ వేయకముందే వైఎస్సార్ సీపీ ఎంపీపీ అభ్యర్థి షేక్ మున్నా(డిష్ మున్నా)ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. తెల్లవారుజాము నుంచే పలువురు వైఎస్సార్ సీపీ నాయకులకు, అభ్యర్థులకు పోలీసులు నోటీసులు జారీ చేసారు. ఎంపీపీ అభ్యర్థి డిష్ మున్నాతో పాటు వైఎస్సార్‌సీపీ స్టేట్‌యూత్ వింగ్ సెక్రటరీ నెమలిదిన్నె చెన్నారెడ్డి, నాయకులు శరభారెడ్డి, రఫి, గురుమూర్తి, జాకీర్, రాఘవలను పోలీసులు అదుపులోకి తీసుకొని సాయంత్రం వరకు స్టేషన్‌లో ఉంచారు.
సింగరాయకొండ: పాకల తీరంలో గురువారం తెల్లవారుజామున మళ్లీ సోనాబోట్లు హల్‌చల్ చేశాయి. తెల్లవారుజామున 6:30 గంటల సమయంలో పాండిచ్చేరి రాష్ట్రం కరైకల్‌కు చెందిన సోనాబోట్లు తీరానికి 8 కిలోమీటర్ల దూరం వేట సాగించాల్సి ఉండగా కేవలం 50 మీటర్ల దూరంలో వేట సాగించారు. దీంతో పాకల పంచాయతీకి చెందిన చంద్రయ్య అనే మత్స్యకారుని వల తెగి సుమారు రూ. 10 వేల నష్టం వాటిల్లింది. చాలా రోజులుగా సోనాబోట్లు తీరంలో వేటాడుతున్నా అడ్డుకునే వారే లేరన్నారు. నెలకు సుమారు 25 రోజుల పాటు సోనాబోట్ల తాకిడి ఉందని మత్స్యకారులు వాపోతున్నారు. రెండు రోజుల క్రితం పాకల పోతయ్యగారిపట్టపుపాలెంకు చెందిన చిట్టిబాబు అనే మత్స్యకారునికి చెందిన రూ.30 వేల విలువైన వల కూడా ధ్వంసమైంది. ఈ విధంగా ప్రతిరోజు ఏదో మత్స్యకారుని వల ధ్వంసం నష్టపోవడం, వేలాది రూపాయల వలతో పాటు వేటాడిన చేపలు కూడా సముద్రం పాలవుతున్నాయని మత్స్యకారులు వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సోనాబోట్లను తీరంలో వేటాడకుండా అడ్డుకోవాలని మత్స్యకారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
పొదిలి రూరల్: ఆటో బోల్తా పడి 8 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని మల్లవరం సబ్‌స్టేషన్ సమీపంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే..దర్శి నుంచి ప్రయాణికులను ఎక్కించుకొని పొదిలికి వస్తున్న ఆటో మల్లవరం సబ్‌స్టేషన్ వద్దకు రాగానే బోల్తా పడింది. ప్రమాదంలో ఆటోలో ఉన్న ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడటంతో పలువురికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 వాహనంలో సంఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరిలో దామా వెంకట్రావుకు తలకు బలమైన గాయమైంది. ఒంటేరు నవీన్ కాలుకు తీవ్ర గాయం కావడంతో మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలుకు తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నవీన్
తలకు గాయమైన దామా వెంకట్రావు


